Rims canteen
-
రచ్చకెక్కిన రిమ్స్ క్యాంటీన్
రిమ్స్ క్యాంపస్: ఇంకా నిర్మాణమే పూర్తి కాని రిమ్స్ క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్ట్ వ్యవహారం మాత్రం రచ్చ రచ్చ అవుతోంది. మంచి ఆదాయం సమకూర్చే అవకాశమున్న ఈ క్యాంటీన్‌ను దక్కించుకునేందుకు కొందరు అడ్డదారిలో వెళుతున్న విషయం గుప్పుమనడంతో ఆ ప్రయత్నాల్లో ఉన్నవారు ఉలిక్కిపడ్డారు. అయినా సరే.. ఎలాగైనా తమకే కట్టబెట్టేలా చేసుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. క్యాంటీన్ కాంట్రాక్ట్‌ను తమకే ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్ అంగీకరించారని ఓ మహిళా సంఘం నాయకురాలు వాదిస్తుం డగా.. కలెక్టర్ అలా చెప్పనేలేదని, ‘పుటప్ ఫైల్’ అని మాత్రమే నోట్ పంపారని రిమ్స్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం జరగాల్సిన ఈ వ్యవహారంలో ఎందుకింత రచ్చ అని టెండర్లు వేసేందుకు ఆసక్తిగా ఉన్నవారు ప్రశ్నిస్తున్నారు. రిమ్స్‌లో రోగులు, వారి బంధువుల సౌకర్యార్థం క్యాంటీన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి భవనం నిర్మాణం చేపట్టారు. నిర్మాణం చివరి దశలో ఉండగా, దాని నిర్వహణ కాంట్రాక్ట్‌ను దక్కించుకునేందుకు కొందరు అడ్డదారిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. దానికి మహిళా సంఘం ముసుగు తొడిగారు. కొద్ది రోజుల్లో క్యాంటీన్ వారి స్వాధీనం అయిపోతుందనుకుంటున్న తరుణంలో ‘సాక్షి’ ఆ ముసుగును తొలగించింది. ఈ నెల 9వ తేదీన ‘అడ్డగోలు వడ్డింపు’ అనే కథనంతో క్యాంటీన్ లోగుట్టును బయటపెట్టింది. దీంతో టెండర్ల ద్వారా క్యాంటీన్ నిర్వహణ చేపట్టేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్న పలువురు ఈ ప్రక్రియ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ మాకే ఇమ్మన్నారు:మహిళా సంఘం రిమ్స్ క్యాంటీన్‌ను తమకిచ్చేందుకు ‘మెప్మా’ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, రిమ్స్ డెరైక్టర్ అం గీకరించారని, విజయ బ్యాంకు నుంచి ఆర్థిక సహాయం ఇప్పించేందుకు కూడా సిఫారసు చేశారని శ్రీలక్ష్మి స్వయంశక్తి సంఘం సభ్యురాలు ఆర్.సుజాత్ వాదిస్తున్నారు. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందనగా ఆమె ఒక ప్రకటన ఇచ్చారు. శ్రీకాకుళం పట్టణంలోని 4, 5 వార్డుల మహిళలు శ్రీలక్ష్మి స్వయంశక్తి సం ఘాన్ని నడుపుతున్నారని, తమ అభ్యర్ధన మేర కు క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇప్పించేందుకు కలెక్టర్ అంగీకరించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అటువంటి ఆదేశాలు లేవు: రిమ్స్ ఏవో అయితే క్యాంటీన్‌ను ఇంకా ఎవరికీ కేటాయించలేదని రిమ్స్ ఏవో వీర్రాజు స్పష్టం చేశారు. శ్రీలక్ష్మి స్వయంశక్తి సంఘానికి క్యాంటీన్ ఇవ్వాలని కలెక్టర్ ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని కూడా వివరించారు. సదరు మహిళా సంఘం పెట్టుకున్న అభ్యర్ధన మేరకు పుటప్ ఫైల్ అని మాత్రమే రాశారని తెలిపారు. అంతే తప్ప ఆ మహిళా సంఘానికే ఇచ్చేయమని ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదన్నారు. దీనిపై ఆయనకు స్పష్టమైన నివేదిక ఇస్తామని