రచ్చకెక్కిన రిమ్స్ క్యాంటీన్ | not completed Rims canteen work | Sakshi
Sakshi News home page

రచ్చకెక్కిన రిమ్స్ క్యాంటీన్

Published Wed, Jun 11 2014 2:23 AM | Last Updated on Tue, Nov 6 2018 5:47 PM

రచ్చకెక్కిన రిమ్స్ క్యాంటీన్ - Sakshi

రచ్చకెక్కిన రిమ్స్ క్యాంటీన్

రిమ్స్ క్యాంపస్:  ఇంకా నిర్మాణమే పూర్తి కాని రిమ్స్ క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్ట్ వ్యవహారం మాత్రం రచ్చ రచ్చ అవుతోంది. మంచి ఆదాయం సమకూర్చే అవకాశమున్న ఈ క్యాంటీన్‌ను దక్కించుకునేందుకు కొందరు అడ్డదారిలో వెళుతున్న విషయం గుప్పుమనడంతో ఆ ప్రయత్నాల్లో ఉన్నవారు ఉలిక్కిపడ్డారు. అయినా సరే.. ఎలాగైనా తమకే కట్టబెట్టేలా చేసుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. క్యాంటీన్ కాంట్రాక్ట్‌ను తమకే ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్ అంగీకరించారని ఓ మహిళా సంఘం నాయకురాలు వాదిస్తుం డగా.. కలెక్టర్ అలా చెప్పనేలేదని, ‘పుటప్ ఫైల్’ అని మాత్రమే నోట్ పంపారని రిమ్స్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
 
 నిబంధనల ప్రకారం జరగాల్సిన ఈ వ్యవహారంలో ఎందుకింత రచ్చ అని టెండర్లు వేసేందుకు ఆసక్తిగా ఉన్నవారు ప్రశ్నిస్తున్నారు. రిమ్స్‌లో రోగులు, వారి బంధువుల సౌకర్యార్థం క్యాంటీన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి భవనం నిర్మాణం చేపట్టారు. నిర్మాణం చివరి దశలో ఉండగా, దాని నిర్వహణ కాంట్రాక్ట్‌ను దక్కించుకునేందుకు కొందరు అడ్డదారిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. దానికి మహిళా సంఘం ముసుగు తొడిగారు. కొద్ది రోజుల్లో క్యాంటీన్ వారి స్వాధీనం అయిపోతుందనుకుంటున్న తరుణంలో ‘సాక్షి’ ఆ ముసుగును తొలగించింది. ఈ నెల 9వ తేదీన ‘అడ్డగోలు వడ్డింపు’ అనే కథనంతో క్యాంటీన్ లోగుట్టును బయటపెట్టింది. దీంతో టెండర్ల ద్వారా క్యాంటీన్ నిర్వహణ చేపట్టేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్న పలువురు ఈ ప్రక్రియ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
 
 కలెక్టర్ మాకే ఇమ్మన్నారు:మహిళా సంఘం
 రిమ్స్ క్యాంటీన్‌ను తమకిచ్చేందుకు ‘మెప్మా’ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, రిమ్స్ డెరైక్టర్ అం గీకరించారని, విజయ బ్యాంకు నుంచి ఆర్థిక సహాయం ఇప్పించేందుకు కూడా సిఫారసు చేశారని శ్రీలక్ష్మి స్వయంశక్తి సంఘం సభ్యురాలు ఆర్.సుజాత్ వాదిస్తున్నారు. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందనగా ఆమె ఒక ప్రకటన ఇచ్చారు. శ్రీకాకుళం పట్టణంలోని 4, 5 వార్డుల మహిళలు శ్రీలక్ష్మి స్వయంశక్తి సం ఘాన్ని నడుపుతున్నారని, తమ అభ్యర్ధన మేర కు క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇప్పించేందుకు కలెక్టర్ అంగీకరించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
 
 అటువంటి ఆదేశాలు లేవు: రిమ్స్ ఏవో
 అయితే క్యాంటీన్‌ను ఇంకా ఎవరికీ కేటాయించలేదని రిమ్స్ ఏవో వీర్రాజు స్పష్టం చేశారు. శ్రీలక్ష్మి స్వయంశక్తి సంఘానికి క్యాంటీన్ ఇవ్వాలని కలెక్టర్ ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని కూడా వివరించారు. సదరు మహిళా సంఘం పెట్టుకున్న అభ్యర్ధన మేరకు పుటప్ ఫైల్ అని మాత్రమే రాశారని తెలిపారు. అంతే తప్ప ఆ మహిళా సంఘానికే ఇచ్చేయమని ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదన్నారు. దీనిపై ఆయనకు స్పష్టమైన నివేదిక ఇస్తామని చెప్పారు. నిబంధనల ప్రకారం టెండర్ల ప్రక్రియ ఉంటుందని స్పష్టంగా చెప్పారు.
 
 ఏకపక్షంగా ఒక సంఘానికే ఎలా ఇస్తారు?
 క్యాంటీన్‌ను మహిళా సంఘాలకు ఇవ్వడం మంచిదే. అయితే ఏకపక్షంగా ఎటువంటి పరిశీలనలు, సంప్రదింపులు లేకుండా ఒక సంఘానికి ఎలా కట్టబెడతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జిల్లాలో సుమారు 46వేల మహిళా సంఘాలు ఉన్నాయి. శ్రీకాకుళం పట్టణాన్నే తీసుకుంటే.. ఇక్కడ 52 సంఘాలు ఉన్నాయి. క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్ట్ మహిళా సంఘాలకే ఇవ్వాలనుకుంటే ఈ సంఘాలన్నింటి నుంచి దరఖాస్తులు ఆహ్వానించి.. ఎవరు అర్హులో, సమర్థులో పరిశీలించి.. అటువంటి సంఘానికి కాంట్రాక్ట్ ఖరారు చేయాలి. కానీ ఇవేవీ లేకుండా ఒక సంఘానికి కట్టబెట్టడం సరికాదని మిగిలిన సంఘాల ప్రతినిధులు అంటున్నారు. అలా కాని పక్షంలో ఓపెన్ టెండర్లు పలిచి ఎవరు ఎక్కువ ధర ఆఫర్ చేస్తే వారికి కేటాయించడం సమంజసంగా ఉంటుందని అంటున్నారు. ఇవేవీ లేకుండా సాక్షాత్తు కలెక్టరే తమకు కేటాయించారని ఒక సంఘం సభ్యులు ఎలా బహిరంగంగా చెబుతున్నారో అర్థం కావడం లేదంటున్నారు. దీని వెనుక ఎవరున్నారన్నది కూడా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement