Pancayatiraj
-
వైకుంఠ ధామం
సింహాచలం, న్యూస్‌లైన్ : ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శనివారం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఉత్తరద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఏడాదికి ఒక్కరోజు మాత్రమే లభించే ఈ అరుదైన దర్శనం కోసం సింహగిరిపై భక్తులు బారులు తీరారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వైకుంఠనాథుని అలంకారంలో తన దివ్య మంగళ దర్శనాన్ని అందజేశారు. ఈ ఏడాది ఉత్తర రాజగోపురంలో స్వామి దర్శనం కల్పించడంతో వేలాదిమంది భక్తులు ఒకేసారి స్వామిని దర్శించుకోగలిగారు. 50 వేల మంది భక్తులు వస్తారని దేవస్థానం అధికారులు అంచనా వేయగా వారి సంఖ్య 70 వేలు దాటడం విశేషం. పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం తెల్లవారుజామున ఒంటిగంటకు స్వామిని మేళతాళాలతో మేల్కొలిపి సుప్రభాత సేవ చేశారు. మేలిముసుగులో ఉత్సవమూర్తులను ఉంచి బంగారు పల్లకీలో అధిష్టించారు. అష్టదిక్పాలక సేవ చేస్తూ బేడా తిరువీధిని ఘనంగా నిర్వహించారు. ఉదయం 5 గంటల సమయంలో స్వామిపై ఉన్న మేలిముసుగు తీసి ఏటా వస్తున్న సంప్రదాయం ప్రకారం తొలుత ఆలయ ఉత్తరద్వారం వద్ద అధిష్టించారు. అక్కడ తొలి దర్శనాన్ని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి ఆనందగజపతిరాజు దంపతులకు అందజేశారు. అక్కడి నుంచి స్వామిని తీసుకొచ్చి ఉత్తరరాజగోపుం వద్ద అధిష్టించారు. ఉదయం 5.30 గంటల నుంచి దర్శనాన్ని 9 గంటల వరకు దర్శనాలను అందజేశారు. అనంతరం సింహగిరి మాడా వీధుల్లో తిరువీధి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన పురోహితులు మోర్తా సీతారామాచార్యులు, స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు ఈ ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. ఘనంగా మెట్లపంక్తికి దీపోత్సవం ముక్కోటి ఏకాదశి సందర్భంగా శనివారం తెల్లవారుజామున 3 గంటలకు సింహగిరి మెట్లపంక్తికి దీపోత్సవం జరిగింది. తొలి పావంచా వద్ద అప్పన్న సన్నిధిలో దేవస్థానం ఈఓ కె.రామచంద్రమోహన్ తొలి దీపాన్ని వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసారి ఏర్పాట్లు భక్తుల ప్రశంసలు అందుకున్నాయి. వార్షిక కల్యాణం ప్రాంగణంలోంచి భక్తులు స్వామిని దర్శించుకునేందుకు వీలుగా క్యూలు ఏర్పాట్లు చేశారు. ఉత్తరరాజగోపురం వద్ద స్వామిని దర్శించుకున్న త ర్వాత మూలవిరాట్ని దర్శించుకునేందుకు భక్తులు వెళ్లేందుకు ఈ ప్రాంతంలో ప్రత్యేక మార్గం ఏర్పాటు చేసి వారందరినీ పంపించారు. ప్రముఖుల ఉత్తరద్వార దర్శనం ః ముక్కోటిని పురస్కరించుకుని పలువురు ప్ర ముఖులు స్వామిని ఉత్తరద్వారంలో దర్శించుకున్నారు. రాష్ర్ట హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నారాయణమూర్తి, హైకోర్టు రిజిస్ట్రార్ జస్టిస్ మూత్యాలనాయుడు, రాష్ర్ట ఉన్నత వి ద్యామండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి, మంత్రి గంటా శ్రీనివాసరావు, డీఐజి ఉమాపతి, సినీ నటుడు శ్రీకాంత్, ఏపీ సమాచార శాఖ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వరరావు తదితరులు స్వామిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. -
నేనేం తక్కువ..!
మొన్న మంత్రి... నిన్న ఎంపీ... ఇప్పుడు ఓ మాజీ ఎమ్మెల్యే.. ప్రజాధనానికి ఎసరు పెట్టడంలో పోటీపడుతున్నారు. ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు నేనేం తీసిపోను అన్నట్టుగా మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు తన వ్యవసాయ క్షేత్రానికి సైతం రోడ్డు వేయించుకున్నారు. ప్రజలకు అక్కర లేకున్నా సరే... తన పొలం బాటను తీర్చిదిద్దుకునేందుకు అధికార మంత్ర దండం ఉపయోగించారు. ఉపాధి హామీ రోడ్ల అభివృద్ధి నిధులను అడ్డ‘దారి’కి వెచ్చించారు. ఎంపీ గారి ఘనకార్యం వెలుగులోకి వచ్చిన రఘునాథపల్లి మండలంలోనే ఈ మాజీ ఎమ్మెల్యే నిర్వాకం బయటపడింది. సాక్షి ప్రతినిధి, వరంగల్ : మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో నిర్మించిన రోడ్ల అప్‌గ్రెడేషన్ పేరిట జిల్లాకు రూ.18.76 కోట్లు మంజూరయ్యాయి. నిబంధనల ప్రకారం మారుమూల గ్రామాలను మెయిన్ రోడ్లకు అనుసంధానం చేసే లింక్‌రోడ్లను ఈ నిధులతో అభివృద్ధి చేయాలి. అందులో భాగంగా రఘునాథపల్లి మండలం మాదారం నుంచి సోమయ్యకుంట తండా మీదుగా దేవాదుల కెనాల్ వరకు తారు రోడ్డు నిర్మాణాన్ని ప్రతిపాదించి రూ.40 లక్షలు కేటాయించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఈ పనులను చేపట్టింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు సూచించిన పనులకే ప్రాధాన్యమివ్వాలనే సాకుతో ఇంజనీర్లు ప్రతిపాదనల తయారీలోనే కాంగ్రెస్ నేతల అడుగులకు మడుగులొత్తారు. మారుమూల గ్రామాలను మరిచిపోయిన అధికార పార్టీ నేతల వ్యవసాయ క్షేత్రాలకు, పొలం బాటలకు మొదటి ప్రాధాన్యమిచ్చి.. తమ పనితీరును చాటుకున్నారు. ఏకంగా నిడిగొండ రైల్వేగేటు నుంచి ఎంపీ పొలాలకు వెళ్లే బండ్ల బాటకు తారురోడ్డు పనులు చేపట్టిన ఏఈ, డీఈఈ, ఈఈలే మాజీ ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రానికి సైతం తారురోడ్డును ప్రతిపాదించటం గమనార్హం. మాదారం-సోమయ్యకుంట తండా రోడ్డు వెంట ఖిలాసపురం రెవెన్యూ పరిధిలో 380, 292, 291, 290, 289, 288, 293 సర్వే నెంబర్లలో మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు, ఆయన భార్య, మామ పేరిట దాదాపు 46 ఎకరాల భూమి ఉంది. సోమయ్యకుంట తండా తర్వాత తారురోడ్డు అవసరం లేకున్నా అటువైపు ఉన్న పొలాలకు వెళ్లేందుకు కొత్త రోడ్డు నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ రికార్డుల ప్రకారం ఈ రోడ్డు.. తండా మీదుగా దేవాదుల కెనాల్ వరకు నిర్మించాలి. కానీ, 1.6 కిలోమీటర్ల లెక్క ప్రకారం మాజీ ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రం వరకే తారు రోడ్డు నిర్మాణం జరుగుతోంది. అంటే ఎవరిని ఉద్దేశించి ఈ రోడ్డును పొడిగించారో... కళ్లకు కట్టినట్లు కనబడుతోంది. ప్రజా ప్రయోజనాలకు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి వెచ్చించాల్సిన నిధులను వరుసగా కాంగ్రెస్ నేతలు సొంత పొలాలకు దారిమళ్లిస్తున్న తీరు అధికార దుర్వినియోగానికి అద్దం పడుతోంది. -
ధర్మఘోష
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ అధిష్టానం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ‘అనంత’లో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. 