అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ అధిష్టానం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ‘అనంత’లో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. 34వ రోజైన సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఉద్యమం జోరుగా కొనసాగింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు మూతబడ్డాయి. అనంతపురంలో జాక్టో ఆధ్వర్యంలో వందలాది మంది ఉపాధ్యాయులు గొడుగులు పట్టుకుని నిరసన ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. ఎంఐఎం ఆధ్వర్యంలో ఖాళీ బిందెలు మెడలో తగిలించుకుని ప్రదర్శన చేశారు.
ఎన్‌జీవో, మెడికల్ జేఏసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుల సంఘాల జేఏసీ, వాణిజ్య పన్నులశాఖ, మున్సిపల్ జేఏసీ, పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాల జేఏసీ, హంద్రీ-నీవా సుజల స్రవంతి ఉద్యోగులు, న్యాయవాదులు, విద్యుత్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. డ్వామా ఉద్యోగులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎస్కేయూలో విద్యార్థి, ఉద్యోగ జేఏసీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. సోనియాగాంధీ, షిండే దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ధర్మవరంలో లక్ష గళ ఘోష నిర్వహించారు. వేలాది మంది సమైక్యవాదుల నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు కదం తొక్కారు.
బత్తలపల్లి, ముదిగుబ్బలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. గుంతకల్లులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పొట్టిశ్రీరాములు సర్కిల్‌లో మానవహారం ఏర్పాటు చేశారు. న్యాయవాదులు, ఎన్‌జీవోలు, వైఎస్సార్‌సీపీ నేతల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. పామిడిలో వైద్య సిబ్బంది వినూత్న నిరసన తెలిపారు. హిందూపురంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ వేషధారణలతో ర్యాలీ చేశారు. ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులు ర్యాలీ, మానవహారం ఏర్పాటు చేశారు.
చిలమత్తూరులో పూసల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, వంటావార్పు చేపట్టారు. ఆదర్శ రైతులు రిలే దీక్షలకు దిగారు. లేపాక్షిలో సమైక్యవాదులు పాండురంగ భజన చేశారు. కదిరి పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో అమడగూరు మండలం మహమ్మదాబాద్ హైస్కూల్ ఉపాధ్యాయులు రిలే దీక్ష చేశారు. కదిరి డివిజన్ జర్నలిస్టులు క్రైస్తవ మత సంప్రదాయ పద్ధతిలో శవపేటికలో సోనియా దిష్టిబొమ్మ ఊరేగించారు. విద్యుత్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ నేత జక్కల ఆదిశేషు చేపట్టిన పాదయాత్ర ఎన్‌పీకుంటకు చేరింది.
ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. కళ్యాణదుర్గంలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన 2-కే రన్‌లో వేలాది మంది సమైక్యవాదులు పాల్గొన్నారు. మడకశిరలో దేవుళ్ల చిత్రపటాలతో నిరసన ప్రదర్శన చేశారు. అమరాపురంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు. ఓడీ చెరువులో సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. కొత్తచెరువులో రెడ్డ్డి సంఘం ఆధ్వర్యంలో వంటావార్పు, పుట్టపర్తిలో అంగన్‌వాడీ మహిళలు రిలే దీక్షలు చేశారు. పెనుకొండలో కార్మికులు నిరసన ప్రదర్శన, ఉపాధ్యాయులు భిక్షాటన చేశారు. గోరంట్లలో విశ్వబ్రాహ్మణులు ర్యాలీ నిర్వహించారు.
రాయదుర్గంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, శాంతి హోమం చేశారు. సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షల్లో డిప్యూటీ తహశీల్దార్, డీలర్లు పాల్గొన్నారు. వివిధ సంఘాల రిలే దీక్షలకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఆత్మకూరులో రజకులు ర్యాలీ చేశారు. శింగనమల, నార్పల, గార్లదిన్నెలో జేఏసీ నేతల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. తాడిపత్రిలో కళాశాల ఉద్యోగుల ర్యాలీలో ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి పాల్గొన్నారు. విభజన అనివార్యమైతే... రాయల తెలంగాణ కోరుకోవడం తప్పుకాదని ఆయన అన్నారు. ఇదే పట్టణంలో మున్సిపల్, జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు జోలె పట్టి విరాళాలు సేకరించారు. ఉరవకొండలో నిరసన కార్యక్రమాలు జోరుగా కొనసాగాయి. దళిత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు.
ధర్మఘోష
Published Tue, Sep 3 2013 3:36 AM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM
Advertisement