కోస్తాకు మరో తుపాన్ ముప్పు
- బలపడుతున్న తీవ్ర వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాన్ ముప్పు పొంచి ఉంది. మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరింత బలపడుతూ కోస్తా వైపు కదులుతోంది. గురువారం రాత్రికి ఈ తీవ్రవాయుగుండం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 560 కిలోమీటర్లు, ఒడిశాలోని పారదీప్‌కు దక్షిణ ఆగ్నేయంగా 690 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకతమై ఉంది.
ఇది వాయవ్య దిశగా పయనిస్తూ శుక్రవారం ఉదయానికల్లా తుపాన్‌గా మారనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలహీనపడుతూ తొమ్మిదో తేదీ ఉదయానికి కోస్తాలో తీరాన్ని దాటవచ్చని తెలిపింది. తుఫాన్‌గా మారకుండానే వాయుగుండంగానే కోస్తాలో తీరం దాటవచ్చని ఐఎండీ అంచనా వేసింది.