సమైక్యాంధ్ర పరిరక్షణ పోరు జిల్లాలో హోరెత్తుతోంది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఏపీ ఎన్జీవోల పిలుపు మేరకు జిల్లాలో రహదారులను మంగళవారం అష్టదిగ్బంధం చేశారు. ఎక్కడికక్కడ భారీ ప్రదర్శనలు, మానవహారాలు నిర్మించారు. దీంతో జిల్లా అంతటా రోడ్లపై ట్రాఫిక్ గంటలతరబడి నిలిచిపోయింది. రైతులు, న్యాయవాదులు, ఉద్యోగులు, విద్యార్థులు, వృత్తి కార్మికులు, మహిళలు ఉద్యమంలో పాల్గొన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై నిరసన గళం వినిపించారు.
సాక్షి, విజయవాడ : సమైక్య ఉద్యమం కోసం ఊరూవాడా ఏకమైంది. ఏపీ ఎన్జీవోల పిలుపు మేరకు జిల్లాను మంగళవారం అష్టదిగ్బంధం చేశారు. రహదారులపై భారీ ప్రదర్శనలు, మానవహారాలు నిర్వహించి ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. కైకలూరు తాలుకా సెంటర్ వద్ద ఉద్యోగులు పామర్రు-కత్తిపూడి 14వ నంబర్ జాతీయరహదారిపై ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. గంటకుపైగా రహదారిపై ఆందోళన చేశారు. జగ్గయ్యపేటలో అనుమంచిపల్లి గ్రామ సమీపంలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉద్యోగ, ఎన్జీఓ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధం చేశారు. మహిళా ఉద్యోగులు ఆటలు ఆడగా, విద్యార్థులు నృత్యాలు చేశారు. జేఏసీ నాయకులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. తేలప్రోలులో ఉషారామా ఇంజినీరింగ్ కాలేజీ ఎదుట జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేసి నినాదాలు చేశారు. జాతీయరహదారిపై కబడ్డీ ఆడి వినూత్న నిరసన తెలిపారు. మైలవరం జాతీయ రహదారిలోని తెలుగు తల్లి సెంటర్‌లో మానవహారం నిర్మించారు.
బస్సులతో నిరసన ప్రదర్శన..
తిరువూరులో ఉపాధ్యాయులు, సమైక్య జేఏసీ, ఆర్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం చేశారు. ఆర్టీసీ కార్మికులు అద్దె బస్సులతో పట్టణంలో ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. విజయవాడ-జగదల్‌పూర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. గుడివాడలో నాలుగు వైపులా రోడ్లు పూర్తిగా మూసేసి రాస్తారోకో చేపట్టారు. అవనిగడ్డ మండలం పులిగడ్డలో జేఏసీ ఆధ్వర్యంలో 216 జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో రెండు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.
200 ఎడ్లబళ్లతో..
ఉయ్యూరులో రైతులు కేసీపీ కర్మాగారం నుంచి వీరమ్మ తల్లి ఆలయం వరకు 200 ఎడ్లబళ్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రధాన సెంటర్లో బళ్లతో మానవహారంగా ఏర్పడి రహదారులను దిగ్బంధించారు. గండిగుంట బైపాస్ రోడ్డు వద్ద ఉద్యోగ సంఘాల జేఏసీ నేతృత్వంలో ఉద్యోగులు, కార్మికులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కలిదిండి మండలం మూలలంకలో విద్యార్థుల ర్యాలీ, గుర్వాయిపాలెంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు జరిగాయి. వత్సవాయిలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద గ్రామస్తులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. వ్యాపారులు మైలవరంలో ర్యాలీ నిర్వహించారు. విస్సన్నపేటలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బంద్, రాస్తారోకో, ప్రదర్శన, రిలేదీక్షలు కొనసాగాయి. గుడివాడ నెహ్రూచౌక్‌లో జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్ష కొనసాగుతోంది. న్యాయవాదులు మునిసిపల్ కార్యాలయం ఎదుట కోర్టు నిర్వహించి నిరసన తెలిపారు.
