సీసీఈ విధానాన్ని మార్చాలి
జిల్లా ఏపీపీఎస్‌ఏ సర్వసభ్య సమావేశం తీర్మానం
తాళ్లరేవు : నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) వి«ధానాన్ని ప్రభుత్వం మార్చాలని జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (ఏపీపీఎస్‌ఏ) డిమాండ్ చేసింది. సూరంపాలెంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లా అధ్యక్షుడు తమ్మయ్యనాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశం వివరాలను జిల్లా జనరల్ సెక్రటరీ, తాళ్లరేవు మార్గదర్శి హైస్కూల్ కరస్పాడెంట్ పెమ్మాడి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీపీఎస్‌ఏ రాష్ట్ర అ«ధ్యక్షుడు కేఎస్‌ఎన్ మూర్తి మాట్లాడుతూ సీసీఈ విధానాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. ఆరు నుంచి 9వ తరగతి పరీక్షలను ఏప్రిల్‌లోనే నిర్వహించాలని కోరారు. స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ల జారీలో పారదర్శకత పాటించాలని తదితర సమస్యలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ఆదిత్యా విద్యా సంస్థల అధినేత నల్లిమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ ఏపీపీఎస్‌ఏ బలోపేతానికి పాఠశాలల యాజమాన్యాలు కృషి చేయాలని కోరారు. తమ్మయ్యనాయుడు మాట్లాడుతూ సమస్యలు తెలిపితే జిల్లా కమిటీ తరఫున పోరాడతామన్నారు. పెమ్మాడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యూటీఎఫ్ తరహాలో ఏపీపీఎస్‌ఏ సంఘానికి నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రగౌరవ అధ్యక్షురాలు వసంతాప్రసాద్, రాష్ట్ర కన్వీనర్ చౌదరి, ప్రధాన కార్యదర్శి మురళీమనోహర్, రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజు, ఆదిత్య విద్యా సంస్థల కరస్పాండెంట్ మధులత తదితరులు పాల్గొన్నారు.