అంతటా రిలే నిరాహార దీక్షలు
అనకాపల్లి, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమం శనివారం తీవ్ర రూపం దాల్చింది. పట్టణం, పల్లె తేడా లేకుండా హోరెత్తిపోయింది. పాతిక రోజులవుతున్నా ఉద్యమకారుల దీక్ష సడలడం లేదు. మరో వైపు గుంటూరులోని వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ దీక్షను పోలీసులు భగ్నం చేసినందుకు నిరసనగా జిల్లాలో ఆ పార్టీ శ్రేణులు పలు చోట్ల బంద్ నిర్వహించాయి. పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి ఆమరణ దీక్షకు దిగుతున్న నేపథ్యంలో పార్టీ నాయకులూ దీక్షలకు సిద్ధమవుతున్నారు.
ఉద్యోగులు, విద్యార్థుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పెదబయలు మండల కేంద్రంలో కళాశాల, పాఠశాలల విద్యార్థులు మూడు కిలోమీటర్ల భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ మూడు రోడ్ల కూడలిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు థింసా నృత్యం చేశారు. ఉపాధ్యాయ జేఏసీ నర్సీపట్నంలో నిర్వహించిన నమూనా అసెంబ్లీ ఆద్యంతం నవ్వుల్లో ముంచెత్తింది. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ పెట్ల ఉమాశంకర గణేష్ తదితర నేతల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు ఇందులో పాల్గొన్నారు. ఎన్నడూ లేని రీతిలో అనకాపల్లి పట్టణాన్ని ఆందోళనకారులు దిగ్బంధించారు.
పట్టణంలోకి ప్రవేశించే అన్ని రహదారుల్లోనూ రాళ్లు, వాహానాలను అడ్డంగా పెట్టి రాకపోకలను అడ్డుకున్నారు. వ్యాపారులు స్వచ్ఛందంగానే షాపులు మూసేశారు. పట్టణమంతా బోసిపోయింది. అత్యవసర సేవలయిన మందుల దుకాణాలు, ఆస్పత్రులకు మాత్రం వెసులుబాటు కల్పించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా సాగిన ఆందోళనకు స్టూడెంట్ జేఏసీ, ఎన్‌జీవోలు నేతృత్వం వహించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసనలు మిన్నంటాయి. వైఎస్సార్‌సీపీ నేతలు బంద్ నిర్వహించారు. ఉపాధ్యాయ, న్యాయవాదుల సంఘాలతో పాటు వైఎస్సార్‌సీపీ నేతల దీక్షలు కొనసాగుతున్నాయి.
పాడేరు పాత బస్టాండ్‌లో ఎన్‌జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఏడో రోజుకు చేరుకున్నాయి. గిరిజన సంక్షేమశాఖ డీడీ మల్లికార్జునరెడ్డి వారికి మద్దతు తెలిపారు. విజయమ్మ దీక్ష భగ్నానికి నిరసనగా పాడేరులో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు వంజంగి కాంతమ్మ, సత్యవేణి ఆధ్వర్యంలో రాస్తారోకో జరిపారు. లగిశపల్లి నుంచి పాడేరు వరకు టీడీపీ కార్యకర్తలు పాదయాత్ర చేసి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఏయూలో విద్యార్థి ఐక్య ఫ్రంట్ ఆధ్వర్యంలో విద్యార్థులు యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద కేంద్రమంత్రి చిరంజీవి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
పౌరసరఫరాల శాఖ సిబ్బంది బీచ్‌రోడ్డులోని అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాయకరావుపేటలో విద్యుత్ జేఏసీ రాస్తారోకో నిర్వహించారు. నక్కపల్లిలో మోకాళ్ల ప్రదర్శన ద్వారా ఉద్యమ కారులు తమ నిరసన వ్యక్తం చేశారు. చోడవరంలో మానవహారాలు, నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. చోడవరం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బలిరెడ్డి సత్యారావు ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. కశింకోట జాతీయ రహదారిపై నిరసన జ్వాలలు మిన్నంటాయి.