న్యాయశాఖ ఉద్యోగుల వంటావార్పు..
మచిలీపట్నంలో న్యాయశాఖ ఉద్యోగులు వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. మైలవరంలో శ్రీ వెంకటేశ్వర నాయీ బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించి తెలుగు తల్లి సెంటర్‌లో మానవహారం నిర్మించారు. ఇబ్రహీంపట్నం సెంటర్‌లో టైలర్లు జాతీయ రహదారిపై మిషన్‌లతో బట్టలు కుట్టి నిరసన తెలిపారు. గన్నవరంలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో వ్యవసాయశాఖ అధికారులు, ఆదర్శ రైతులు పాల్గొన్నారు. జాతీయ రహదారిపై మానవహారం నిర్మించారు. కంకిపాడులో వస్త్ర, కిరాణా మర్చంట్స్, కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్, ఆర్యవైశ్య సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతమైంది. దుకాణదారులు రోడ్డుపై క్రికెట్ ఆడి సమైక్యాంధ్రకు మద్దతు తెలిపారు. ఉయ్యూరులో కటింగ్ సెలూన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాయీబ్రాహ్మణులు రిలేదీక్షలు చేపట్టారు.
పెడన మహాత్మాగాంధీ షాపింగ్ కాంప్లెక్స్‌లో పెడన ప్లాట్ ఫాం రిక్షా వర్కర్స్ యూనియన్ నేతృత్వంలో రిలే దీక్ష చేశారు. పెడన నియోజకవర్గ సమన్వయకర్తలు వాకా వాసుదేవరావు, ఉప్పాల రాం ప్రసాద్ సంఘీభావం తెలిపారు. రహదారుల దిగ్బంధంతో పాటు బంటుమిల్లిలో బంద్ పూర్తిగా విజయవంతమైంది. కంచికచర్లలో పోలీస్‌స్టేషన్ ఎదురుగా జాతీయ రహదారిపై కేఆర్‌బీ విద్యార్థినులు రాస్తారోకో, మానవహారం నిర్మించారు. జాతీయ రహదారిపై సమైక్యాంధ్ర ముగ్గులు వేశారు. కంచికచర్ల చెరువుకట్ట వద్ద జాతీయ రహదారిపై ఎన్జీఓలు, ఆర్టీసీ ఉద్యోగులు, జేఏసీ నాయకులు రాస్తారోకో చేసి, కబడ్డీ ఆడారు. నూజివీడులో ఆర్టీసీ కార్మికులు అద్దె బస్సులతో ర్యాలీ నిర్వహించారు. ముస్లిం జనరల్ బాడీ ఆధ్వర్యంలో చిన్న గాంధీబొమ్మ సెంటర్‌లో వంటావార్పు చేశారు.
విజయవాడలో పోరు హోరు..
విజయవాడలో ఉద్యమం హోరెత్తింది. విజయవాడలో రామవరప్పాడు రింగ్, గొల్లపూడి, బెంజిసర్కిల్ వద్ద రోడ్లను దిగ్బంధం చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష జరిపారు. న్యాయవిభాగం సిబ్బంది కోర్టుల ప్రాంగణానికి తాళాలు వేశారు. కోర్టు బయట బెంచీలు వేసి మాక్ కోర్టు నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రి వైద్యులు, నర్సులు ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. పాత ప్రభుత్వాస్పత్రి వైద్యులు, వైద్య సిబ్బంది భారీ ర్యాలీ జరిపారు. ఇరిగేషన్ ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా పోస్టు కార్డుల ఉద్యమం నిర్వహించారు.
అష్టదిగ్బంధం
Published Wed, Aug 21 2013 12:38 AM | Last Updated on Thu, Aug 30 2018 4:51 PM
Advertisement
Advertisement