సాక్షి, మచిలీపట్నం : సమైక్యాంధ్ర ఉద్యమం ప్రభుత్వ ఉన్నతాధికారులపై వత్తిడి పెంచుతోంది. నిన్నటి వరకు ఎస్ బాస్ అన్న దిగువశ్రేణి ఉద్యోగులే ఇప్పుడు సమైక్యాంధ్ర జేఏసీగా ఏర్పడి సమ్మెబాట పట్టాల్సిందిగా ఉన్నతాధికారులకు దిశానిర్ధేశం చేస్తున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులు, ఉద్యోగులు సమైక్య ఉద్యమానికి నడుంకట్టిన సంగతి తెలిసిందే. జిల్లా ఉన్నతాధికారులు మాత్రం సమ్మె పేరుతో ఎటువంటి పనులు చక్కబెట్టకుండానే తమ కార్యాయాల్లో కాల క్షేపం చేస్తున్నారు. పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సైతం సమైక్యాంధ్ర ఉద్యమానకి కలిసి రావాలని రెండు రోజుల క్రితం ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది.
ఈ నేపథ్యం లో జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలో సమావేశం నిర్వహించుకునేందుకు సమాయత్తమయ్యారు. ఈ సమావేశం జరిగే సమయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ వెళ్లి సమ్మెకు రావాలని ఉన్నతాధికారులను కోరేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే జిల్లాలో ఉన్నతాధికారుల్లో ఉద్యమంపై ఏకాభిప్రాయం కుదరడంలేదని సమాచారం. ఉద్యమానికి మద్దతుగా సమ్మె బాట పట్టాలని కొందరంటే, సంఘీభావం ప్రకటిస్తే చాలని ఇంకొందరు, ఈ నెల 7న హైదరాబాద్‌లో జరిగే ఉద్యోగ సదస్సుకు మద్దతు పలకాలని ఇంకొందరు ఇలా ఎవరికి తోచినట్టు వారు నిర్ణయాలు తీసుకున్నారని తెలిసింది.
పలు శాఖలకు జిల్లా అధిపతులుగా ఉన్నందున ఉద్యమబాట పడితే ఎలా అంటూ మరికొందరు అధికారులు అధికార పార్టీకి విశ్వాసపాత్రులుగా గుర్తింపుపొందే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో జరగాల్సిన కీలక సమావేశం వాయిదా పడిందని విశ్వసనీయ సమాచారం.
సమావేశం గురించి తెలుసుకున్న ఎస్సీ జె.ప్రభాకరరావు ఉద్యోగుల మధ్య గొడవలు జరగకుండా చూసేందుకు మహారాష్ట్రకు చెందిన స్పెషల్ (సీఆర్‌పీఎఫ్) పోలీసులను కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం మోహరిం చారు.
సమ్మెకు వెళ్లేందుకు ససెమిరా అంటున్న ఉన్నతాధికారులు, సమైక్య ఉద్యమానికి బాసటగా ఉండాలని కోరుతున్న దిగువస్థాయి ఉద్యోగుల మధ్య ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఇబ్బందులు తప్పవనుకున్న ఉన్నతాధికారులు మచిలీపట్నంలో కాకుండా విజయవాడలో తమ విధులు నిర్వర్తించేందుకు తరలివెళ్లినట్టు సమాచారం. ఉద్యోగుల వివాదాలకు అవకాశం ఉందని భావించిన ఉన్నతాధికారులు గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ఇందిరా క్రాంతి పథం(మెప్మా) డెరైక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌ను విజయవాడకు ఆఘమేఘాలపై మార్పు చేశారు.
ఉపాధ్యాయ దినోత్సవాన్ని సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఉపాధ్యాయులు బహిష్కరించారు. దీంతో సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలుపంచుకున్న ఉపాధ్యాయులు ఆయా ఆందోళన కార్యక్రమల్లోన్లే ప్రత్యేకంగా ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి సత్కరిం చడం విశేషం. బందరులో సమైక్య వాదులు నిర్వహించిన గురుపూజోత్సవంలో మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, జెడ్పీ మాజీ చైర్మన్ కేఎన్నార్, మాదివాడ రాము తదితర వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఉన్నతాధికారులపై ఉద్యమం ఒత్తిడి
Published Fri, Sep 6 2013 4:07 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement
Advertisement