ట్రామాకేర్‌లో అడ్డగోలు నియామకాలు!
శ్రీకాకుళం కలెక్టరేట్,న్యూస్‌లైన్: ట్రామాకేర్‌లో వివిధ రకాలకు చెందిన 43 ఉద్యోగాలకు సంబంధించి జాబితాలను రిమ్స్ అధికారులు సిద్దం చేశారు. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థుల నియామకాలకు రంగం సిద్ధమవుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే వీటిని పూర్తి చేసేందుకు రిమ్స్ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. సక్రమంగా వీటిని భర్తీ చేస్తే ఆరు నెలల కిందటే ఉద్యోగ నియామకాలు పూర్తయ్యేవి. ట్రామాకేర్ సెంటర్ ఉద్యోగాల నియామకాలు ఏపీ వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో జరగాల్సి ఉంది.
ఉద్యోగ నియామకాలు జాప్యం జరుగుతాయనే నెపంతో ఈ బాధ్యతను రిమ్స్ అధికారులు తీసుకున్నారు. కానీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అధికారులు అడుగడుగునా తప్పులు చేశారు. దరఖాస్తుల స్వీకరణ నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు ఈ తప్పుల పరంపరంకొనసాగింది. నాటి జాబితాల్లో తప్పులపై కథనాలను ‘సాక్షి’ ఐదు రోజుల పాటు ప్రచురించింది. అదే సమయంలో ప్రధానంగా డ్రైవర్ పోస్టు, స్టాఫ్‌నర్సు, రేడియోలజీ, ఈసీజీ టెక్నీషియన్ నియామకాలకు సంబంధించి రోస్టర్, లోకల్, నాన్‌లోకల్, మెరిట్‌లు పాటించలేదని సంబంధిత అభ్యర్థులు కలెక్టర్‌ను ఆశ్రయించారు.
దీంతో కలెక్టర్ ఈ నియామకాలు నిలుపు చేశారు. అంతే కాకుండా ఆ జాబితాలను కలెక్టర్ కార్యాలయానికి అందజేయాలని కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ జాబితాలను కలెక్టరేట్ సిబ్బంది పరిశీలించి స్పష్టంగా లేవని, దరఖాస్తులతో సహా అందజేయాలని ట్రామాకేర్ ఫైల్‌ను వెనక్కి పంపారు. తర్వాత ఎన్నికలు రావడంతో ఐదారు నెలలు గడిచిపోయాయి. ప్రస్తుతం గుట్టు చప్పుడు కాకుండా జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి ఒత్తిడి మేరకు పాతజాబితాలో స్వల్ప మార్పులతో మళ్లీ నియామకాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ సారి కూడా రిమ్స్ అధికారులు గతంలో చేసిన పొరపాట్లే పునరావృతం చేస్తున్నారు. మెరిట్ జాబితాను ప్రచురించడం, రోస్టర్ పాయింట్‌లను నోటీస్ బోర్డులో తెలియజేయడం,
అనంతరం మెరిట్ రోస్టర్ నాన్‌లోకల్, లోకల్ ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాల్సిన నియామకాలను పాటించకుండా రహస్యంగా నిర్వహిస్తున్నారు. దీంతో గతంలో లాగే మళ్లీ అడ్డగోలు నియామకాలకు తెరతీశారనే ఆరోపణలు వస్తున్నాయి. తమకు న్యాయం జరుగుతుందని గతంలో ఫిర్యాదు చేసిన వారు, న్యాయస్థానం ఆశ్రయించినవారు భావిస్తున్నారు. కానీ గుట్టుచప్పుడు కాకుండా జాబితా సిద్ధం చేస్తున్నారని, ఈ ప్రక్రియను పర్యవేక్షించాల్సిన జిల్లా ఉన్నతాధికారి పట్టించుకోకపోవడం, నియామకాలు జరపాలని సిఫార్సు చేయడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే రిమ్స్‌లో ప్రతి నియామకం వివాదాస్పదం కావడం రోస్టర్, మెరిట్‌కు ప్రాధాన్యత లేకపోవడంతో ప్రస్తుతం భర్తీ చేయనున్న 43 పోస్టుల్లో కూడా తప్పులు దొర్లాయని, మాజీ మంత్రి సిఫార్సుల మేరకే నియామకాలుచేపడతారనే ప్రచారం సాగుతోంది.
చక్కదిద్దుకుని వెళతారా?
రిమ్స్‌లో డీడీ, సూపరింటెండెంట్, డెరైక్టర్లు ఆ పోస్టుల నుంచి బయట పడేందుకు సన్నాహాలు చేసుకున్నారు. తాము వెళ్లే ముందు వీటిని చక్కబెట్టుకుని వెళుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మరో రెండు రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. దీనికి ముందే ఈ తంతునంతా పూర్తి చేసి అనుకున్నట్టుగా నియామకాలు చేపట్టేందుకు రిమ్స్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని పలువురు భావిస్తున్నారు.