విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : పంచాయతీ సమరం ముగిసింది. మండల పరిషత్తు సంగ్రామానికి తెరలేచింది. మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల(ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ఆయా స్థానాల విషయమై కసరత్తు వేగవంతం చేసింది. ఈ నెల 13లోగా ఎంపీటీసీ స్థానాల పునర్విభజనకు ఏర్పాట్లు చకాచకా సాగిపోతున్నాయి. 14న ప్రాథమిక నోటిఫికేషన్, 28 తుది జాబితాను ప్రకటించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తాజా అంచనా ప్రకారం జిల్లాలో ఎంపీటీసీ స్థానాలు పెరగనున్నాయి. దీనిపై గురువారం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
జనాభా ఆధారంగా ఎంపీటీసీ స్థానాలు
జనాభా ఆధారంగా ఎంపీటీసీ స్థానాల పునర్విభజన చేపడుతున్నారు. 2006లో జరి గిన స్థానిక సంస్థల పాలక వర్గాల ఎన్నిక 2001 జనాభా ప్రకారం జరిగింది. ఈ దఫా 2011 జనాభా గణాంకాలు అందుబాటులోకి వచ్చా యి. ఫలితంగా ప్రాదేశిక నియోజకవర్గాల సం ఖ్య పెరగ నుంది. దీని కోసం ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించి జిల్లాకు పంపింది. ఒక్కో ఎంపీటీసీ స్థానం పరిధిలో కనీసం 3500 మంది జనాభా ఉండాలని, అత్యధికంగా 4 వేలు మించకూడదని నిబంధన ఉంది. భౌగోళికంగా ప్రత్యేక పరిస్థితుల్లో మినహా ఎంపీటీసీ స్థానాల ఏర్పాటులో నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది.
సాధ్యమైనంత వరకు గ్రామ పంచాయతీ పరిధిలోనే ఎంపీటీసీ స్థానాలు ఉండేలా ప్రయత్నించాలని సూచించింది. సాధ్యం కానిపక్షంలో పక్క పం చాయతీలోని జనాభాను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. 2011 జనాభా లెక్కల ప్రకా రం గ్రామీణ ప్రాంత జనాభా 22.54 లక్షలు. ఈమేరకు ఏయే మండలాల్లో జనాభా పెరిగిందన్న విషయంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎంపీటీసీ స్థానాల పునర్విభజనపై జాబితాలను సిద్ధం చేయాలని అధికారులు ఎంపీడీవోలను ఆదేశించారు. ఇప్పటికే ఆయా జాబితాలను రూపొందించే పనిలో ఎంపీడీవోలు నిమగ్నమయ్యారు. జిల్లాలో ప్రస్తుతం 624 ఎంపీటీసీ స్థానాలు ఉండగా పునర్విభజన తరువాత ఈ సంఖ్య మరింత పెరగనుంది. ఎంపీటీసీ లెక్కపై గురువారం ఒక స్పష్టత వచ్చే అవకాశముంది.
14న ప్రాథమిక నోటిఫికేషన్ : ఎంపీటీసీ స్థానాల పునర్విభజన ప్రక్రియ ఈ నెల 13 లోగా పూర్తికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 14న ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. దీనిపై 21వ తేదీలోగా అభ్యంతరాలను స్వీకరించి 22 నుంచి 26 వరకు పరిశీలిస్తారు. 28న ఎంపీటీసీ స్థానాల తుది జాబితాను ప్రకటిస్తారు. అదే రోజున దా నిని ప్రభుత్వానికి పంపుతారు. ఎంపీటీసీ స్థా నాలతో పాటు జెడ్పీటీసీ స్థానాల జాబితా రూ పొందించిన తరువాత వీటికి రిజర్వేషన్లను కూడా ఖరారు చేస్తారు. గ్రేటర్‌లో విలీనమవుతున్న 10 పంచాయతీలను కూడా పరిగణనలోకి తీసుకొని రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఇదిలా ఉంటే స్థానిక ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ఎం పీటీసీ స్థానాల్లో సగం మహిళలకే దక్కనున్నా యి. మండల అధ్యక్ష స్థానాలతో పాటు సగం జె డ్పీటీసీ స్థానాలకు కూడా రిజర్వు కానున్నాయి.
1933 పోలింగ్ కేంద్రాలు
ఈ ఎన్నికల కోసం మొత్తం 1933 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. బ్యాలెట్ పద్ధతిన జరిగే ఈ ఎన్నికలకు 4222 బ్యాలెట్ బాక్సులు అవసరమని అధికారులు గుర్తిం చారు. వీటిని సిద్ధం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ పోరు గ్రామాల్లో రాజకీయ వేడిని రగిల్చింది. ఇక పార్టీల గుర్తుల ఆధారంగా జరిగే ఈ జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు బాటలు వేయనున్నాయి. సమైక్యాంధ్ర సెగ ప్రభావం ఈ ఎన్నికలపై పడే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వెంటనే వీటిని నిర్వహించాలని గట్టి నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ సక్రమంగా జరిగితే వచ్చే నెలాఖరులో ఈ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.