సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి ఏపీ ఎన్జీవో సంఘం పిలుపునిచ్చింది. సోమవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు ప్రకటించింది.
సాక్షి, తిరుపతి : సమైక్యాంధ్ర ఉద్యమం రోజు రోజు కూ ఉధృతమవుతోంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, టీటీడీ, కార్మిక సంఘాల జేఏసీ సోమ వారం ఉదయం ఇందిరామైదానంలో ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ సమైక్య గళార్చన, సమైక్యాంధ్ర ప్రతిజ్ఞతో సమ్మెకు సైరన్ మోగించనుంది. ఈ కార్యక్రమంలో జేఏసీ కుటుంబ సభ్యులంతా పాల్గొని సమైక్య గళం వినిపించనున్నారు. నిరవధిక సమ్మె విషయంపై మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.లోకేశ్వర వర్మ పిలుపునిచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనాలని కోరారు. నేడు అన్ని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలకు సమ్మె నోటీసులు పంపనున్నట్లు తెలియజేశారు. అయితే పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిలైట్ల నిర్వహణ సిబ్బందిని సమ్మె నుంచి మినహాయించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మిక, న్యాయవాద సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడే నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. అయితే దీనిపై నేడు అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాలు తెలియజేశాయి.
తిరుమలకు బస్సులు నడిపే విషయంపై ఇంకా నిర్ణయానికి రాలేదని తెలిసింది. సోమవారం ఉదయం మరోసారి టీటీడీ అధికారులు ఆర్టీసీ కార్మిక సంఘాలతో సమావేశం కానున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మధ్యాహ్నం నుంచి ఉపాధ్యాయులు విధుల్లో పాల్గొంటున్నట్లు ఆ సంఘం వారు ప్రకటించారు. ఉదయం నుంచి సమైక్య ఉద్యమంలో విస్తృతంగా పాల్గొంటున్నట్లు తెలిపారు. ఏపీ ఎన్జీవో సంఘం పిలుపు మేరకు మంగళవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు మూతపడనున్నాయి. ప్రైవేటు పాఠశాలలు మాత్ర మే మధ్యాహ్నం పూట నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
నిరవధిక సమ్మెకు సైరన్
Published Mon, Aug 12 2013 2:18 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM
Advertisement
Advertisement