లంచమిస్తే బిల్లు.. లేదంటే నిల్! | The bill refers corrupt .. or else! | Sakshi
Sakshi News home page

లంచమిస్తే బిల్లు.. లేదంటే నిల్!

Published Thu, May 29 2014 2:20 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

లంచమిస్తే బిల్లు.. లేదంటే నిల్! - Sakshi

లంచమిస్తే బిల్లు.. లేదంటే నిల్!

  •      ఐటీడీఏలో అవినీతి రాజ్యం
  •      కాంట్రాక్టర్ల బిల్లులు నెలల తరబడి ఆలస్యం
  •      బిల్లు అడిగితే.. మెజర్‌మెంట్ బుక్ పోరుుందని సమాధానం
  •      చేయి తడిపిన వారికి వెంటనే మంజూరు
  •      నిబంధనలు సైతం బేఖాతరు
  •      అర్హత లేని సిబ్బందికి అదనపు బాధ్యతలు
  •  సాక్షి, హన్మకొండ: ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనాభివృద్ధి సంస్థ ఇంజనీరింగ్ విభాగం.. ఉపాధి హామీ, ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ తదితర పథకాల ద్వారా ఏటా సగటున 100 కోట్ల రూపాయల పనులను చేపడుతోంది. ఈ పనులు నాణ్యతతో.. సకాలంలో జరిగేలా చూడటం అధికారుల బాధ్యత. కానీ, ఈ విభాగంలోని కార్యనిర్వహణాధికారి మాత్రం అసలు పనులను గాలికొదిలేసి.. అక్రమ సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్నారన్న ఆరోపణలు వెల్లువెతున్నాయి.

    తమకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకే పనులు కట్టబెడుతున్నారు. ఇందుకు అడ్డుగా ఉన్న నిబంధనలను సైతం బేఖాతర్ చేస్తున్నారు. ఈ తరహా  పనులు చేసేందుకు సదరు అధికారి.. ఉద్యోగుల్లో తనదైన వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు విధులు అప్పగించకుండా అర్హత లేని సిబ్బందికి అదనపు బాధ్యతలు కట్టబెట్టడం చూస్తే ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది.   
     
    రెగ్యులర్‌కు నో..

    ప్రస్తుతం ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌తో పాటు మరో ఇద్దరు రెగ్యులర్ అసిస్టెంట్ ఇంజనీర్లు ఉన్నారు. ఇద్దరు అసిస్టెంట్ ఇంజనీర్ల ద్వారా పనులను పర్యవేక్షించాల్సిన ఈఈ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులను పక్కన పెట్టారు. రెగ్యులర్ ఉద్యోగులకు అప్రధాన్య పోస్టులకు పంపించడంతో పాటు నెలల తరబడి ఒక్కటంటే.. ఒక్క పనీ అప్పగించలేదు.

    ఆఖరికి మేడారం జాతర సందర్భంగా ఇతర జిల్లాలో ఉన్న ఉద్యోగులు వచ్చి ఇక్కడ విధులు నిర్వహిస్తే... సదరు అధికారికి ఇక్కడ పని లేకుండా పోయింది. దీనిపై ఆ ఉద్యోగి కాళ్లకు చెప్పులరిగేలా తిరిగి చివరికి క్వాలిటీ కంట్రోల్‌కు మారిపోయారు. మరో అధికారికి ఇప్పటికీ సరైన పనిలేదు. రెగ్యులర్ ఉద్యోగులు చేయాల్సిన విధులను నిబంధనల విరుద్ధంగా నాన్ మస్టర్ రోల్(ఎన్‌ఎంఆర్)లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులకు  అదనపు బాధ్యతలు అప్పగించారు. జాతర పనులతో పాటు ఈ ఇంజనీరింగ్ విభాగంలో ఆధ్వర్యంలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన పనుల పర్యవేక్షణ, మెజర్‌మెంట్ బాధ్యతలను అదనంగా కట్టబెట్టారు.
     
    ఎన్‌ఎంఆర్‌లదే రాజ్యం
     
    తమకు కీలక బాధ్యతలు అప్పజెప్పడంతో ఎన్‌ఎమ్‌ఆర్(నాన్‌మస్టర్ మస్టర్ రోల్) ఉద్యోగులు నిబంధనలను తుంగలో తొక్కి స్వలాభమే పరమావధిగా పని చేస్తున్నారు. వారు చెప్పినట్లుగా వినని కాంట్రాక్టర్లను ముప్పు తిప్పలు పెడుతున్నారు. సకాలంలో బిల్లులు డ్రా చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు సంబంధించి ఎంతో కీలకమైన మెజర్‌మెంట్ బుక్ రికార్డులను సైతం తారుమారు చేస్తున్నారు. తాడ్వాయి మండలంలో బోర్లు వేసిన ఓ కాంట్రాక్టరుకు బిల్లులు చెల్లించకుండా ఆరు నెలలుగా తిప్పుకుంటున్నారు.

    ఇదేమని అడిగితే.. నీ మెజర్‌మెంట్ బుక్ పోయిందంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అప్పులు తెచ్చి  లక్షలాది రూపాయల వ్యయంతో బోర్లు వేశానని, నెలల తరబడి బిల్లు చెల్లించకపోవడంతో వడ్డీ పెరిగిపోతున్నదని, తన కుటుంబం వీధిన పడుతుందంటూ సదరు కాంట్రాక్టరు ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇలా చాలా మంది కాంట్రాక్టర్లు బాధితులుగా మారారు. జంగాలపల్లి, లక్నవరం వద్ద రోడ్డు పనులు నిర్వహించిన కాంట్రాక్టరుకు రూ.14 లక్షల బిల్లులు ఏడాది కాలంగా ఆగిపోయాయి.
     
    ఇదేమని అడిగితే.. ఆయనకు కూడా నీ మెజర్‌మెంట్ బుక్ పోయింది అంటూ సమాధానం చెప్పారు. ఇప్పటికే లక్షలాది రూపాయలు ఖర్చు చేశాం. గట్టిగా అడిగితే ఆ డబ్బులు ఆగిపోతాయేమోననే భయంతో కాంట్రాక్టర్లు మిన్నకుండిపోతున్నారు.
     
    ఇల్లే.. ఆఫీసు
     
    కార్యాలయంలో చేపట్టిన పనులను సదరు అధికారిణి ఇంటి నుంచి చక్కబెడుతుండడం వల్లే ఫైళ్లు మాయం అవుతున్నాయని సంస్థలో పనిచేసే ఉద్యోగులే చెప్పుకుంటున్నారు. ఎన్‌ఎంఆర్ ఉద్యోగులు అన్ని ఫైళ్లను ఏటూరునాగారం కార్యాలయం నుంచి హన్మకొండలో ఉన్న సదరు అధికారి ఇంటికి తీసుకురావడం, అక్కడే చేతులు తడిపే పనులు చక్కబెట్టడం జరుగుతోంది. ఇందుకు సహకరించని పక్షంలో వారి మెజర్‌మెంట్ బుక్స్ మాయమైందంటూ కాంట్రాక్టర్లను నెలల తరబడి బిల్లుల కోసం తిప్పుకుంటున్నారు.

    కీలకమైన మెజర్‌మెంట్ బుక్స్ పోవడంపై కార్యనిర్వాణాధికారికే నేరుగా ఫిర్యాదు చేసినా ఇసుమంతైనా చలనం లేదని కాంట్రాక్టర్లు అంటున్నారు. అధికారుల స్వార్థపూరిత వైఖరి కారణంగా ఇంజనీరింగ్ విభాగంలో పనులు సకాలంలో జరగడం లేదు. అంతేకాదు గిరిజనుల అభ్యున్నతికి ఉపయోగపడాల్సిన ప్రజాధనం పక్కదారి పడుతోంది. ఇప్పటికే లోకాయుక్త విచారణ ప్రారంభమైనందున... కలెక్టర్, ఐటీడీఏ పీఓ సైతం ఈ అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement