అడ్డగోలు వడ్డింపు | Rims canteen Contract Tender illegal | Sakshi
Sakshi News home page

అడ్డగోలు వడ్డింపు

Published Mon, Jun 9 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 8:30 AM

అడ్డగోలు వడ్డింపు

అడ్డగోలు వడ్డింపు

 రిమ్స్ క్యాంపస్, న్యూస్‌లైన్: అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో.. అన్న రీతిలో ఉన్నతాధికారులు వ్యవహరించారు. ఎంతో డిమాండ్.. మరెంతో ఆదాయం సమకూర్చే రిమ్స్ క్యాంటీన్‌ను అడ్డగోలుగా తమ వారికి కట్టబెట్టారు. క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్ట్‌ను టెండర్ ద్వారా దక్కించుకోవాలని కొంతకాలంగా ఎదురుచూస్తున్న పలువురిని అసలు టెండర్ ప్రక్రియే లేకుండా చేసి తీవ్ర నిరాశకు గురి చేశారు. ఈ పని రిమ్స్ అధికారులే చేశారా అంటే.. అబ్బే తాము కాదు.. జిల్లా ఉన్నతాధికారే సిఫారసు చేశారని చెప్పుకొస్తున్నారు.
 
 నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా సాగిన ఈ అడ్డగోలు భాగోతాన్ని ఒకసారి పరిశీలిస్తే.. జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్ ఆస్పత్రిలో ఇప్పటికి వరకు రోగులు, వారితో వచ్చే వారికి క్యాంటీన్ లే దు. రిమ్స్‌గా మారకముందు.. జిల్లా కేంద్ర ఆస్పత్రిగా ఉన్నప్పుడు 2005 వరకు ఇక్కడ క్యాంటీన్ ఉండేది. ఆస్పత్రి స్థాయి పెరిగి రిమ్స్‌గా మారినా.. ఇప్పటివరకు క్యాంటీన్ మాత్రం ఏర్పాటు చేయలేదు. ఫలితంగా రోజూ రిమ్స్‌కు వచ్చే రోగులు, వారి బంధువులు ప్రతి దానికీ బయటకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రెండేళ్ల కిందట క్యాంటీన్ ఏర్పాటు చేయాలని రిమ్స్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. అయితే చాలా కాలం ఆ నిర్ణయం అలాగే ఉండిపోయింది.
 
 ఏమైందోగానీ.. ఇటీవల అధికారులు హడావుడిగా క్యాంటీన్ నిర్మాణ పనులు చేపట్టారు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఆ నిర్మాణం పూర్తి కావచ్చింది. క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్ట్ ఖరారు చేయాల్సిన సమయం వచ్చింది. ఇక్కడి నుంచే అసలు తతంగం మొదలైంది. నిబంధనల ప్రకారం క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్ట్ ఖరారు చేయడానికి టెండర్లు పిలవాల్సి ఉంది. కానీ ఎటువంటి టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయకుండానే నోటిమాటతో ఓ వ్యక్తికి కాంట్రాక్టును కట్టబెట్టేందుకు రిమ్స్ అధికారులు సిద్ధమయ్యారు.
 
 రిమ్స్‌కు కాస్త దూరంలో కొద్ది నెలల క్రితం వరకు ఓ హోటల్ నడిపిన వ్యక్తికి దీన్ని అప్పగించే తతంగాన్ని దాదాపు పూర్తి చేసేశారు. అది కూడా చాలా తక్కువ ధరకే ఖరారు చేసినట్లు విశ్వనీయవర్గాల ద్వారా తెలిసింది. ఓ మహిళా సంఘం పేరుతో సదరు వ్యక్తికి క్యాంటీన్ కాంట్రాక్ట్ కట్టబెట్టేస్తున్నారు. ఇందుకోసం కేవలం రూ.50వేల డిపాజిట్, నెలకు రూ.5వేల అద్దెగా నిర్ణయించినట్టు రిమ్స్ వర్గాల ద్వారానే తెలిసింది. టెండర్లు పిలవకుండా అడ్డదారిలో ఏ విధంగా క్యాంటీన్‌ను కేటాయిస్తారంటూ టెండర్ వేసేందుకు గత రెండేళ్లుగా ఆసక్తితో ఎదురుచూస్తున్నవారు ఆందోళనతో ప్రశ్నిస్తున్నారు.
 
 రిమ్స్ ఆదాయానికి గండి
 ఈ అడ్డగోలు దందా కారణంగా రిమ్స్ ఆదాయానికీ భారీగానే పడుతుందని అంటున్నారు. జిల్లాకే పెద్ద దిక్కయిన రిమ్స్ నిత్యం వందలాది రోగులు, వారి బంధువులు వస్తుంటారు. పెద్ద సంఖ్యలో ఇన్ పేషెంట్లు ఉంటారు. వారితోపాటు సహాయకులు ఉంటారు. రిమ్స్ మొత్తానికి ఇదే ఏకైక క్యాంటీన్ కావడం.. ఇతర హోటళ్లు, టీస్టాళ్లు రిమ్స్ ఆవరణకు ఆవల దూరంగా ఉండటం వల్ల రిమ్స్‌లో ఏర్పాటు చేస్తున్న క్యాంటీన్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండి, ఆదాయం కూడా భారీగా వస్తుందని అంచనా వేస్తున్నారు. అదే అంచనాతో టెండర్లు పిలిస్తే.. కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు చాలామంది ఎదురుచూస్తున్నారు. క్యాంటీన్‌కు ఉన్న డిమాండ్‌ను బట్టి డిపాజిట్ కనీసం రూ.2 లక్షలైనా వసూలు చేయాల్సి ఉంటుందని, నెలవారీ అద్దె కనీసం రూ. 10వేల నుంచి 15వేల వరకు నిర్ణయించాల్సి ఉంటుందని వీరు పేర్కొంటున్నారు. కానీ దీనికి భిన్నంగా అతి తక్కువ డిపాజిట్, నెలసరి అద్దెకే క్యాంటీన్‌ను ధారాదత్తం చేసేయడానికి అధికారులు సిద్ధపడటం వెనుక లాలూచీ ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్ ద్వారా క్యాంటీన్ కాంట్రాక్ట్ ఖరారు చేస్తే ఇంతకంటే చాలా ఎక్కువ ఆదాయం వస్తుందని అంటున్నారు.
 
 జిల్లా ఉన్నతాధికారి సిఫారసు?
 క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్టును పలానా వ్యక్తికి ఇవ్వాలని జిల్లా ఉన్నతాధికారి ఒక సిఫారసు చేశారని రిమ్స్ ఉన్నతాధికారి ఒక చెప్పారు. కనీసం టెండర్లయినా పిలవాలి కదా? అని ప్రశ్నిస్తే.. ఆ పిలుస్తాం లెండి అని మాట దాట వేశారు. దీన్ని బట్టి క్యాంటీన్ కాంట్రాక్టు ఖరారులో ఉన్నతాధికారుల ప్రమేయం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. అం దరికీ న్యాయం చేయాల్సిన జిల్లా ఉన్నతాధికారే అడ్డదారిలో వేరొకరికి క్యాంటిన్‌ను ధారాదత్తం చేస్తే ఎలా అని క్యాంటీన్ నిర్వహణను చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్న పలువురు వ్యాఖ్యానించారు. ఒకవేళ రిమ్స్ అధికారులే ఈ అడ్డగోలు వ్యవహారానికి పాల్పడి ఉంటే జిల్లా ఉన్నతాధికారి కల్పించుకొని టెండర్లు పిలిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement