సింహాచలం, న్యూస్‌లైన్ : ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శనివారం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఉత్తరద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఏడాదికి ఒక్కరోజు మాత్రమే లభించే ఈ అరుదైన దర్శనం కోసం సింహగిరిపై భక్తులు బారులు తీరారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వైకుంఠనాథుని అలంకారంలో తన దివ్య మంగళ దర్శనాన్ని అందజేశారు.
ఈ ఏడాది ఉత్తర రాజగోపురంలో స్వామి దర్శనం కల్పించడంతో వేలాదిమంది భక్తులు ఒకేసారి స్వామిని దర్శించుకోగలిగారు. 50 వేల మంది భక్తులు వస్తారని దేవస్థానం అధికారులు అంచనా వేయగా వారి సంఖ్య 70 వేలు దాటడం విశేషం. పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం తెల్లవారుజామున ఒంటిగంటకు స్వామిని మేళతాళాలతో మేల్కొలిపి సుప్రభాత సేవ చేశారు. మేలిముసుగులో ఉత్సవమూర్తులను ఉంచి బంగారు పల్లకీలో అధిష్టించారు. అష్టదిక్పాలక సేవ చేస్తూ బేడా తిరువీధిని ఘనంగా నిర్వహించారు.
ఉదయం 5 గంటల సమయంలో స్వామిపై ఉన్న మేలిముసుగు తీసి ఏటా వస్తున్న సంప్రదాయం ప్రకారం తొలుత ఆలయ ఉత్తరద్వారం వద్ద అధిష్టించారు. అక్కడ తొలి దర్శనాన్ని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి ఆనందగజపతిరాజు దంపతులకు అందజేశారు. అక్కడి నుంచి స్వామిని తీసుకొచ్చి ఉత్తరరాజగోపుం వద్ద అధిష్టించారు. ఉదయం 5.30 గంటల నుంచి దర్శనాన్ని 9 గంటల వరకు దర్శనాలను అందజేశారు. అనంతరం సింహగిరి మాడా వీధుల్లో తిరువీధి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన పురోహితులు మోర్తా సీతారామాచార్యులు, స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు ఈ ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించారు.
ఘనంగా మెట్లపంక్తికి దీపోత్సవం
ముక్కోటి ఏకాదశి సందర్భంగా శనివారం తెల్లవారుజామున 3 గంటలకు సింహగిరి మెట్లపంక్తికి దీపోత్సవం జరిగింది. తొలి పావంచా వద్ద అప్పన్న సన్నిధిలో దేవస్థానం ఈఓ కె.రామచంద్రమోహన్ తొలి దీపాన్ని వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసారి ఏర్పాట్లు భక్తుల ప్రశంసలు అందుకున్నాయి. వార్షిక కల్యాణం ప్రాంగణంలోంచి భక్తులు స్వామిని దర్శించుకునేందుకు వీలుగా క్యూలు ఏర్పాట్లు చేశారు. ఉత్తరరాజగోపురం వద్ద స్వామిని దర్శించుకున్న త ర్వాత మూలవిరాట్‌ని దర్శించుకునేందుకు భక్తులు వెళ్లేందుకు ఈ ప్రాంతంలో ప్రత్యేక మార్గం ఏర్పాటు చేసి వారందరినీ పంపించారు.
ప్రముఖుల ఉత్తరద్వార దర్శనం ః
ముక్కోటిని పురస్కరించుకుని పలువురు ప్ర ముఖులు స్వామిని ఉత్తరద్వారంలో దర్శించుకున్నారు. రాష్ర్ట హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నారాయణమూర్తి, హైకోర్టు రిజిస్ట్రార్ జస్టిస్ మూత్యాలనాయుడు, రాష్ర్ట ఉన్నత వి ద్యామండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి, మంత్రి గంటా శ్రీనివాసరావు, డీఐజి ఉమాపతి, సినీ నటుడు శ్రీకాంత్, ఏపీ సమాచార శాఖ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వరరావు తదితరులు స్వామిని దర్శించుకున్నవారిలో ఉన్నారు.
వైకుంఠ ధామం
Published Sun, Jan 12 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM
Advertisement
Advertisement