వార్షిక సందడి సరే..నిధుల మాటేమిటి?
వార్షిక సందడి సరే..నిధుల మాటేమిటి?
Published Fri, Feb 24 2017 10:27 PM | Last Updated on Tue, Jun 4 2019 6:19 PM
వార్షికోత్సవాలు నిర్వహించాలని ఆదేశాలు
నిధులు ఇవ్వని సర్వశిక్షాఅభియాన్
రాయవరం (మండపేట) : ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని ప్రజాప్రతినిధులు, అధికారులు సూచిస్తున్నారు. అందులో భాగంగానే ప్రైవేటు పాఠశాలల మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలల్లో వార్షికోత్సవాలను నిర్వహించాలని ఆదేశాలు ఇస్తున్నారు. వార్షికోత్సవాలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఉండే నైపుణ్యాలను వెలికి తీయడంతో పాటు పాఠశాలలకు విద్యార్థులను ఆకర్షించడం దీని ఉద్దేశం. అయితే వార్షికోత్సవాలకు తగినన్ని నిధులు మంజూరు చేయకుండా ఎలా నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
ప్రారంభమైన సందడి
ప్రస్తుత విద్యా సంవత్సరం మార్చి 20తో ముగుస్తున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో వార్షికోత్సవాలను ఫిబ్రవరిలోనే ముగించాలని అధికారులు సూచిస్తున్నారు. అందుకనుగుణంగా వార్షికోత్సవాలను నిర్వహించేందుకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రజాప్రతినిధులను, పూర్వ విద్యార్థులను ఆహ్వానించాలి. విద్యార్థుల తల్లిదండ్రులను, మండల స్థాయి అధికారులను, ప్రైవేటు స్కూళ్లకి వెళ్లి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించాలి. విద్యార్థులకు వక్తృత్వం, వ్యాసరచన, క్విజ్, చిత్రలేఖనం వంటి పోటీలతో పాటు ఆటల పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేయాలి. వార్షికోత్సవంలో పాఠశాల ప్రగతిని ఉపాధ్యాయులు వివరిస్తే, విద్యార్థుల అనుభవాలు వివరించాల్సి ఉంటుంది. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆహుతుల సమక్షంలో ప్రదర్శించాలి. అలాగే ఆయా పాఠశాలల్లో చదివి ఉన్నత ఉద్యోగాలు, పదవుల్లో, మంచి స్థితిలో ఉన్న వారిని, దాతలను ఆహ్వానించి సత్కరించాలి.
నిర్వహణ ఎలా..
ఎంత తక్కువలో నిర్వహించాలన్నా వార్షికోత్సవానికి రూ.వేలల్లోనే ఖర్చవుతుందన్నది బహిరంగ రహస్యం. పాఠశాల వార్షికోత్సవాలకు సర్వశిక్షాఅభియాన్ గతేడాది 50లోపు విద్యార్థులున్న పాఠశాలకు రూ.500, 50-100లోపు విద్యార్థులున్న పాఠశాలలకు రూ.800 వంతున విడుదల చేసింది. ఈ ఏడాది కూడా వార్షికోత్సవాలకు నిధులు మంజూరు చేస్తారని భావించినా ఇప్పటి వరకు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం ఉన్న ఖర్చుల దృష్ట్యా పాఠశాలకు రూ.2 వేల వంతున విడుదల చేస్తే వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. జిల్లాలో 3,300 ప్రాథమిక, 414 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో వార్షికోత్సవాల సందడి నెలకొంది.
చర్యలు తీసుకుంటాం..
పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికి తీయాలి. పాఠశాలల వార్షికోత్సవాలకు నిధులు మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. - మేకా శేషగిరి, పీవో, సర్వశిక్షాఅభియాన్, కాకినాడ
Advertisement