34వ రోజైన సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఉద్యమం జోరుగా కొనసాగింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు మూతబడ్డాయి. అనంతపురంలో జాక్టో ఆధ్వర్యంలో వందలాది మంది ఉపాధ్యాయులు గొడుగులు పట్టుకుని నిరసన ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. ఎంఐఎం ఆధ్వర్యంలో ఖాళీ బిందెలు మెడలో తగిలించుకుని ప్రదర్శన చేశారు. ఎన్జీవో, మెడికల్ జేఏసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుల సంఘాల జేఏసీ, వాణిజ్య పన్నులశాఖ, మున్సిపల్ జేఏసీ, పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాల జేఏసీ, హంద్రీ-నీవా సుజల స్రవంతి ఉద్యోగులు, న్యాయవాదులు, విద్యుత్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. డ్వామా ఉద్యోగులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎస్కేయూలో విద్యార్థి, ఉద్యోగ జేఏసీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. సోనియాగాంధీ, షిండే దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ధర్మవరంలో లక్ష గళ ఘోష నిర్వహించారు. వేలాది మంది సమైక్యవాదుల నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు కదం తొక్కారు. బత్తలపల్లి, ముదిగుబ్బలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. గుంతకల్లులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పొట్టిశ్రీరాములు సర్కిల్లో మానవహారం ఏర్పాటు చేశారు. న్యాయవాదులు, ఎన్జీవోలు, వైఎస్సార్సీపీ నేతల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. పామిడిలో వైద్య సిబ్బంది వినూత్న నిరసన తెలిపారు. హిందూపురంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ వేషధారణలతో ర్యాలీ చేశారు. ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులు ర్యాలీ, మానవహారం ఏర్పాటు చేశారు. చిలమత్తూరులో పూసల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, వంటావార్పు చేపట్టారు. ఆదర్శ రైతులు రిలే దీక్షలకు దిగారు. లేపాక్షిలో సమైక్యవాదులు పాండురంగ భజన చేశారు. కదిరి పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో అమడగూరు మండలం మహమ్మదాబాద్ హైస్కూల్ ఉపాధ్యాయులు రిలే దీక్ష చేశారు. కదిరి డివిజన్ జర్నలిస్టులు క్రైస్తవ మత సంప్రదాయ పద్ధతిలో శవపేటికలో సోనియా దిష్టిబొమ్మ ఊరేగించారు. విద్యుత్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ నేత జక్కల ఆదిశేషు చేపట్టిన పాదయాత్ర ఎన్పీకుంటకు చేరింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. కళ్యాణదుర్గంలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన 2-కే రన్లో వేలాది మంది సమైక్యవాదులు పాల్గొన్నారు. మడకశిరలో దేవుళ్ల చిత్రపటాలతో నిరసన ప్రదర్శన చేశారు. అమరాపురంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు. ఓడీ చెరువులో సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. కొత్తచెరువులో రెడ్డ్డి సంఘం ఆధ్వర్యంలో వంటావార్పు, పుట్టపర్తిలో అంగన్వాడీ మహిళలు రిలే దీక్షలు చేశారు. పెనుకొండలో కార్మికులు నిరసన ప్రదర్శన, ఉపాధ్యాయులు భిక్షాటన చేశారు. గోరంట్లలో విశ్వబ్రాహ్మణులు ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, శాంతి హోమం చేశారు. సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షల్లో డిప్యూటీ తహశీల్దార్, డీలర్లు పాల్గొన్నారు. వివిధ సంఘాల రిలే దీక్షలకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఆత్మకూరులో రజకులు ర్యాలీ చేశారు. శింగనమల, నార్పల, గార్లదిన్నెలో జేఏసీ నేతల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. తాడిపత్రిలో కళాశాల ఉద్యోగుల ర్యాలీలో ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి పాల్గొన్నారు. విభజన అనివార్యమైతే... రాయల తెలంగాణ కోరుకోవడం తప్పుకాదని ఆయన అన్నారు. ఇదే పట్టణంలో మున్సిపల్, జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు జోలె పట్టి విరాళాలు సేకరించారు. ఉరవకొండలో నిరసన కార్యక్రమాలు జోరుగా కొనసాగాయి. దళిత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. -
సర్పంచ్‌లకు చెక్ఫీవర్
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : బాధ్యతలు స్వీకరించిన నూతన సర్పంచ్‌లకు కొత్త చిక్కొచ్చి పడింది... చెక్ పవర్‌ను కార్యదర్శి భాగస్వామ్యంతో నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించడంతో అంతా కంగుతిన్నారు. రెండేళ్ల అనంతరం ప్రభుత్వం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించింది. జిల్లాలో 920 పంచాయతీలకు 9 స్థానాల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. మిగిలిన 911 పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయి పాలకవర్గాలు ఈ నెల మొదటివారంలో బాధ్యతలు చేపట్టాయి. పంచాయతీల్లో నిధుల లేమితో అభివృద్ధి పనులు చేపట్టలేని స్థితిలో ఉన్న వీటికి మూడు రోజుల క్రితం సర్పంచ్, పంచాయతీ కార్యదర్శితో కలిపి చెక్ పవర్ కట్టబెడుతూ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గతంలో లేనిది కొత్తగా.. 1996 ముందు కేవలం మేజరు పంచాయతీల్లో మాత్రమే చెక్ పవర్‌ను సంయుక్త ఖాతాతో నిర్వహించేవారు. 12, 13వ ఆర్థిక సంఘ నిధుల వినియోగంలో మాత్రం పంచాయతీ విస్తరణాధికారి, సర్పంచ్‌లకు భాగస్వామ్యంగా చెక్ పవర్ కొనసాగించేవారు. ఈ రెండు నిధుల వినియోగాన్ని మినహాయిస్తే మిగిలిన వాటన్నింటికీ సర్పంచ్‌కే చెక్‌పవర్ ఇచ్చారు. దీనికి భిన్నంగా పంచాయతీలో ఉన్న అన్ని నిధుల వినియోగానికి భాగస్వామ్య ఖాతా నిర్వహించాలంటూ కొత్తగా ప్రభుత్వం ప్రకటించింది. అభిప్రాయభేదాలు ఇద్దరి భాగస్వామ్యంతో చెక్ పవర్ నిర్వహించడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. గ్రామాల్లో అత్యవసర పనులున్నా నిధులు విడుదల కు కార్యదర్శి ముందుకొచ్చే పరిస్థితి లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఒక్కోసారి నిబంధనలను అతిక్రమించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అయిన కార్యదర్శి నిధులు విడుదల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. అప్పుడే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలొచ్చి, వాటి ప్రభావం గ్రామాభివృద్ధిపై పడుతుంది. 2002లో గ్రామ కార్యదర్శులు వచ్చినప్పట్నుంచి పంచాయతీలను ఏ అధికారి పట్టించుకోలేదు. ఇన్స్పెక్షన్లు, ఆడిట్లు సక్రమంగా జరగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నిధుల వినియోగంపై అపోహలు చోటుచేసుకుంటాయి. దీనివల్ల భవిషత్తులో అనేక సమస్యలు తలెత్తుతాయ. దీని ప్రభావం గ్రామాభివద్ధిపై ఉంటుందన్న వాదన వ్యక్తమవుతోంది. సాధారణంగా పాలకవర్గాల పదవీ కాలం పూర్తయ్యాక పంచాయతీ సర్పంచ్‌తో పాటు కార్యదర్శులకు చెక్ పవర్‌ను ఇవ్వడం ఆనవాయితీ. దానికి భిన్నంగా పాలకవర్గాలున్న సమయంలోనూ ఉమ్మడి చెక్ పవర్‌ను కట్టబెట్టడాన్ని సర్పంచ్‌లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే ప్రభుత్వంతో తేల్చుకునేందుకు సమైక్యంగా పోరాటం చేస్తామంటున్నారు. ఇదిలా ఉండగా ఆరోగ్య మిషన్ విడుదల చేసే నిధుల వినియోగం సర్పంచ్, ఏఎన్ఎంలకు బాగస్వామ్య చెక్ పవర్ ఇచ్చేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బాధ్యత ఎవరికన్నదానిపై అయోమయం నెలకొంది. -
ఏసీబీకి చిక్కిన ఏఈ
నాగిరెడ్డిపేట, న్యూస్‌లైన్ :నాగిరెడ్డిపేట మండల పంచాయతీరాజ్ ఇన్చార్జి ఏఈ శ్రీనివాస్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. చీనూర్ పంచాయితీ పరిధిలోని మేజర్‌వాడి ప్రాథమికొన్నత పాఠశాల ఆవరణలో మూడుమాసాల క్రితం రూ. 75వేలతో వంటగది నిర్మించారు. ఇందుకు సంబంధించి ఎంబీ రికార్డు చేసేందుకు శ్రీనివాస్ మూడునెలలుగా కాంట్రాక్టరైన టీఆర్ఎస్పార్టీ మండల మాజీ అధ్యక్షుడు గంపల యాదగిరిని కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నాడు. చివరికి ఎంబీ రికార్డు చేసేం దుకు రూ. 15 వేలు డిమాండ్ చేశారు. అంతపెద్ద మొత్తం తాను ఇచ్చుకోలేనని యాదగిరి పేర్కొనగా చివరికి రూ. 10 వేలకు బేరం కుదిరింది. అనంతరం యాదగిరి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం బుధవారం ఉదయం 9గంటల ప్రాంతంలో మం డల పరిషత్ కార్యాలయంలోని తన చాంబర్లో యాదగిరి నుంచి రూ. 10వేలు తీసుకుంటుండగా ఏఈ శ్రీనివాస్‌ను అక్కడ మాటువేసిఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కార్యాలయంలోని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నా రు. నిందితుడిని హైద్రాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీయస్సీ సంజీవరావు తెలిపారు. ఇన్చార్జి ఏఈగా శ్రీనివాస్ రెండున్నరేళ్లుగా మం డలంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం ఆయనఎల్లారెడ్డి పీఆర్ ఏఈగా రెగ్యులర్ పోస్టులో కొనసాగుతున్నారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే బాధితులు తమను సంప్రదించాలని డీయస్పీ సంజీవరావు విలేకరులతో మాట్లాడుతూ కోరారు. సెల్ నం. 9440446155 కు ఫోన్ చేయాలని సూచించారు. ఏసీబీ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ ఖుర్షిద్ పాల్గొన్నారు. ఏసీబీ దాడులు మండలంలో తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వ అధికారి ఇలా దొరికిపోవడం ఈ ప్రాంతంలో మొదటి సారిగా స్థానికులు పేర్కొంటున్నారు. విషయం తెలుసుకుని పలుగ్రామాల నుంచి నాయకులు, ప్రజలు మండల పరిషత్ కాార్యాలయానికి తరలివచ్చారు. అవినీతి అధికారుల్లో మాత్రం గుండె దడ మొదలైంది. -
ఉద్యమ సునామీ
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం ఉప్పెనలా ఎగసి పడుతోంది. నిరవధిక సమ్మెతో జిల్లా అట్టుడికింది. జన సారథ్యంలో ర్యాలీలు.. నిరసనలు.. వ్యంగ్య ఫ్లెక్సీలతో ఉద్యమ రథం ఉరకలెత్తింది. సకల జనుల సమ్మె రెండో రోజు కూడా ఉద్యోగ సంఘాలు రోడ్లెక్కడంతో పాలన స్తంభించిపోయింది. బుధవారం జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఉద్యోగినులు సైతం జత కలవడంతో ఉద్యమ కెరటం సునామీని తలపించింది. ఏపీఎన్జీఓలు, రెవెన్యూ, వీఆర్వో, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, పంచాయతీరాజ్ ఇలా అన్ని ఉద్యోగ సంఘాల నిరసనలతో విశాఖ హోరెత్తిపోయింది. మరో వైపున గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉద్యమం యథాతథంగా ఉధృతంగా కొనసాగుతోంది. పట్టణాలు, పల్లెలన్న తేడా లేకుండా అన్ని చోట్లా రకరకాల రూపాల్లో నిరసన వ్యక్తమవుతోంది. కొనసాగిన బంద్ రాష్ట్ర విభజనపై సమ్మె ప్రకటించిన సకల జనులు కదం తొక్కుతున్నారు. వరుసగా రెండో రోజు కూడా ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. చిన్న షాపుల నుంచి షాపింగ్ మాల్స్ వరకు అన్నీ మూతపడ్డాయి. నగ రంలో అనేక చోట్ల షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు. గ్రామీణ ప్రాం తాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ప్రజలు రోడ్లమీదకొచ్చి ర్యాలీలు, నిరసనలు చేశారు. కాంగ్రెస్, సోనియా, కేసీఆర్‌లకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేశారు. రోడ్ల పై టైర్లును కాల్చి వాహనాల రాకపోకలకు కొంత సేపు అడ్డుకున్నారు. జీవీఎంసీ, జగదాంబ, కలెక్టరేట్ ప్రాంతాలల్లో మానవహారాలు చేశారు. డిపోలకే బస్సులు పరిమితం : విశాఖ రీజియన్ పరిధిలో బుధవారం కూడా 1060 ఆర్టీసీ బస్సులు తొమ్మిది డిపోలకే పరిమిత మయ్యాయి. దీని వల్ల ఆర్టీసీకి రూ.70 లక్షల నష్టం వాటిల్లింది. కలెక్టరేట్లో ఆటలు : సమైక్యాంధ్ర కోసం సమ్మెకు దిగిన రెవెన్యూ ఉద్యోగులు విభిన్న ప్రదర్శనలు చేస్తున్నారు. కలెక్టరేట్ ఆవరణలోనే రెవెన్యూ ఉద్యోగిణులు వినూత్న నినాదాలతో కబడ్డీ, రింగ్ ఆటలు ఆడారు. తెరుచుకోని కార్యాలయాలు : సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చిన ఉద్యోగ సంఘాలు రెం డో రోజు కూడా తీవ్ర స్థాయి నిరసనలు వ్యక్తం చేశాయి. దీంతో బుధవారం కూడా ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోలేదు. దీంతో పాలన పూర్తిగా స్తంభించిపోయింది. అవుట్సోర్సింగ్ సిబ్బంది కూడా విధుల్లో లేకపోవడంతో పౌర సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో సమ్మె ఉధృతంగా జరుగుతోంది. ఉద్యోగులు, సిబ్బంది లేకపోవడంతో ఉన్నతాధికారులు కూడా కార్యాలయాలకు దూ రంగా ఉంటున్నారు. ఉన్నతాధికారుల సీసీలు, దఫేదార్లు, డ్రైవర్లు కూడా ఈ సమ్మెలో పా ల్గొంటుండడంతో ఏ పని జరగని పరిస్థితి నెల కొంది. ప్రతి కార్యాలయం ఎదుట టెంట్లు వేసి రాష్ట్ర విభజన, ఉద్యోగులకు తలెత్తే ఇబ్బందు లు, భవితరాలకు కలిగే నష్టాలపై సమావేశాలు నిర్వహించుకున్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎదుట పంచాయతీ ఉద్యోగ సం ఘం, ఆడిట్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఏపీ వీఆర్వో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎస్.పోతురాజు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో మోకాళ్లతో నిరసనలు వ్యక్తం చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసి ఉద్యోగ సంఘాలన్నీ ర్యాలీలుగా బయలుదేరి మధ్యాహ్నం కలెక్టరేట్‌కు చేరుకున్నాయి. అక్కడ నుంచి ఏపీఎన్జీఓస్ అధ్యక్ష, కార్యదర్శులు ఈశ్వరరావు, గోపాలకృష్ణ, ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు ఎస్.నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో కలెక్టరేట్ ప్రాంతంలో మార్మోగిపోయింది. అనంతరం ఎపీఎన్జీఓలు బృందాలుగా విడిపోయి అన్ని కార్యాలయాలను చుట్టేశారు. ఎక్కడైనా ఒకరిద్దరు విధులు నిర్వర్తిస్తున్నా బయటకు తీసుకువచ్చి కార్యాలయాలను మూయించారు. -
ఎంపీటీసీల పునర్విభజనకు బ్రేక్...
జిల్లాపరిషత్, న్యూస్‌లైన్ : మండల ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) పునర్విభజ నకు బ్రేక్ పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై యూపీఏ ప్రభుత్వం ప్రకటన చేయడంతో ఏపీఎన్జీవోలతోపాటు సీమాం ధ్ర ఉద్యోగులు ఈ నెల 12వ తేదీ నుంచి సమ్మె చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీస్ అందజేశారు. ఈ నేపథ్యంలో సీమాం ధ్రలోని అన్ని జిల్లాలకు చెందిన ఎంపీడీఓలు ఎన్జీవోలకు మద్దతుగా సమ్మె లో పాల్గొనేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా మండల ప్రాదేశిక నియోజకవర్గాలను పునర్విభజన చేసేందుకు పంచాయతీరాజ్ కమిషనర్ షెడ్యూలును ప్రకటించారు. ఈనెల 14వ తేదీలోగా ఎంపీటీసీ స్థానాలు పునర్విభజన చేసి ఆయా జిల్లాల్లో గెజిట్ ప్రకటించాల్సి ఉంటుంది. అరుుతే సీమాంధ్ర ప్రాంతంలో ఎంపీడీఓలు సమ్మెలో పాల్గొంటున్నందున పునర్విభజనపై నీలినీడలు కమ్ముకున్నాయి. పునర్విభజన.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకేసారి నిర్వహించి పబ్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఒక ప్రాంతంలో పునర్విభజన జరిగి, మరో ప్రాంతంలో జరగకుంటే భవిష్యత్తులో రిజర్వేషన్లపై ఈ ప్రభావం పడే అవకాశాలున్నట్లు తెలిసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పునర్విభజన ప్రక్రియ నిలిచిపోనున్నట్టు సమాచారం.