చెప్పారు. నిబంధనల ప్రకారం టెండర్ల ప్రక్రియ ఉంటుందని స్పష్టంగా చెప్పారు. ఏకపక్షంగా ఒక సంఘానికే ఎలా ఇస్తారు? క్యాంటీన్‌ను మహిళా సంఘాలకు ఇవ్వడం మంచిదే. అయితే ఏకపక్షంగా ఎటువంటి పరిశీలనలు, సంప్రదింపులు లేకుండా ఒక సంఘానికి ఎలా కట్టబెడతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జిల్లాలో సుమారు 46వేల మహిళా సంఘాలు ఉన్నాయి. శ్రీకాకుళం పట్టణాన్నే తీసుకుంటే.. ఇక్కడ 52 సంఘాలు ఉన్నాయి. క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్ట్ మహిళా సంఘాలకే ఇవ్వాలనుకుంటే ఈ సంఘాలన్నింటి నుంచి దరఖాస్తులు ఆహ్వానించి.. ఎవరు అర్హులో, సమర్థులో పరిశీలించి.. అటువంటి సంఘానికి కాంట్రాక్ట్ ఖరారు చేయాలి. కానీ ఇవేవీ లేకుండా ఒక సంఘానికి కట్టబెట్టడం సరికాదని మిగిలిన సంఘాల ప్రతినిధులు అంటున్నారు. అలా కాని పక్షంలో ఓపెన్ టెండర్లు పలిచి ఎవరు ఎక్కువ ధర ఆఫర్ చేస్తే వారికి కేటాయించడం సమంజసంగా ఉంటుందని అంటున్నారు. ఇవేవీ లేకుండా సాక్షాత్తు కలెక్టరే తమకు కేటాయించారని ఒక సంఘం సభ్యులు ఎలా బహిరంగంగా చెబుతున్నారో అర్థం కావడం లేదంటున్నారు. దీని వెనుక ఎవరున్నారన్నది కూడా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. -
అడ్డగోలు వడ్డింపు
రిమ్స్ క్యాంపస్, న్యూస్‌లైన్: అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో.. అన్న రీతిలో ఉన్నతాధికారులు వ్యవహరించారు. ఎంతో డిమాండ్.. మరెంతో ఆదాయం సమకూర్చే రిమ్స్ క్యాంటీన్‌ను అడ్డగోలుగా తమ వారికి కట్టబెట్టారు. క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్ట్‌ను టెండర్ ద్వారా దక్కించుకోవాలని కొంతకాలంగా ఎదురుచూస్తున్న పలువురిని అసలు టెండర్ ప్రక్రియే లేకుండా చేసి తీవ్ర నిరాశకు గురి చేశారు. ఈ పని రిమ్స్ అధికారులే చేశారా అంటే.. అబ్బే తాము కాదు.. జిల్లా ఉన్నతాధికారే సిఫారసు చేశారని చెప్పుకొస్తున్నారు. నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా సాగిన ఈ అడ్డగోలు భాగోతాన్ని ఒకసారి పరిశీలిస్తే.. జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్ ఆస్పత్రిలో ఇప్పటికి వరకు రోగులు, వారితో వచ్చే వారికి క్యాంటీన్ లే దు. రిమ్స్‌గా మారకముందు.. జిల్లా కేంద్ర ఆస్పత్రిగా ఉన్నప్పుడు 2005 వరకు ఇక్కడ క్యాంటీన్ ఉండేది. ఆస్పత్రి స్థాయి పెరిగి రిమ్స్‌గా మారినా.. ఇప్పటివరకు క్యాంటీన్ మాత్రం ఏర్పాటు చేయలేదు. ఫలితంగా రోజూ రిమ్స్‌కు వచ్చే రోగులు, వారి బంధువులు ప్రతి దానికీ బయటకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రెండేళ్ల కిందట క్యాంటీన్ ఏర్పాటు చేయాలని రిమ్స్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. అయితే చాలా కాలం ఆ నిర్ణయం అలాగే ఉండిపోయింది. ఏమైందోగానీ.. ఇటీవల అధికారులు హడావుడిగా క్యాంటీన్ నిర్మాణ పనులు చేపట్టారు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఆ నిర్మాణం పూర్తి కావచ్చింది. క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్ట్ ఖరారు చేయాల్సిన సమయం వచ్చింది. ఇక్కడి నుంచే అసలు తతంగం మొదలైంది. నిబంధనల ప్రకారం క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్ట్ ఖరారు చేయడానికి టెండర్లు పిలవాల్సి ఉంది. కానీ ఎటువంటి టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయకుండానే నోటిమాటతో ఓ వ్యక్తికి కాంట్రాక్టును కట్టబెట్టేందుకు రిమ్స్ అధికారులు సిద్ధమయ్యారు. రిమ్స్‌కు కాస్త దూరంలో కొద్ది నెలల క్రితం వరకు ఓ హోటల్ నడిపిన వ్యక్తికి దీన్ని అప్పగించే తతంగాన్ని దాదాపు పూర్తి చేసేశారు. అది కూడా చాలా తక్కువ ధరకే ఖరారు చేసినట్లు విశ్వనీయవర్గాల ద్వారా తెలిసింది. ఓ మహిళా సంఘం పేరుతో సదరు వ్యక్తికి క్యాంటీన్ కాంట్రాక్ట్ కట్టబెట్టేస్తున్నారు. ఇందుకోసం కేవలం రూ.50వేల డిపాజిట్, నెలకు రూ.5వేల అద్దెగా నిర్ణయించినట్టు రిమ్స్ వర్గాల ద్వారానే తెలిసింది. టెండర్లు పిలవకుండా అడ్డదారిలో ఏ విధంగా క్యాంటీన్‌ను కేటాయిస్తారంటూ టెండర్ వేసేందుకు గత రెండేళ్లుగా ఆసక్తితో ఎదురుచూస్తున్నవారు ఆందోళనతో ప్రశ్నిస్తున్నారు. రిమ్స్ ఆదాయానికి గండి ఈ అడ్డగోలు దందా కారణంగా రిమ్స్ ఆదాయానికీ భారీగానే పడుతుందని అంటున్నారు. జిల్లాకే పెద్ద దిక్కయిన రిమ్స్ నిత్యం వందలాది రోగులు, వారి బంధువులు వస్తుంటారు. పెద్ద సంఖ్యలో ఇన్ పేషెంట్లు ఉంటారు. వారితోపాటు సహాయకులు ఉంటారు. రిమ్స్ మొత్తానికి ఇదే ఏకైక క్యాంటీన్ కావడం.. ఇతర హోటళ్లు, టీస్టాళ్లు రిమ్స్ ఆవరణకు ఆవల దూరంగా ఉండటం వల్ల రిమ్స్‌లో ఏర్పాటు చేస్తున్న క్యాంటీన్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండి, ఆదాయం కూడా భారీగా వస్తుందని అంచనా వేస్తున్నారు. అదే అంచనాతో టెండర్లు పిలిస్తే.. కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు చాలామంది ఎదురుచూస్తున్నారు. క్యాంటీన్‌కు ఉన్న డిమాండ్‌ను బట్టి డిపాజిట్ కనీసం రూ.2 లక్షలైనా వసూలు చేయాల్సి ఉంటుందని, నెలవారీ అద్దె కనీసం రూ. 10వేల నుంచి 15వేల వరకు నిర్ణయించాల్సి ఉంటుందని వీరు పేర్కొంటున్నారు. కానీ దీనికి భిన్నంగా అతి తక్కువ డిపాజిట్, నెలసరి అద్దెకే క్యాంటీన్‌ను ధారాదత్తం చేసేయడానికి అధికారులు సిద్ధపడటం వెనుక లాలూచీ ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్ ద్వారా క్యాంటీన్ కాంట్రాక్ట్ ఖరారు చేస్తే ఇంతకంటే చాలా ఎక్కువ ఆదాయం వస్తుందని అంటున్నారు. జిల్లా ఉన్నతాధికారి సిఫారసు? క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్టును పలానా వ్యక్తికి ఇవ్వాలని జిల్లా ఉన్నతాధికారి ఒక సిఫారసు చేశారని రిమ్స్ ఉన్నతాధికారి ఒక చెప్పారు. కనీసం టెండర్లయినా పిలవాలి కదా? అని ప్రశ్నిస్తే.. ఆ పిలుస్తాం లెండి అని మాట దాట వేశారు. దీన్ని బట్టి క్యాంటీన్ కాంట్రాక్టు ఖరారులో ఉన్నతాధికారుల ప్రమేయం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. అం దరికీ న్యాయం చేయాల్సిన జిల్లా ఉన్నతాధికారే అడ్డదారిలో వేరొకరికి క్యాంటిన్‌ను ధారాదత్తం చేస్తే ఎలా అని క్యాంటీన్ నిర్వహణను చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్న పలువురు వ్యాఖ్యానించారు. ఒకవేళ రిమ్స్ అధికారులే ఈ అడ్డగోలు వ్యవహారానికి పాల్పడి ఉంటే జిల్లా ఉన్నతాధికారి కల్పించుకొని టెండర్లు పిలిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.