చిందరవందరగా పడిన బీరువాలోని వస్తువులు, వివరాలు వెల్లడిస్తున్న బాధితులు
సాక్షి, ధర్మవరం అర్బన్ : ధర్మవరంలో పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో చోరీ జరిగింది. బాధితుల కథనం మేరకు.. పట్టణంలోని రూరల్ పోలీస్‌స్టేషన్ సమీపంలో గల మారుతినగర్‌లో శేఖర్ కుటుంబం నివాసముంటోంది. ఇతడు గోరంట్లలోని ఓ థియేటర్‌లో క్యాంటీన్ నడుపుకుంటూ వారానికి ఒకసారి ధర్మవరం వచ్చేవాడు. దినచర్యలో భాగంగా కుటుంబ సభ్యులు గురువారం రాత్రి తొమ్మిది గంటలకు మిద్దెపై పడుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో శేఖర్ అమ్మమ్మ సంతోషమ్మకు నిద్ర పట్టకపోవడంతో పైకి లేచి అటు ఇటు తిరిగింది. వెనుకవైపు ఇంటి మిద్దెపై ఇద్దరు వ్యక్తులు కనపడటంతో భయాందోళనకు గురై కోడలు ప్రమీలను నిద్రలేపింది.
అనంతరం తమ కిటికీ వైపు తొంగిచూడగా బీరువాలోని వస్తువులు, చీరలు చిందరవందరగా పడి ఉండటం చూసి కేకలు వేసింది. దీంతో ఇరుగుపొరుగువారు కూడా అక్కడకు చేరుకోవడంతో దొంగలు పరారయ్యారు. బీరువాలోని రూ.3 లక్షల నగదు, రూ.1.66 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను దుండగులు అపహరించుకుపోయారు. కదిరిలో ఓ ఇంటిని విక్రయించి వచ్చిన రూ.3 లక్షల నగదును రెండురోజుల కిందట బీరువాలో ఉంచామని బాధితులు తెలిపారు. త్వరలో వేరే ఇల్లు కొనడానికి సిద్ధమైన సమయంలో ఈ దొంగతనం జరగడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పట్టణ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment