శ్రీకాకుళం : శ్రీకాకుళం రిమ్స్ వైద్యశాలలో ఈ నెల 15న ఓ గర్భిణీకి చికిత్స అందించడంలో అలసత్వం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు ప్రదర్శించిన అత్యుత్సాహంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిమ్స్‌లో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం కొత్త కాదు. ఎప్పుడూ స్పందించని రిమ్స్ అధికారులు ఇప్పుడు ఆదుర్దాగా విచారణ జరిపించి ఓ వైద్యాధికారి, స్టాఫ్ నర్సు, ప్రసూతి సహాయకురాలు, ఆయాలను సస్పెండ్ చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. జరిగిన సంఘటనపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించిన తరువాత రిమ్స్ అధికారులు కూడా కంగారుగా విచారణ జరిపించడం చర్చనీయాంశమైంది.
రిమ్స్ అధికారులు తమ వారిని రక్షించుకునేందుకే ఇలాం టి చర్యలు చేపట్టారని ఆక్షేపణలు విన్పిస్తున్నాయి. సస్పెండ్ అయిన వైద్యురా లు రెగ్యులర్ కూడా కాదు. ఆమె శిక్షణకోసం వచ్చారు. అటువంటి ఆమెకు రెగ్యులర్ డ్యూటీ ఎలా వేశారు? ఎవరు వేశారు? అనే దానిపై వారు ప్రస్తావించనేలేదు. రిమ్స్ అధికారులు సంఘటనకు సంబంధించి విచారణ అధికారిగా నియమించిన డాక్టర్ అరవింద్ ఆ రోజు ప్రసూతి వార్డులో ఇన్‌చార్జ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టు సమాచారం. డాక్టర్ అరవింద్‌ను రక్షించేందుకే విచారణాధికారిగా ఆయన్ను నియమించారన్న ప్రచారం జరుగుతోంది. కలెక్టర్ నియమించిన విచారణాధికారులు డాక్టర్ అరవింద్ ప్రసూతి వార్డులో ఆ రోజు విధులు నిర్వర్తించాల్సి ఉన్నట్టు గుర్తించగా తాను విధులకు హాజరు కాలేక డాక్టర్ ఏపీ ప్రసాద్‌కు ఆ బాధ్యతలను అప్పగించామని అరవింద్ చెప్పినట్టు సమాచారం.
అది లిఖితపూర్వకంగా లేకపోవడం, ఏపీ ప్రసాద్ అది వాస్తవం కాదని చెప్పడంతో అరవిందే బాధ్యుడని విచారణాధికారులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. కలెక్టర్ నియమించిన అధికారుల కమిటీ నివేదిక ఇవ్వకముందే తామే చర్యలు తీసుకుంటే ఉన్నతాధికారులను దృష్టి మళ్లించవచ్చన్న ఉద్దేశ్యంతోనే రిమ్స్ అధికారు లు ముందస్తుగా కలెక్టర్‌కు నివేదికను సమర్పిస్తూ వైద్యురాలిని, సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు చెప్పినట్టు పలువురు అంటున్నారు. దీనిపై రిమ్స్ డైరక్టర్ డాక్టర్ జయరాజ్ వద్ద సాక్షి ప్రస్తావించగా ఎవరిని రక్షించడానికో విచారణ జరిపించలేదన్నారు. సంఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించాననీ, ఆ రోజు డాక్టర్ అరవింద్ డ్యూటీ డాక్టర్ అని తన దృష్టికి రాలేదని తెలిపారు. విచారణాధికారులనివేదిక ఆధారంగానే చర్యలు తీసుకున్నానని తెలిపారు.
ఎందుకంత తొందర?
Published Sun, May 24 2015 12:52 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement