Rims officers
-
ఎందుకంత తొందర?
శ్రీకాకుళం : శ్రీకాకుళం రిమ్స్ వైద్యశాలలో ఈ నెల 15న ఓ గర్భిణీకి చికిత్స అందించడంలో అలసత్వం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు ప్రదర్శించిన అత్యుత్సాహంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిమ్స్‌లో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం కొత్త కాదు. ఎప్పుడూ స్పందించని రిమ్స్ అధికారులు ఇప్పుడు ఆదుర్దాగా విచారణ జరిపించి ఓ వైద్యాధికారి, స్టాఫ్ నర్సు, ప్రసూతి సహాయకురాలు, ఆయాలను సస్పెండ్ చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. జరిగిన సంఘటనపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించిన తరువాత రిమ్స్ అధికారులు కూడా కంగారుగా విచారణ జరిపించడం చర్చనీయాంశమైంది. రిమ్స్ అధికారులు తమ వారిని రక్షించుకునేందుకే ఇలాం టి చర్యలు చేపట్టారని ఆక్షేపణలు విన్పిస్తున్నాయి. సస్పెండ్ అయిన వైద్యురా లు రెగ్యులర్ కూడా కాదు. ఆమె శిక్షణకోసం వచ్చారు. అటువంటి ఆమెకు రెగ్యులర్ డ్యూటీ ఎలా వేశారు? ఎవరు వేశారు? అనే దానిపై వారు ప్రస్తావించనేలేదు. రిమ్స్ అధికారులు సంఘటనకు సంబంధించి విచారణ అధికారిగా నియమించిన డాక్టర్ అరవింద్ ఆ రోజు ప్రసూతి వార్డులో ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టు సమాచారం. డాక్టర్ అరవింద్‌ను రక్షించేందుకే విచారణాధికారిగా ఆయన్ను నియమించారన్న ప్రచారం జరుగుతోంది. కలెక్టర్ నియమించిన విచారణాధికారులు డాక్టర్ అరవింద్ ప్రసూతి వార్డులో ఆ రోజు విధులు నిర్వర్తించాల్సి ఉన్నట్టు గుర్తించగా తాను విధులకు హాజరు కాలేక డాక్టర్ ఏపీ ప్రసాద్‌కు ఆ బాధ్యతలను అప్పగించామని అరవింద్ చెప్పినట్టు సమాచారం. అది లిఖితపూర్వకంగా లేకపోవడం, ఏపీ ప్రసాద్ అది వాస్తవం కాదని చెప్పడంతో అరవిందే బాధ్యుడని విచారణాధికారులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. కలెక్టర్ నియమించిన అధికారుల కమిటీ నివేదిక ఇవ్వకముందే తామే చర్యలు తీసుకుంటే ఉన్నతాధికారులను దృష్టి మళ్లించవచ్చన్న ఉద్దేశ్యంతోనే రిమ్స్ అధికారు లు ముందస్తుగా కలెక్టర్‌కు నివేదికను సమర్పిస్తూ వైద్యురాలిని, సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు చెప్పినట్టు పలువురు అంటున్నారు. దీనిపై రిమ్స్ డైరక్టర్ డాక్టర్ జయరాజ్ వద్ద సాక్షి ప్రస్తావించగా ఎవరిని రక్షించడానికో విచారణ జరిపించలేదన్నారు. సంఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించాననీ, ఆ రోజు డాక్టర్ అరవింద్ డ్యూటీ డాక్టర్ అని తన దృష్టికి రాలేదని తెలిపారు. విచారణాధికారులనివేదిక ఆధారంగానే చర్యలు తీసుకున్నానని తెలిపారు. -
రచ్చకెక్కిన రిమ్స్ క్యాంటీన్
రిమ్స్ క్యాంపస్: ఇంకా నిర్మాణమే పూర్తి కాని రిమ్స్ క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్ట్ వ్యవహారం మాత్రం రచ్చ రచ్చ అవుతోంది. మంచి ఆదాయం సమకూర్చే అవకాశమున్న ఈ క్యాంటీన్‌ను దక్కించుకునేందుకు కొందరు అడ్డదారిలో వెళుతున్న విషయం గుప్పుమనడంతో ఆ ప్రయత్నాల్లో ఉన్నవారు ఉలిక్కిపడ్డారు. అయినా సరే.. ఎలాగైనా తమకే కట్టబెట్టేలా చేసుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. క్యాంటీన్ కాంట్రాక్ట్‌ను తమకే ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్ అంగీకరించారని ఓ మహిళా సంఘం నాయకురాలు వాదిస్తుం డగా.. కలెక్టర్ అలా చెప్పనేలేదని, ‘పుటప్ ఫైల్’ అని మాత్రమే నోట్ పంపారని రిమ్స్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం జరగాల్సిన ఈ వ్యవహారంలో ఎందుకింత రచ్చ అని టెండర్లు వేసేందుకు ఆసక్తిగా ఉన్నవారు ప్రశ్నిస్తున్నారు. రిమ్స్‌లో రోగులు, వారి బంధువుల సౌకర్యార్థం క్యాంటీన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి భవనం నిర్మాణం చేపట్టారు. నిర్మాణం చివరి దశలో ఉండగా, దాని నిర్వహణ కాంట్రాక్ట్‌ను దక్కించుకునేందుకు కొందరు అడ్డదారిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. దానికి మహిళా సంఘం ముసుగు తొడిగారు. కొద్ది రోజుల్లో క్యాంటీన్ వారి స్వాధీనం అయిపోతుందనుకుంటున్న తరుణంలో ‘సాక్షి’ ఆ ముసుగును తొలగించింది. ఈ నెల 9వ తేదీన ‘అడ్డగోలు వడ్డింపు’ అనే కథనంతో క్యాంటీన్ లోగుట్టును బయటపెట్టింది. దీంతో టెండర్ల ద్వారా క్యాంటీన్ నిర్వహణ చేపట్టేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్న పలువురు ఈ ప్రక్రియ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ మాకే ఇమ్మన్నారు:మహిళా సంఘం రిమ్స్ క్యాంటీన్‌ను తమకిచ్చేందుకు ‘మెప్మా’ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, రిమ్స్ డెరైక్టర్ అం గీకరించారని, విజయ బ్యాంకు నుంచి ఆర్థిక సహాయం ఇప్పించేందుకు కూడా సిఫారసు చేశారని శ్రీలక్ష్మి స్వయంశక్తి సంఘం సభ్యురాలు ఆర్.సుజాత్ వాదిస్తున్నారు. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందనగా ఆమె ఒక ప్రకటన ఇచ్చారు. శ్రీకాకుళం పట్టణంలోని 4, 5 వార్డుల మహిళలు శ్రీలక్ష్మి స్వయంశక్తి సం ఘాన్ని నడుపుతున్నారని, తమ అభ్యర్ధన మేర కు క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇప్పించేందుకు కలెక్టర్ అంగీకరించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అటువంటి ఆదేశాలు లేవు: రిమ్స్ ఏవో అయితే క్యాంటీన్‌ను ఇంకా ఎవరికీ కేటాయించలేదని రిమ్స్ ఏవో వీర్రాజు స్పష్టం చేశారు. శ్రీలక్ష్మి స్వయంశక్తి సంఘానికి క్యాంటీన్ ఇవ్వాలని కలెక్టర్ ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని కూడా వివరించారు. సదరు మహిళా సంఘం పెట్టుకున్న అభ్యర్ధన మేరకు పుటప్ ఫైల్ అని మాత్రమే రాశారని తెలిపారు. అంతే తప్ప ఆ మహిళా సంఘానికే ఇచ్చేయమని ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదన్నారు. దీనిపై ఆయనకు స్పష్టమైన నివేదిక ఇస్తామని చెప్పారు. నిబంధనల ప్రకారం టెండర్ల ప్రక్రియ ఉంటుందని స్పష్టంగా చెప్పారు. ఏకపక్షంగా ఒక సంఘానికే ఎలా ఇస్తారు? క్యాంటీన్‌ను మహిళా సంఘాలకు ఇవ్వడం మంచిదే. అయితే ఏకపక్షంగా ఎటువంటి పరిశీలనలు, సంప్రదింపులు లేకుండా ఒక సంఘానికి ఎలా కట్టబెడతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జిల్లాలో సుమారు 46వేల మహిళా సంఘాలు ఉన్నాయి. శ్రీకాకుళం పట్టణాన్నే తీసుకుంటే.. ఇక్కడ 52 సంఘాలు ఉన్నాయి. క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్ట్ మహిళా సంఘాలకే ఇవ్వాలనుకుంటే ఈ సంఘాలన్నింటి నుంచి దరఖాస్తులు ఆహ్వానించి.. ఎవరు అర్హులో, సమర్థులో పరిశీలించి.. అటువంటి సంఘానికి కాంట్రాక్ట్ ఖరారు చేయాలి. కానీ ఇవేవీ లేకుండా ఒక సంఘానికి కట్టబెట్టడం సరికాదని మిగిలిన సంఘాల ప్రతినిధులు అంటున్నారు. అలా కాని పక్షంలో ఓపెన్ టెండర్లు పలిచి ఎవరు ఎక్కువ ధర ఆఫర్ చేస్తే వారికి కేటాయించడం సమంజసంగా ఉంటుందని అంటున్నారు. ఇవేవీ లేకుండా సాక్షాత్తు కలెక్టరే తమకు కేటాయించారని ఒక సంఘం సభ్యులు ఎలా బహిరంగంగా చెబుతున్నారో అర్థం కావడం లేదంటున్నారు. దీని వెనుక ఎవరున్నారన్నది కూడా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఎన్నాళ్లీ ఎంబీబీఎస్ !
ఒంగోలు రిమ్స్‌లో నాలుగో ఏడాది అడ్మిషన్లు లేనట్టు ఎంసీఐ స్పష్టీకరణ కనీస వసతులు లేక వంద సీట్లకు కోత రిమ్స్ ప్రారంభించి ఆరేళ్లు గడుస్తున్నా నేటికీ పూర్తికాని నిర్మాణం వైద్యశాల, కళాశాలల అత్యవసర సిబ్బంది క్వార్టర్లూ పూర్తికాలేదు. పలు విభాగాల్లో ప్రొఫెసర్ల కొరత కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం..ఇంజినీరింగ్, రిమ్స్ అధికారుల అలసత్వంతో అనుకున్నంత నష్టం జరిగింది. ఒంగోలు రిమ్స్‌లో నాలుగో సంవత్సరం ఎంబీబీఎస్ అడ్మిషన్లు లేనట్లు భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) స్పష్టం చేసింది. ఢిల్లీలో బుధవారం జరిగిన ఎంసీఐ కార్యనిర్వాహక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో రిమ్స్‌లో వంద సీట్లకు కోత పడింది. కనీస వసతులు లేకపోవడమే ఇందుకు ముఖ్య కారణమని తెలుస్తోంది. సరైన వసతులు కల్పించాలని ఎంసీఐ సమయం ఇచ్చినా రిమ్స్ అధికారులు సద్వినియోగం చేసుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 1.ఒంగోలు రిమ్స్‌కు పూర్తిస్థాయిలో నిధులు విడుదలైనా అభివృద్ధిలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎంబీబీఎస్ మూడో సంవత్సరం గడుస్తున్నా రిమ్స్ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 2. జిల్లాకు వైద్య కళాశాలను తీసుకురావడంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిలు చొరవ చూపి..ఒంగోలులో మెడికల్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. వైద్య కళాశాలకు స్థలం కరువైనా బాలినేని అప్పటి కలెక్టర్‌తో చర్చించి ఎన్ఎస్పీకి చెందిన 25 ఎకరాలకుపైగా స్థలం చూపారు. రాష్ట్రంలో ఒకేసారి ప్రారంభించిన నాలుగు రిమ్స్ కళాశాలల్లో ఒంగోలు కూడా ఒకటి. 3.రిమ్స్‌తో పాటు ప్రారంభించిన మిగిలిన వైద్య కళాశాలలు సకాలంలో నిర్మాణం పూర్తిచేసుకుని..ఒక బ్యాచ్ వైద్య విద్యార్థులు మెడిసిన్ పట్టా కూడా పుచ్చుకున్నారు. ఒంగోలు రిమ్స్ ప్రారంభించి ఆరేళ్లు గడుస్తున్నా నేటికీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 4. రూ.120 కోట్ల బడ్జెట్‌తో ప్రారంభమైన రిమ్స్ నిర్మాణ వ్యయం కాలక్రమేణా రూ.242.31 కోట్లకు చేరింది. ఆమేరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా..కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, ఇంజినీరింగ్ అధికారుల అశ్రద్ధ వల్ల పనులు నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. 5. నిర్మాణాల కాంట్రాక్టు పొందిన ల్యాంకో సంస్థ పనులు జాప్యం చేస్తోందని 2013లో ఆ సంస్థ నుంచి కాంట్రాక్టును తప్పించి విభాగాలను విభజించి ఒక్కో పనిని ఒక్కో కాంట్రాక్టర్‌కు అప్పగించారు. వీరు కూడా నిర్మాణాలు సకాలంలో పూర్తిచేయలేదు. 6. ప్రతిసారీ మెడికల్ కౌన్సిల్ తనిఖీలకు వచ్చే ముందు హడావుడిగా పనులు చేయడం తరువాత మళ్లీ నత్తతో పోటీపడటం కాంట్రాక్టర్లకు రివాజుగా మారింది. ప్రభుత్వ వైద్య కళాశాల కావడంతో మెడికల్ కౌన్సిల్ తప్పక అనుమతులు మంజూరు చేస్తారనే ధీమాతో రిమ్స్ అధికారులూ నెట్టుకొస్తున్నారు. విద్యార్థులకు అరకొర వసతి : వైద్య విద్యార్థులకు పూర్తి సౌకర్యాలు ఉన్న హాస్టల్ అందుబాటులో లేదు. 200 మంది విద్యార్థులకు సరిపడా నిర్మించిన భవనంలోనే 300మంది వుంటున్నారు. వైద్యశాల, కళాశాలకు అవసరమైన అత్యవసర సిబ్బంది నివాసం ఉండే క్వార్టర్ల నిర్మాణం కూడా పూర్తికాలేదు. రిమ్స్‌లో ప్రొఫెసర్ల కొరత రిమ్స్‌కు ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది. జనరల్ సర్జరీ, అనాటమీ, ఫిజియాలజీ, పీడియాట్రిక్స్, ఆర్ధోపెడిక్స్, రేడియాలజీ, టీబీ, సైకాలజీ, జనరల్ మెడిసన్ తదితర విభాగాల్లో ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది. 1.8 మంది ప్రొఫెసర్లు, 14 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 9 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, ఐదుగురు ట్యూటర్లు కావాలి. ఎమ్ఎన్వోలు, ఎఫ్‌ఎన్‌వోలు దాదాపు 75 మంది అవసరం. కానీ ఇంత వరకు ఒక్కరిని కూడా తీసుకోలేదు. ఇద్దరు హెచ్‌వోడీ స్థాయి అధికారులు లైంగిక వేధింపుల కేసుల్లో ఇరుక్కుని..విధులకు దూరమయ్యారు. మరోసారి తనిఖీలకు రావాలని కోరాం...డాక్టర్ అంజయ్య, రిమ్స్ డైరక్టర్ భారతీయ వైద్య మండలి సూచించిన మార్పులను సరిశాం. మరోసారి రిమ్స్ వైద్య కళాశాలలో తనిఖీకి రావాలని ఎంసీఐకి లేఖ రాశాం. ఈ లేఖ ఈ నెల 2న ఎంసీఐకి చేరినట్లు మాకు అక్నాలెజ్డెమెంట్ కూడా అందింది. ఏది ఏమైనా జూన్ నెలాఖరు వరకు ఎంసీఐ మరోసారి తనిఖీకి వచ్చే అవకాశం ఉంది. -
ట్రామాకేర్‌లో అడ్డగోలు నియామకాలు!
శ్రీకాకుళం కలెక్టరేట్,న్యూస్‌లైన్: ట్రామాకేర్‌లో వివిధ రకాలకు చెందిన 43 ఉద్యోగాలకు సంబంధించి జాబితాలను రిమ్స్ అధికారులు సిద్దం చేశారు. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థుల నియామకాలకు రంగం సిద్ధమవుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే వీటిని పూర్తి చేసేందుకు రిమ్స్ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. సక్రమంగా వీటిని భర్తీ చేస్తే ఆరు నెలల కిందటే ఉద్యోగ నియామకాలు పూర్తయ్యేవి. ట్రామాకేర్ సెంటర్ ఉద్యోగాల నియామకాలు ఏపీ వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో జరగాల్సి ఉంది. ఉద్యోగ నియామకాలు జాప్యం జరుగుతాయనే నెపంతో ఈ బాధ్యతను రిమ్స్ అధికారులు తీసుకున్నారు. కానీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అధికారులు అడుగడుగునా తప్పులు చేశారు. దరఖాస్తుల స్వీకరణ నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు ఈ తప్పుల పరంపరంకొనసాగింది. నాటి జాబితాల్లో తప్పులపై కథనాలను ‘సాక్షి’ ఐదు రోజుల పాటు ప్రచురించింది. అదే సమయంలో ప్రధానంగా డ్రైవర్ పోస్టు, స్టాఫ్‌నర్సు, రేడియోలజీ, ఈసీజీ టెక్నీషియన్ నియామకాలకు సంబంధించి రోస్టర్, లోకల్, నాన్‌లోకల్, మెరిట్‌లు పాటించలేదని సంబంధిత అభ్యర్థులు కలెక్టర్‌ను ఆశ్రయించారు. దీంతో కలెక్టర్ ఈ నియామకాలు నిలుపు చేశారు. అంతే కాకుండా ఆ జాబితాలను కలెక్టర్ కార్యాలయానికి అందజేయాలని కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ జాబితాలను కలెక్టరేట్ సిబ్బంది పరిశీలించి స్పష్టంగా లేవని, దరఖాస్తులతో సహా అందజేయాలని ట్రామాకేర్ ఫైల్‌ను వెనక్కి పంపారు. తర్వాత ఎన్నికలు రావడంతో ఐదారు నెలలు గడిచిపోయాయి. ప్రస్తుతం గుట్టు చప్పుడు కాకుండా జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి ఒత్తిడి మేరకు పాతజాబితాలో స్వల్ప మార్పులతో మళ్లీ నియామకాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ సారి కూడా రిమ్స్ అధికారులు గతంలో చేసిన పొరపాట్లే పునరావృతం చేస్తున్నారు. మెరిట్ జాబితాను ప్రచురించడం, రోస్టర్ పాయింట్లను నోటీస్ బోర్డులో తెలియజేయడం, అనంతరం మెరిట్ రోస్టర్ నాన్‌లోకల్, లోకల్ ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాల్సిన నియామకాలను పాటించకుండా రహస్యంగా నిర్వహిస్తున్నారు. దీంతో గతంలో లాగే మళ్లీ అడ్డగోలు నియామకాలకు తెరతీశారనే ఆరోపణలు వస్తున్నాయి. తమకు న్యాయం జరుగుతుందని గతంలో ఫిర్యాదు చేసిన వారు, న్యాయస్థానం ఆశ్రయించినవారు భావిస్తున్నారు. కానీ గుట్టుచప్పుడు కాకుండా జాబితా సిద్ధం చేస్తున్నారని, ఈ ప్రక్రియను పర్యవేక్షించాల్సిన జిల్లా ఉన్నతాధికారి పట్టించుకోకపోవడం, నియామకాలు జరపాలని సిఫార్సు చేయడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే రిమ్స్‌లో ప్రతి నియామకం వివాదాస్పదం కావడం రోస్టర్, మెరిట్‌కు ప్రాధాన్యత లేకపోవడంతో ప్రస్తుతం భర్తీ చేయనున్న 43 పోస్టుల్లో కూడా తప్పులు దొర్లాయని, మాజీ మంత్రి సిఫార్సుల మేరకే నియామకాలుచేపడతారనే ప్రచారం సాగుతోంది. చక్కదిద్దుకుని వెళతారా? రిమ్స్‌లో డీడీ, సూపరింటెండెంట్, డెరైక్టర్లు ఆ పోస్టుల నుంచి బయట పడేందుకు సన్నాహాలు చేసుకున్నారు. తాము వెళ్లే ముందు వీటిని చక్కబెట్టుకుని వెళుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మరో రెండు రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. దీనికి ముందే ఈ తంతునంతా పూర్తి చేసి అనుకున్నట్టుగా నియామకాలు చేపట్టేందుకు రిమ్స్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని పలువురు భావిస్తున్నారు.