dugyala Srinivas
-
మాజీ ఎమ్మెల్యే దుగ్యాల మృతి
పాలకుర్తి/సాక్షి, హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు కన్నుమూశారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం ఆయన మృతిచెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి (ప్రస్తుతం రద్దయింది) ఆయన ప్రాతినిధ్యం వహించారు. 2004లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న తరు ణంలో ఆయన చెన్నూరు (ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గం) నుంచి టీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచారు. తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన 2005లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సహకారంతో ఆయన నియోజకవర్గంలో విద్య, వైద్యం, వ్యవసాయం, సాగు నీటి ప్రాజెక్టులను మంజూరు చేయించడంతో పాటు రూ.1,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేశారు. దుగ్యాల మృతి పట్ల స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఈటల రాజేందర్, ప్రశాంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మేనేజ్మెంట్ దిగ్గజం ఆర్సీ శాస్త్రి కన్నుమూత లక్డీకాపూల్(హైదరాబాద్): మేనేజ్మెంట్ రంగంలో దిగ్గజంగా పేరొందిన డాక్టర్ రాళ్లబండి చంద్రశేఖర శాస్త్రి (78) కన్నుమూశారు. స్వల్ప అనారోగ్యంతో ఆయన గత గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య కమలాదేవి, కుమార్తె రత్నావళి, కుమారుడు సునీల్ ఉన్నారు. కార్పొరేట్ రంగంలో చక్కని వ్యూహకర్తగా శాస్త్రి ప్రసిద్ధి పొందారు. అనేక అంతర్జాతీయ, జాతీయ సంస్థల ప్రగతిలో కీలక పాత్ర పోషించారు. తెలుగు కార్పొరేట్ రంగంలో శాస్త్రి పేరు తెలియని వారు లేరు. శాస్త్రి ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఎ.(సోషల్ వర్క్‌లో గోల్డ్ మెడల్) పూర్తి చేసుకున్న తర్వాత ఆలిండ్ మియాజాకీలో ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. అనంతరం పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో కొంతకాలం పని చేశారు. తర్వాత కార్పొరేట్ రంగంలోకి ప్రవేశించారు. అలా మొదలైన ఆయన కార్పొరేట్ ప్రస్థానం సుమారు రెండు దశాబ్దాలకు పైగా ఐటీసీ, ఐఎల్టీడీ, వీఎస్టీ వంటి సంస్థల్లో హెచ్ఆర్ చీఫ్‌గా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా, సత్యం కంప్యూటర్స్ మొదటి హెచ్ఆర్ డైరెక్టర్‌గా అనేక సమున్నత పదవుల్లో కొనసాగింది. అనేక మంది సీఈవోల మెంటార్‌గా పథ నిర్దేశం చేశారు. కార్పొరేట్ రంగంలో ధర్మాన్ని, ఆధ్యాత్మికతను, మానవతా విలువలను రంగరించి టీమ్ లీడర్స్‌కు ఆదర్శంగా నిలిచారు. నిరంతర జ్ఞానార్జనే ధ్యేయంగా ‘మేనేజ్ మెంట్ రంగం’లో ఎంఫిల్‌లో డిస్టింక్షన్ సాధించారు. రెండు డాక్టరేట్లు పొందారు. డాక్టర్ శాస్త్రి మృతికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అనేకమంది ఆయన శిష్యులు, కార్పొరేట్ దిగ్గజాలు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. -
పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
హైదరాబాద్ : పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాస్ రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం నుంచి శ్రీనివాస్ రావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2004 నుంచి 2009 వరకు పాలకుర్తి ఎమ్మెల్యేగా ఆయన సేవలందించారు. శ్రీనివాస్ మృతి పట్ల నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు -
నేనేం తక్కువ..!
మొన్న మంత్రి... నిన్న ఎంపీ... ఇప్పుడు ఓ మాజీ ఎమ్మెల్యే.. ప్రజాధనానికి ఎసరు పెట్టడంలో పోటీపడుతున్నారు. ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు నేనేం తీసిపోను అన్నట్టుగా మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు తన వ్యవసాయ క్షేత్రానికి సైతం రోడ్డు వేయించుకున్నారు. ప్రజలకు అక్కర లేకున్నా సరే... తన పొలం బాటను తీర్చిదిద్దుకునేందుకు అధికార మంత్ర దండం ఉపయోగించారు. ఉపాధి హామీ రోడ్ల అభివృద్ధి నిధులను అడ్డ‘దారి’కి వెచ్చించారు. ఎంపీ గారి ఘనకార్యం వెలుగులోకి వచ్చిన రఘునాథపల్లి మండలంలోనే ఈ మాజీ ఎమ్మెల్యే నిర్వాకం బయటపడింది. సాక్షి ప్రతినిధి, వరంగల్ : మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో నిర్మించిన రోడ్ల అప్‌గ్రెడేషన్ పేరిట జిల్లాకు రూ.18.76 కోట్లు మంజూరయ్యాయి. నిబంధనల ప్రకారం మారుమూల గ్రామాలను మెయిన్ రోడ్లకు అనుసంధానం చేసే లింక్‌రోడ్లను ఈ నిధులతో అభివృద్ధి చేయాలి. అందులో భాగంగా రఘునాథపల్లి మండలం మాదారం నుంచి సోమయ్యకుంట తండా మీదుగా దేవాదుల కెనాల్ వరకు తారు రోడ్డు నిర్మాణాన్ని ప్రతిపాదించి రూ.40 లక్షలు కేటాయించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఈ పనులను చేపట్టింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు సూచించిన పనులకే ప్రాధాన్యమివ్వాలనే సాకుతో ఇంజనీర్లు ప్రతిపాదనల తయారీలోనే కాంగ్రెస్ నేతల అడుగులకు మడుగులొత్తారు. మారుమూల గ్రామాలను మరిచిపోయిన అధికార పార్టీ నేతల వ్యవసాయ క్షేత్రాలకు, పొలం బాటలకు మొదటి ప్రాధాన్యమిచ్చి.. తమ పనితీరును చాటుకున్నారు. ఏకంగా నిడిగొండ రైల్వేగేటు నుంచి ఎంపీ పొలాలకు వెళ్లే బండ్ల బాటకు తారురోడ్డు పనులు చేపట్టిన ఏఈ, డీఈఈ, ఈఈలే మాజీ ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రానికి సైతం తారురోడ్డును ప్రతిపాదించటం గమనార్హం. మాదారం-సోమయ్యకుంట తండా రోడ్డు వెంట ఖిలాసపురం రెవెన్యూ పరిధిలో 380, 292, 291, 290, 289, 288, 293 సర్వే నెంబర్లలో మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు, ఆయన భార్య, మామ పేరిట దాదాపు 46 ఎకరాల భూమి ఉంది. సోమయ్యకుంట తండా తర్వాత తారురోడ్డు అవసరం లేకున్నా అటువైపు ఉన్న పొలాలకు వెళ్లేందుకు కొత్త రోడ్డు నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ రికార్డుల ప్రకారం ఈ రోడ్డు.. తండా మీదుగా దేవాదుల కెనాల్ వరకు నిర్మించాలి. కానీ, 1.6 కిలోమీటర్ల లెక్క ప్రకారం మాజీ ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రం వరకే తారు రోడ్డు నిర్మాణం జరుగుతోంది. అంటే ఎవరిని ఉద్దేశించి ఈ రోడ్డును పొడిగించారో... కళ్లకు కట్టినట్లు కనబడుతోంది. ప్రజా ప్రయోజనాలకు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి వెచ్చించాల్సిన నిధులను వరుసగా కాంగ్రెస్ నేతలు సొంత పొలాలకు దారిమళ్లిస్తున్న తీరు అధికార దుర్వినియోగానికి అద్దం పడుతోంది.