మొన్న మంత్రి... నిన్న ఎంపీ... ఇప్పుడు ఓ మాజీ ఎమ్మెల్యే.. ప్రజాధనానికి ఎసరు పెట్టడంలో పోటీపడుతున్నారు. ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు నేనేం తీసిపోను అన్నట్టుగా మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు తన వ్యవసాయ క్షేత్రానికి సైతం రోడ్డు వేయించుకున్నారు. ప్రజలకు అక్కర లేకున్నా సరే... తన పొలం బాటను తీర్చిదిద్దుకునేందుకు అధికార మంత్ర దండం ఉపయోగించారు. ఉపాధి హామీ రోడ్ల అభివృద్ధి నిధులను అడ్డ‘దారి’కి వెచ్చించారు. ఎంపీ గారి ఘనకార్యం వెలుగులోకి వచ్చిన రఘునాథపల్లి మండలంలోనే ఈ మాజీ ఎమ్మెల్యే నిర్వాకం బయటపడింది.
సాక్షి ప్రతినిధి, వరంగల్ : మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో నిర్మించిన రోడ్ల అప్‌గ్రెడేషన్ పేరిట జిల్లాకు రూ.18.76 కోట్లు మంజూరయ్యాయి. నిబంధనల ప్రకారం మారుమూల గ్రామాలను మెయిన్ రోడ్లకు అనుసంధానం చేసే లింక్‌రోడ్లను ఈ నిధులతో అభివృద్ధి చేయాలి. అందులో భాగంగా రఘునాథపల్లి మండలం మాదారం నుంచి సోమయ్యకుంట తండా మీదుగా దేవాదుల కెనాల్ వరకు తారు రోడ్డు నిర్మాణాన్ని ప్రతిపాదించి రూ.40 లక్షలు కేటాయించారు.
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఈ పనులను చేపట్టింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు సూచించిన పనులకే ప్రాధాన్యమివ్వాలనే సాకుతో ఇంజనీర్లు ప్రతిపాదనల తయారీలోనే కాంగ్రెస్ నేతల అడుగులకు మడుగులొత్తారు. మారుమూల గ్రామాలను మరిచిపోయిన అధికార పార్టీ నేతల వ్యవసాయ క్షేత్రాలకు, పొలం బాటలకు మొదటి ప్రాధాన్యమిచ్చి.. తమ పనితీరును చాటుకున్నారు. ఏకంగా నిడిగొండ రైల్వేగేటు నుంచి ఎంపీ పొలాలకు వెళ్లే బండ్ల బాటకు తారురోడ్డు పనులు చేపట్టిన ఏఈ, డీఈఈ, ఈఈలే మాజీ ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రానికి సైతం తారురోడ్డును ప్రతిపాదించటం గమనార్హం.
మాదారం-సోమయ్యకుంట తండా రోడ్డు వెంట ఖిలాసపురం రెవెన్యూ పరిధిలో 380, 292, 291, 290, 289, 288, 293 సర్వే నెంబర్లలో మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు, ఆయన భార్య, మామ పేరిట దాదాపు 46 ఎకరాల భూమి ఉంది. సోమయ్యకుంట తండా తర్వాత తారురోడ్డు అవసరం లేకున్నా అటువైపు ఉన్న పొలాలకు వెళ్లేందుకు కొత్త రోడ్డు నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ రికార్డుల ప్రకారం ఈ రోడ్డు.. తండా మీదుగా దేవాదుల కెనాల్ వరకు నిర్మించాలి. కానీ, 1.6 కిలోమీటర్ల లెక్క ప్రకారం మాజీ ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రం వరకే తారు రోడ్డు నిర్మాణం జరుగుతోంది. అంటే ఎవరిని ఉద్దేశించి ఈ రోడ్డును పొడిగించారో... కళ్లకు కట్టినట్లు కనబడుతోంది. ప్రజా ప్రయోజనాలకు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి వెచ్చించాల్సిన నిధులను వరుసగా కాంగ్రెస్ నేతలు సొంత పొలాలకు దారిమళ్లిస్తున్న తీరు అధికార దుర్వినియోగానికి అద్దం పడుతోంది.