సాక్షి, మచిలీపట్నం : సమైక్యాంధ్ర ఉద్యమానికి మరింత ఊపు తెచ్చేందుకు గురువులు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రైవేటు కాన్వెంట్లు, కాలేజీలు సమైక్యాంధ్రకు మద్దతుగా సెలవులు ప్రకటించాయి. జిల్లాలోని అన్ని పట్టణాలు, మండల కేంద్రాల్లో ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులు కొద్దిరోజులుగా వరుసగా ర్యాలీలు, మానవహారాలు తదితర నిరసన కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. తాజాగా రాష్ట్ర వ్యాపితంగా పలు ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన పిలుపుతో జిల్లాలోని ప్రభుత్వ బడులు గురువారం నుంచి మూతపడనున్నాయి.
పీఆర్‌టీయూ, వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్, తెలుగునాడు టీచర్స్ ఫెడరేషన్, బహుజన టీచర్స్ అసోసియేషన్ తదితర సంఘాలు సమైక్యాంధ్ర ఉద్యమాలకు మద్దతుగా ఈ నెల 22 నుంచి సమ్మెకు పిలుపునిచ్చాయి. జిల్లా అంతటా గురువారం నుంచే పాఠశాలలు మూసివేయాలని పిలుపునివ్వగా, జిల్లా కేంద్రమైన బందరు మున్సిపాలిటీలో ఈ నెల 24 నుంచి పాఠశాలల బంద్ పాటించాలని ఉపాధ్యాయ జేఏసీ నిర్ణయించింది. బందరులో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు సమ్మెకు అనుకూలంగా రాకపోవడంతో పాఠశాలల బంద్‌ను రెండు రోజులు ఆలస్యంగా మొదలు పెట్టనున్నట్టు ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు.
విభేదిస్తున్న పలు సంఘాలు..
జిల్లాలో 3,340 పాఠశాలలు ఉండగా వాటిలో 16 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వాటిలో 440 ఉన్నత, 600 ప్రాథమికోన్నత, 2,300 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. సమ్మె పిలుపును కొన్ని ఉపాధ్యాయ సంఘాలు విభేదిస్తున్నాయి. దీంతో కొన్ని పాఠశాలలు మూతపడితే మరికొన్ని తెరుచుకునే అవకాశముందని ఉపాధ్యాయ సంఘ నేతలు చెబుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి ఊతమిచ్చేలా ఉపాధ్యాయులు సహకరించాలని సీమాంధ్ర (13 జిల్లాల) ఉపాధ్యాయ సంఘాల జేఏసీ కన్వీనర్ మత్తి కమలాకర్ కోరారు. విభేదించిన సంఘాలతోను ఏకాభిప్రాయం సాధించేదిశగా చర్చిస్తున్నట్టు ఆయన ‘సాక్షి’కి వివరించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీల నేతృత్వంలో మిగిలిన సంఘాలతో సంప్రదింపులు జరిపి ఒకటి రెండు రోజుల్లో సమ్మె బాట పట్టేలా చొరవతీసుకుంటామని తెలిపారు. సమ్మెలో తాము పాలుపంచుకుంటున్నట్టు వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రియాజ్ హుస్సేన్ చెప్పారు.
సమ్మెకు దూరం.. సంఘీభావం తెలుపుతాం
ఉపాధ్యాయ సమ్మెకు తాము వెళ్లడంలేదని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కేఏ ఉమామహేశ్వరరావు చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రాంతాలవారీ ఉద్యమాలకు దూరంగా ఉండాలన్న తమ సంఘ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గతంలో తెలంగాణ, ఇప్పుడు సీమాంధ్ర ఉద్యమాలకు దూరంగా ఉంటున్నట్టు ఆయన వివరించారు. మిగిలిన సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చినా ఐక్య ఉపాధ్యాయ సంఘం (యూటీఎఫ్)లో ఉండే ఉపాధ్యాయులు విధిగా పాఠశాలలకు వెళతారని స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర కోసం ఉపాధ్యాయులు చేస్తున్న సమ్మెకు తమ సంఘం దూరంగా ఉండాలన్ని నిర్ణయం తీసుకుందని, అయినా తమ వంతుగా సమ్మెకు సంఘీభావం తెలుపుతామని ఉమామహేశ్వరరావు చెప్పారు.
పరిశీలిస్తాం : డీఈవో
జిల్లాలో ఉపాధ్యాయ సమ్మె ప్రభావం, ముందస్తు చర్యల గురించి ఇప్పుడే చెప్పలేమని, సమ్మె మొదలైన తరువాత అందుకు సంబంధించిన చర్యలపై పరిశీలిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) డి.దేవానందరెడ్డి చెప్పారు. ఆయన సాక్షితో మాట్లాడుతూ జిల్లాలో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు సమ్మెకు వెళుతున్నట్టు తమకు సమాచారం వచ్చిందన్నారు. సమ్మె మొదలయ్యాక ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. వారి సూచనలకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపడతామని వివరించారు.
గురోద్యమం...
Published Thu, Aug 22 2013 1:09 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM
Advertisement