ఎన్నాళ్లీ ఎంబీబీఎస్ !
ఒంగోలు రిమ్స్‌లో నాలుగో ఏడాది అడ్మిషన్లు లేనట్టు ఎంసీఐ స్పష్టీకరణ
కనీస వసతులు లేక వంద సీట్లకు కోత
రిమ్స్ ప్రారంభించి ఆరేళ్లు గడుస్తున్నా నేటికీ పూర్తికాని నిర్మాణం
వైద్యశాల, కళాశాలల అత్యవసర సిబ్బంది క్వార్టర్లూ పూర్తికాలేదు.
పలు విభాగాల్లో ప్రొఫెసర్ల కొరత
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం..ఇంజినీరింగ్, రిమ్స్ అధికారుల అలసత్వంతో అనుకున్నంత నష్టం జరిగింది. ఒంగోలు రిమ్స్‌లో నాలుగో సంవత్సరం ఎంబీబీఎస్ అడ్మిషన్లు లేనట్లు భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) స్పష్టం చేసింది. ఢిల్లీలో బుధవారం జరిగిన ఎంసీఐ కార్యనిర్వాహక
సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో రిమ్స్‌లో వంద సీట్లకు కోత పడింది. కనీస వసతులు లేకపోవడమే ఇందుకు ముఖ్య కారణమని తెలుస్తోంది. సరైన వసతులు కల్పించాలని ఎంసీఐ సమయం ఇచ్చినా రిమ్స్ అధికారులు సద్వినియోగం చేసుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
1.ఒంగోలు రిమ్స్‌కు పూర్తిస్థాయిలో నిధులు విడుదలైనా అభివృద్ధిలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎంబీబీఎస్ మూడో సంవత్సరం గడుస్తున్నా రిమ్స్ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
2. జిల్లాకు వైద్య కళాశాలను తీసుకురావడంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిలు చొరవ చూపి..ఒంగోలులో మెడికల్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. వైద్య కళాశాలకు స్థలం కరువైనా బాలినేని అప్పటి కలెక్టర్‌తో చర్చించి ఎన్‌ఎస్‌పీకి చెందిన 25 ఎకరాలకుపైగా స్థలం చూపారు. రాష్ట్రంలో ఒకేసారి ప్రారంభించిన నాలుగు రిమ్స్ కళాశాలల్లో ఒంగోలు కూడా ఒకటి.
3.రిమ్స్‌తో పాటు ప్రారంభించిన మిగిలిన వైద్య కళాశాలలు సకాలంలో నిర్మాణం పూర్తిచేసుకుని..ఒక బ్యాచ్ వైద్య విద్యార్థులు మెడిసిన్ పట్టా కూడా పుచ్చుకున్నారు. ఒంగోలు రిమ్స్ ప్రారంభించి ఆరేళ్లు గడుస్తున్నా నేటికీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
4. రూ.120 కోట్ల బడ్జెట్‌తో ప్రారంభమైన రిమ్స్ నిర్మాణ వ్యయం కాలక్రమేణా రూ.242.31 కోట్లకు చేరింది. ఆమేరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా..కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, ఇంజినీరింగ్ అధికారుల అశ్రద్ధ వల్ల పనులు నత్తనడకన సాగుతూనే ఉన్నాయి.
5. నిర్మాణాల కాంట్రాక్టు పొందిన ల్యాంకో సంస్థ పనులు జాప్యం చేస్తోందని 2013లో ఆ సంస్థ నుంచి కాంట్రాక్టును తప్పించి విభాగాలను విభజించి ఒక్కో పనిని ఒక్కో కాంట్రాక్టర్‌కు అప్పగించారు. వీరు కూడా నిర్మాణాలు సకాలంలో పూర్తిచేయలేదు.
6. ప్రతిసారీ మెడికల్ కౌన్సిల్ తనిఖీలకు వచ్చే ముందు హడావుడిగా పనులు చేయడం తరువాత మళ్లీ నత్తతో పోటీపడటం కాంట్రాక్టర్లకు రివాజుగా మారింది. ప్రభుత్వ వైద్య కళాశాల కావడంతో మెడికల్ కౌన్సిల్ తప్పక అనుమతులు మంజూరు చేస్తారనే ధీమాతో రిమ్స్ అధికారులూ నెట్టుకొస్తున్నారు.
విద్యార్థులకు అరకొర వసతి :
వైద్య విద్యార్థులకు పూర్తి సౌకర్యాలు ఉన్న హాస్టల్ అందుబాటులో లేదు. 200 మంది విద్యార్థులకు సరిపడా నిర్మించిన భవనంలోనే 300మంది వుంటున్నారు. వైద్యశాల, కళాశాలకు అవసరమైన అత్యవసర సిబ్బంది నివాసం ఉండే క్వార్టర్ల నిర్మాణం కూడా పూర్తికాలేదు.
రిమ్స్‌లో ప్రొఫెసర్ల కొరత
రిమ్స్‌కు ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది. జనరల్ సర్జరీ, అనాటమీ, ఫిజియాలజీ, పీడియాట్రిక్స్, ఆర్ధోపెడిక్స్, రేడియాలజీ, టీబీ, సైకాలజీ, జనరల్ మెడిసన్ తదితర విభాగాల్లో ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది.
1.8 మంది ప్రొఫెసర్లు, 14 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 9 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, ఐదుగురు ట్యూటర్లు కావాలి. ఎమ్‌ఎన్‌వోలు, ఎఫ్‌ఎన్‌వోలు దాదాపు 75 మంది అవసరం. కానీ ఇంత వరకు ఒక్కరిని కూడా తీసుకోలేదు. ఇద్దరు హెచ్‌వోడీ స్థాయి అధికారులు లైంగిక వేధింపుల కేసుల్లో ఇరుక్కుని..విధులకు దూరమయ్యారు.
మరోసారి తనిఖీలకు రావాలని కోరాం...డాక్టర్ అంజయ్య, రిమ్స్ డైరక్టర్
భారతీయ వైద్య మండలి సూచించిన మార్పులను సరిశాం. మరోసారి రిమ్స్ వైద్య కళాశాలలో తనిఖీకి రావాలని ఎంసీఐకి లేఖ రాశాం. ఈ లేఖ ఈ నెల 2న ఎంసీఐకి చేరినట్లు మాకు అక్నాలెజ్డెమెంట్ కూడా అందింది. ఏది ఏమైనా జూన్ నెలాఖరు వరకు ఎంసీఐ మరోసారి తనిఖీకి వచ్చే అవకాశం ఉంది.