Canteen Contract
-
పోలీస్ స్టేషన్ సమీపంలోనే చోరీ
సాక్షి, ధర్మవరం అర్బన్ : ధర్మవరంలో పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో చోరీ జరిగింది. బాధితుల కథనం మేరకు.. పట్టణంలోని రూరల్ పోలీస్‌స్టేషన్ సమీపంలో గల మారుతినగర్లో శేఖర్ కుటుంబం నివాసముంటోంది. ఇతడు గోరంట్లలోని ఓ థియేటర్లో క్యాంటీన్ నడుపుకుంటూ వారానికి ఒకసారి ధర్మవరం వచ్చేవాడు. దినచర్యలో భాగంగా కుటుంబ సభ్యులు గురువారం రాత్రి తొమ్మిది గంటలకు మిద్దెపై పడుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో శేఖర్ అమ్మమ్మ సంతోషమ్మకు నిద్ర పట్టకపోవడంతో పైకి లేచి అటు ఇటు తిరిగింది. వెనుకవైపు ఇంటి మిద్దెపై ఇద్దరు వ్యక్తులు కనపడటంతో భయాందోళనకు గురై కోడలు ప్రమీలను నిద్రలేపింది. అనంతరం తమ కిటికీ వైపు తొంగిచూడగా బీరువాలోని వస్తువులు, చీరలు చిందరవందరగా పడి ఉండటం చూసి కేకలు వేసింది. దీంతో ఇరుగుపొరుగువారు కూడా అక్కడకు చేరుకోవడంతో దొంగలు పరారయ్యారు. బీరువాలోని రూ.3 లక్షల నగదు, రూ.1.66 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను దుండగులు అపహరించుకుపోయారు. కదిరిలో ఓ ఇంటిని విక్రయించి వచ్చిన రూ.3 లక్షల నగదును రెండురోజుల కిందట బీరువాలో ఉంచామని బాధితులు తెలిపారు. త్వరలో వేరే ఇల్లు కొనడానికి సిద్ధమైన సమయంలో ఈ దొంగతనం జరగడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పట్టణ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
ప్రభుత్వ క్యాంటిన్ ‘వ్యాపార’మంత్రం..
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో క్యాంటీన్ సేవలు విచిత్రంగా ఉన్నాయి. ఆస్పత్రిలోని రోగులు, బంధువుల కోసం ఏర్పాటు చేసిన క్యాంటీన్ అసలు లక్ష్యం పక్కదారి పడుతోంది. ఆస్పత్రి వైపు చిన్నదారి ఏర్పాటు చేసిన నిర్వాహకుడు.. బయట వైపు రెండు షట్టర్లు పెట్టి వ్యాపారం చేస్తున్నాడు. ఇదంతా అధికారుల కళ్ల ముందే జరుగుతున్నా కనీసం పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా ఏళ్లుగా ఒకరికే టెండర్ దక్కు తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆస్పత్రిలో చేరుతున్న రోగులు, వారి బంధు వులు ఛాయ్, టిఫిన్ కోసం బయట హోటళ్లను ఆశ్రయిస్తున్నారు. ఏళ్ల తరబడి ఒకరికే..! దాదాపు పదేళ్ల క్రితమే క్యాంటీన్ నిర్వహణకు టెండర్ వేశారు. అప్పటి నుంచి ఒక్కరే క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ఆస్పత్రికొచ్చే రోగులు, బంధువులకే క్యాంటీన్ సేవలందించాలి. కానీ లోపలి వైపు చిన్నదారం మాత్రమే ఏర్పాటు చేసి బయటి వైపు షట్టర్లు వేసి బేకరీ నిర్వహిస్తూ వ్యాపారం చేపడుతున్నారు. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంగా అవతరించిన అనంతరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది రోగులు వస్తున్నారు. కేసీఆర్ కిట్ పథకంతో మరింతగా పెరిగిపోయింది. రోగులకు ఆస్పత్రిలో సత్యసాయి సేవ సమితి ఆధ్వర్యంలో భోజనం అందిస్తున్నప్పటికీ టీలు, టిఫిన్లు మాత్రం కరువయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రికి సంబంధించిన క్యాంటీన్లో అన్ని రకాల టీలు, టిఫిన్లు ఉండాలని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. కానీ క్యాంటీన్లో మాత్రం టీలు, టిఫిన్లు దొరకడం లేదు. రాత్రి వేళల్లో బంధువులకు భోజనం దొరకడం లేదు. ఈ క్యాంటీన్లో బేకరి నిర్వహించడంతో విమర్శలకు తావిస్తోంది. కొన్నేళ్లుగా ఒకరికే కాంట్రాక్ట్ కొనసాగిస్తున్నారని అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం టెండర్ నిర్వహిస్తే నడిబొడ్డు కావడంతో అందులో జిల్లా ఆస్పత్రిగా పేరు పొందడంతో మరింత ఆదాయం పొందే అవకాశం ఉంది. కానీ వైద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. చర్యలు తీసుకుంటాం ఆస్పత్రిలో ఒకసారే టెండర్ నిర్వహిస్తాం. ప్రస్తుతం అతనే నిర్వహిస్తున్నాడు. టీ, టిఫిన్లు ఏర్పాటు చేయాల్సిందే. సమస్యలుంటే మా దృష్టికి తీసుకొస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – సదామోహన్, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
రచ్చకెక్కిన రిమ్స్ క్యాంటీన్
రిమ్స్ క్యాంపస్: ఇంకా నిర్మాణమే పూర్తి కాని రిమ్స్ క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్ట్ వ్యవహారం మాత్రం రచ్చ రచ్చ అవుతోంది. మంచి ఆదాయం సమకూర్చే అవకాశమున్న ఈ క్యాంటీన్‌ను దక్కించుకునేందుకు కొందరు అడ్డదారిలో వెళుతున్న విషయం గుప్పుమనడంతో ఆ ప్రయత్నాల్లో ఉన్నవారు ఉలిక్కిపడ్డారు. అయినా సరే.. ఎలాగైనా తమకే కట్టబెట్టేలా చేసుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. క్యాంటీన్ కాంట్రాక్ట్‌ను తమకే ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్ అంగీకరించారని ఓ మహిళా సంఘం నాయకురాలు వాదిస్తుం డగా.. కలెక్టర్ అలా చెప్పనేలేదని, ‘పుటప్ ఫైల్’ అని మాత్రమే నోట్ పంపారని రిమ్స్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం జరగాల్సిన ఈ వ్యవహారంలో ఎందుకింత రచ్చ అని టెండర్లు వేసేందుకు ఆసక్తిగా ఉన్నవారు ప్రశ్నిస్తున్నారు. రిమ్స్‌లో రోగులు, వారి బంధువుల సౌకర్యార్థం క్యాంటీన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి భవనం నిర్మాణం చేపట్టారు. నిర్మాణం చివరి దశలో ఉండగా, దాని నిర్వహణ కాంట్రాక్ట్‌ను దక్కించుకునేందుకు కొందరు అడ్డదారిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. దానికి మహిళా సంఘం ముసుగు తొడిగారు. కొద్ది రోజుల్లో క్యాంటీన్ వారి స్వాధీనం అయిపోతుందనుకుంటున్న తరుణంలో ‘సాక్షి’ ఆ ముసుగును తొలగించింది. ఈ నెల 9వ తేదీన ‘అడ్డగోలు వడ్డింపు’ అనే కథనంతో క్యాంటీన్ లోగుట్టును బయటపెట్టింది. దీంతో టెండర్ల ద్వారా క్యాంటీన్ నిర్వహణ చేపట్టేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్న పలువురు ఈ ప్రక్రియ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ మాకే ఇమ్మన్నారు:మహిళా సంఘం రిమ్స్ క్యాంటీన్‌ను తమకిచ్చేందుకు ‘మెప్మా’ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, రిమ్స్ డెరైక్టర్ అం గీకరించారని, విజయ బ్యాంకు నుంచి ఆర్థిక సహాయం ఇప్పించేందుకు కూడా సిఫారసు చేశారని శ్రీలక్ష్మి స్వయంశక్తి సంఘం సభ్యురాలు ఆర్.సుజాత్ వాదిస్తున్నారు. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందనగా ఆమె ఒక ప్రకటన ఇచ్చారు. శ్రీకాకుళం పట్టణంలోని 4, 5 వార్డుల మహిళలు శ్రీలక్ష్మి స్వయంశక్తి సం ఘాన్ని నడుపుతున్నారని, తమ అభ్యర్ధన మేర కు క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇప్పించేందుకు కలెక్టర్ అంగీకరించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అటువంటి ఆదేశాలు లేవు: రిమ్స్ ఏవో అయితే క్యాంటీన్‌ను ఇంకా ఎవరికీ కేటాయించలేదని రిమ్స్ ఏవో వీర్రాజు స్పష్టం చేశారు. శ్రీలక్ష్మి స్వయంశక్తి సంఘానికి క్యాంటీన్ ఇవ్వాలని కలెక్టర్ ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని కూడా వివరించారు. సదరు మహిళా సంఘం పెట్టుకున్న అభ్యర్ధన మేరకు పుటప్ ఫైల్ అని మాత్రమే రాశారని తెలిపారు. అంతే తప్ప ఆ మహిళా సంఘానికే ఇచ్చేయమని ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదన్నారు. దీనిపై ఆయనకు స్పష్టమైన నివేదిక ఇస్తామని చెప్పారు. నిబంధనల ప్రకారం టెండర్ల ప్రక్రియ ఉంటుందని స్పష్టంగా చెప్పారు. ఏకపక్షంగా ఒక సంఘానికే ఎలా ఇస్తారు? క్యాంటీన్‌ను మహిళా సంఘాలకు ఇవ్వడం మంచిదే. అయితే ఏకపక్షంగా ఎటువంటి పరిశీలనలు, సంప్రదింపులు లేకుండా ఒక సంఘానికి ఎలా కట్టబెడతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జిల్లాలో సుమారు 46వేల మహిళా సంఘాలు ఉన్నాయి. శ్రీకాకుళం పట్టణాన్నే తీసుకుంటే.. ఇక్కడ 52 సంఘాలు ఉన్నాయి. క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్ట్ మహిళా సంఘాలకే ఇవ్వాలనుకుంటే ఈ సంఘాలన్నింటి నుంచి దరఖాస్తులు ఆహ్వానించి.. ఎవరు అర్హులో, సమర్థులో పరిశీలించి.. అటువంటి సంఘానికి కాంట్రాక్ట్ ఖరారు చేయాలి. కానీ ఇవేవీ లేకుండా ఒక సంఘానికి కట్టబెట్టడం సరికాదని మిగిలిన సంఘాల ప్రతినిధులు అంటున్నారు. అలా కాని పక్షంలో ఓపెన్ టెండర్లు పలిచి ఎవరు ఎక్కువ ధర ఆఫర్ చేస్తే వారికి కేటాయించడం సమంజసంగా ఉంటుందని అంటున్నారు. ఇవేవీ లేకుండా సాక్షాత్తు కలెక్టరే తమకు కేటాయించారని ఒక సంఘం సభ్యులు ఎలా బహిరంగంగా చెబుతున్నారో అర్థం కావడం లేదంటున్నారు. దీని వెనుక ఎవరున్నారన్నది కూడా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.