విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమం తారస్థాయికి చేరుతోంది. నిన్న మొన్నటి వరకు ఉద్యోగులు, సిబ్బంది సమ్మె చేస్తుండగా తాజాగా ఉన్నతాధికారులు సైతం ఆందోళన బాట పట్టారు. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు కూడా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మినహా మిగిలిన అన్ని శాఖల ఉన్నతాధికారులు సైతం ఉద్యమ బాట పట్టనున్నారు. ఇప్పటికే జిల్లాలో పాలన పూర్తిగా స్తంభించిపోయింది. ఉన్నతాధికారులు కూడా ఉద్యమిస్తుండడంతో అత్యవసర పనులు కూడా నిలిచిపోనున్నాయి.
డిప్యూటీ కలెక్టర్లు సైతం సమైక్యాంధ్ర కోసం కార్యాచరణ రూపొందించే పనిలో ఉన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా ఉన్నతాధికారులంతా ఏపీఎన్‌జీఓలు చేస్తున్న సమ్మెకు మద్దతు ప్రకటించారు. డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈఓ డి.వెంకటరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ మహేశ్వరరెడ్డి, డీఎస్‌ఓ జ్వాలాప్రకాష్, స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ షరీఫ్, డీపీఆర్‌ఓ బాబ్జీ, ఇతర ఉన్నతాధికారులు సమైక్యాంధ్రకు మద్దతుగా కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరో వైపు మంగళవారం నుంచి నగర పరిధిలోని ప్రయివేట్ ట్రావెల్స్ యాజమాన్యం కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.
రహదారుల దిగ్బంధం : మంగళవారం రహదారుల దిగ్బంధం చేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఉదయం 7 గంటలకు పాలిటెక్నిక్ కళాశాల వద్దకు వందల మంది ఉద్యోగులు చేరుకొని కౌన్సెలింగ్‌ను అడ్డుకున్న తరువాత హైవేను దిగ్బంధించనున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జాతీయ రహదారిలో ఎటువంటి వాహనాలు వెళ్లకుండా ట్రాఫిక్‌ను పూర్తిగా స్తంభింపచేయాలని భావిస్తున్నాయి.
21 బహిరంగ సభ : ఈ నెల 21 ఉదయం 11 గంటలకు స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో భారీ సభను నిర్వహించడానికి ఏపీఎన్‌జీఓలు సన్నాహాలు చేస్తున్నారు. సుమారు 7 వేల మంది ఉద్యోగులతో జరిగే ఈ సభకు ఏపీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు, ఇతర ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం 4 గంటలకు నర్సీపట్నంలో కూడా బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పోరాట ప్రభంజనం
Published Tue, Aug 20 2013 2:08 AM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM
Advertisement