ఉద్యమ సునామీ
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం ఉప్పెనలా ఎగసి పడుతోంది. నిరవధిక సమ్మెతో జిల్లా అట్టుడికింది. జన సారథ్యంలో ర్యాలీలు.. నిరసనలు.. వ్యంగ్య ఫ్లెక్సీలతో ఉద్యమ రథం ఉరకలెత్తింది. సకల జనుల సమ్మె రెండో రోజు కూడా ఉద్యోగ సంఘాలు రోడ్లెక్కడంతో పాలన స్తంభించిపోయింది. బుధవారం జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఉద్యోగినులు సైతం జత కలవడంతో ఉద్యమ కెరటం సునామీని తలపించింది. ఏపీఎన్జీఓలు, రెవెన్యూ, వీఆర్వో, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, పంచాయతీరాజ్ ఇలా అన్ని ఉద్యోగ సంఘాల నిరసనలతో విశాఖ హోరెత్తిపోయింది. మరో వైపున గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉద్యమం యథాతథంగా ఉధృతంగా కొనసాగుతోంది. పట్టణాలు, పల్లెలన్న తేడా లేకుండా అన్ని చోట్లా రకరకాల రూపాల్లో నిరసన వ్యక్తమవుతోంది.
కొనసాగిన బంద్
రాష్ట్ర విభజనపై సమ్మె ప్రకటించిన సకల జనులు కదం తొక్కుతున్నారు. వరుసగా రెండో రోజు కూడా ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. చిన్న షాపుల నుంచి షాపింగ్ మాల్స్ వరకు అన్నీ మూతపడ్డాయి. నగ రంలో అనేక చోట్ల షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు. గ్రామీణ ప్రాం తాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ప్రజలు రోడ్లమీదకొచ్చి ర్యాలీలు, నిరసనలు చేశారు. కాంగ్రెస్, సోనియా, కేసీఆర్‌లకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేశారు. రోడ్ల పై టైర్లును కాల్చి వాహనాల రాకపోకలకు కొంత సేపు అడ్డుకున్నారు. జీవీఎంసీ, జగదాంబ, కలెక్టరేట్ ప్రాంతాలల్లో మానవహారాలు చేశారు. డిపోలకే బస్సులు పరిమితం : విశాఖ రీజియన్ పరిధిలో బుధవారం కూడా 1060 ఆర్టీసీ బస్సులు తొమ్మిది డిపోలకే పరిమిత మయ్యాయి. దీని వల్ల ఆర్టీసీకి రూ.70 లక్షల నష్టం వాటిల్లింది.
కలెక్టరేట్‌లో ఆటలు : సమైక్యాంధ్ర కోసం సమ్మెకు దిగిన రెవెన్యూ ఉద్యోగులు విభిన్న ప్రదర్శనలు చేస్తున్నారు. కలెక్టరేట్ ఆవరణలోనే రెవెన్యూ ఉద్యోగిణులు వినూత్న నినాదాలతో కబడ్డీ, రింగ్ ఆటలు ఆడారు.
తెరుచుకోని కార్యాలయాలు : సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చిన ఉద్యోగ సంఘాలు రెం డో రోజు కూడా తీవ్ర స్థాయి నిరసనలు వ్యక్తం చేశాయి. దీంతో బుధవారం కూడా ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోలేదు. దీంతో పాలన పూర్తిగా స్తంభించిపోయింది. అవుట్‌సోర్సింగ్ సిబ్బంది కూడా విధుల్లో లేకపోవడంతో పౌర సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో సమ్మె ఉధృతంగా జరుగుతోంది. ఉద్యోగులు, సిబ్బంది లేకపోవడంతో ఉన్నతాధికారులు కూడా కార్యాలయాలకు దూ రంగా ఉంటున్నారు. ఉన్నతాధికారుల సీసీలు, దఫేదార్లు, డ్రైవర్లు కూడా ఈ సమ్మెలో పా ల్గొంటుండడంతో ఏ పని జరగని పరిస్థితి నెల కొంది. ప్రతి కార్యాలయం ఎదుట టెంట్లు వేసి రాష్ట్ర విభజన, ఉద్యోగులకు తలెత్తే ఇబ్బందు లు, భవితరాలకు కలిగే నష్టాలపై సమావేశాలు నిర్వహించుకున్నారు.
జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎదుట పంచాయతీ ఉద్యోగ సం ఘం, ఆడిట్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఏపీ వీఆర్వో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎస్.పోతురాజు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో మోకాళ్లతో నిరసనలు వ్యక్తం చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసి ఉద్యోగ సంఘాలన్నీ ర్యాలీలుగా బయలుదేరి మధ్యాహ్నం కలెక్టరేట్‌కు చేరుకున్నాయి. అక్కడ నుంచి ఏపీఎన్‌జీఓస్ అధ్యక్ష, కార్యదర్శులు ఈశ్వరరావు, గోపాలకృష్ణ, ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు ఎస్.నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో కలెక్టరేట్ ప్రాంతంలో మార్మోగిపోయింది. అనంతరం ఎపీఎన్‌జీఓలు బృందాలుగా విడిపోయి అన్ని కార్యాలయాలను చుట్టేశారు. ఎక్కడైనా ఒకరిద్దరు విధులు నిర్వర్తిస్తున్నా బయటకు తీసుకువచ్చి కార్యాలయాలను మూయించారు.