Bandu
-
26న బెంగళూరు బంద్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలను ఖండిస్తూ, వారికి సరైన రక్షణ కల్పించాలన్న డిమాండ్‌తో సుమారు యాభైకి పైగా కన్నడ సంఘాలు ఈ నెల 26న బెంగళూరు బంద్‌కు పిలుపునిచ్చాయి. పాఠశాలలు, కళాశాలలకు చెందిన ప్రతి ఒక్కరూ, మహిళా సంఘాలు, ఐటీ, బీటీ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులు, హోటళ్ల యజమానులు, చలన చిత్ర పరిశ్రమ సహా అందరూ బంద్‌లో పాల్గొనాలని కన్నడ చళవళి అధ్యక్షుడు వాటాళ్ నాగరాజ్ కోరారు. కన్నడ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బంద్ సందర్భంగా టౌన్ హాలు నుంచి మైసూరు బ్యాంకు సర్కిల్ వరకు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనంతరం ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని సమర్పించనున్నట్లు చెప్పారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు శాంతియుతంగా సాగే బంద్ నుంచి ఆస్పత్రులు, మందుల దుకాణాలు, పాలు, పత్రికల పంపిణీని మినహాయిస్తామని వివరించారు. లైంగిక దాడులకు పాల్పడుతున్న వికృత మనస్తత్వం కలిగిన నిందితులకు సంఘటన జరిగిన నెలలోగా శిక్ష పడేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కోర్టులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలలకు వెళ్లే పిల్లలు, ఉద్యోగులు, గృహిణులకు కట్టుదిట్టమైన రక్షణ కల్పించాలని కోరారు. డాక్టర్ రాజ్ కుమార్ అభిమానుల సంఘం అధ్యక్షుడు సా.రా. గోవిందు, కన్నడ సేన అధ్యక్షుడు కేఆర్. కుమార్, కర్ణాటక దళిత సంఘర్ష సమితికి చెందిన ఎన్. మూర్తి, కర్ణాటక రక్షణా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శివరామే గౌడ ప్రభృతులు బంద్‌కు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. -
విభజన నిర్ణయంపై నిరసనాగ్రహం
బంద్ సంపూర్ణం = పలుచోట్ల దిష్టిబొమ్మల దహనం =జాతీయరహదారుల దిగ్బంధం = స్వచ్ఛందంగా ప్రజల మద్దతు =వ్యాపార సంస్థల మూసివేత తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడం జిల్లా ప్రజలను ఆగ్రహావేశాలకు గురిచేసింది. కేబినెట్ నిర్ణయానికి నిరసనగా రాజకీయ పార్టీలు, ఏపీ ఎన్జీవోలు శుక్రవారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. సోనియా, దిగ్విజయ్‌ల దిష్టిబొమ్మలను పలుచోట్ల దహనం చేశారు. వైఎస్సార్సీపీ, టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో కార్యక్రమాలు జరిగాయి. సాక్షి, విజయవాడ : రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం చేపట్టిన బంద్ సంపూర్ణంగా జరిగింది. మచిలీపట్నంలో జిల్లా కలెక్టరేట్, హెడ్ పోస్టాఫీస్, ఎల్ఐసీ ప్రధాన కార్యాలయాలు మూతపడ్డాయి. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, పెట్రోల్ బంకులు, బ్యాంకులు స్వచ్ఛందంగా మూసేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బంద్ పిలుపునకు జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన లభించింది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎన్జీవోలు కూడా బంద్‌లో పాల్గొన్నారు. టీడీపీ ఆధ్వర్యంలోనూ జిల్లాలో ఆందోళనలు నిర్వహించి, బంద్ చేపట్టారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈస్ట్ కృష్ణా జేఏసీ చైర్మన్ ఉల్లి కృష్ణ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని సిబ్బందిని బంద్‌కు సహకరించాలని కోరారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని సీపీవో, సంక్షేమశాఖల కార్యాలయాలు, ఖజానా శాఖ, పంచాయతీ, ఆర్డీవో కార్యాలయాలు, ఇతర జిల్లాశాఖల సిబ్బందిని బయటకు పంపి కార్యాలయాలు మూసివేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా స్తంభించాయి. పలుచోట్ల న్యాయవాదులు కోర్టులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. విజయవాడలో సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించి బంద్ చేయించారు. జాతీయ రహదారులపై రాస్తారోకోలు... బంద్‌లో భాగంగా జిల్లావ్యాప్తంగా జాతీయరహదారులపై రాస్తారోకోలు నిర్వహించారు. జగ్గయ్యపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను బంద్‌కు నేతృత్వం వహించారు. జాతీయ రహదారిని దిగ్బంధనం చేశారు. మైలవరంలో నియోజకవర్గ సమన్వయకర్తలు జ్యేష్ఠ రమేష్‌బాబు, జోగి రమేష్‌లు బంద్ కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జ్యేష్ఠ రమేష్‌బాబు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక బోసుబొమ్మ సెంటర్లో ధర్నా చేపట్టారు. జోగి రమేష్ తన అనుచ రులతో బంద్‌లో పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం రింగ్సెంటర్లో జోగి ఆధ్వర్యంలో సుమారు గంటసేపు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలియజేశారు. దీంతో జాతీయ రహదారికిరువైపులా భారీ స్థాయిలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నందిగామలో పార్టీ సమన్వయకర్త మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై పార్టీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. హనుమాన్‌జంక్షన్‌లో వైఎస్సార్సీపీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు ఆధ్వర్యంలో జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు. చల్లపల్లిలో వైఎస్సార్సీపీ, టీడీపీ, ఎన్జీవో సంఘ నాయకులు విజయవాడ, మచిలీపట్నం, అవనిగడ్డ రహదారులను దిగ్బంధించారు. డిపోలకే పరిమితమైన బస్సులు... మచిలీపట్నంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య (నాని) శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి బందరు బస్టాండ్‌కు చేరుకుని బస్సుల రాకపోకలను నిలువరించారు. దీంతో బస్సులు డిపోకే పరిమితమవగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు రాలేదు. బంద్‌లో భాగంగా నాయకులు, కార్యకర్తలు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. దివిసీమలో అవనిగడ్డ నియోజకవర్గ కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు, జిల్లా స్టీరింగ్‌కమిటీ సభ్యులు గుడివాక శివరావ్, యాసం చిట్టిబాబు బంద్‌ను పర్యవేక్షించారు. గుడివాడలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో రాస్తారోకో, ప్రదర్శనలు నిర్వహించారు. కైకలూరులో పార్టీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ, రాస్తారోకో చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, మాజీ మంత్రి మాగంటి బాబు ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మను తాలూకా సెంటర్ వద్ద దహనం చేసి, రోడ్డుపై భోజనాలు చేశారు. ఎన్జీవోలు ర్యాలీ చేపట్టి దుకాణాలు మూయించారు. పెడనలో నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాదు ఆధ్వర్యంలో పెడన, గూడూరు మండలాలు, మున్సిపాల్టీకి చెందిన నాయకులతో ర్యాలీ నిర్వహించి, బంటుమిల్లి చౌరస్తాలో మానవహారం చేశారు. పెనమలూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతలు సమన్వయకర్తలు పడమట సురేష్‌బాబు, తాతినేని పద్మావతి ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. తిరువూరు పట్టణంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బంద్ పూర్తిగా జరిగింది. నూజివీడులో పార్టీ పట్టణ కన్వీనర్ బసవా భాస్కరరావు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. విజయవాడలో రాధా అరెస్ట్ విజయవాడలో పార్టీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్, సమన్వయకర్తలు వంగవీటి రాధాకృష్ణ, పి.గౌతంరెడ్డి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. బెంజిసర్కిల్ వద్ద పోలీసులు రాధాకృష్ణను, మరికొంతమంది కార్యకర్తలను అరెస్టు చేశారు. దీనికి నిరసనగా కార్యకర్తలు గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్ వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించారు. రాధాకృష్ణను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
భగ్గుమన్న సీమాంధ్ర
తెలంగాణ నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై గురువారం సీమాంధ్రలో ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. సమైక్యాంధ్రులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 72 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. -
బంద్ సక్సెస్
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపుమేరకు జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. అత్యధిక విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించాయి. ఎన్జీవో జేఏసీ నేతలు ఉదయం నుంచే ర్యాలీగా తిరిగి పలుచోట్ల తెరిచిన ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలను మూయించివేశారు. కొన్నిచోట్ల ఆందోళనకారులు కొన్ని కళాశాలల బస్సులకు గాలి తీసివేశారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సీతారామపురంలోని పార్టీ కార్యాలయం నుంచి చుట్టుగుంట సెంటర్ వరకు పాదయాత్ర, చుట్టుగుంట సెంటర్లో రాస్తారోకో జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, సామినేని ఉదయభాను, ఎంవీఎస్ నాగిరెడ్డి, జలీల్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమం సోమవారం నాటికి 55వ రోజుకు చేరింది. ఇరిగేషన్ ఇంజనీర్లు సోమవారం ఉదయం మచిలీపట్నంలో కలెక్టర్‌ను కలిసి సమ్మె నోటీసు అందచేశారు. చల్లపల్లిలో దీక్షలు 45, అవనిగడ్డలో 33వ రోజుకు చేరుకున్నాయి. ఘంటసాల, మోపిదేవి, కోడూరు, నాగాయలంక మండలాల్లో దీక్షలు కొనసాగాయి. చల్లపల్లి మండలం మాజేరులో రైతులు రాస్తారోకో చేశారు. చల్లపల్లిలో మేకావారిపాలేనికి చెందిన రైతులు దీక్ష చేపట్టారు. అవనిగడ్డలో పవనిజం యూత్ ఆధ్వర్యంలో దీక్ష చేశారు. జగ్గయ్యపేట మున్సిపల్ కూడలి సమీపంలో దీక్ష శిబిరంలో కాకతీయ సేవా సమితి సభ్యులు కూర్చున్నారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, సీనియర్ రాజకీయ నాయకులు సామినేని విశ్వనాథం, కాంగ్రెస్ నాయకులు పాటిబండ్ల వెంకట్రావ్‌లు సంఘీభావం తెలిపారు. రోడ్డుపై వ్యాయామ ఉపాధ్యాయులు ఆటలు ఆడి నిరసన వ్యక్తం చేశారు. గుడివాడ నెహ్రూచౌక్ వద్ద డ్వాక్రా మహిళలు రిలేదీక్షలో పాల్గొన్నారు. మునిసిపల్ సిబ్బంది, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. ఉపాధ్యాయులు తాడులాగుడు పోటీ నిర్వహించిన తమ నిరసన తెలిపారు. పామర్రులో ఏపీ ఎన్జీవోస్, జేఏసీ నాయకులు జాతీయ రహదారిపై మోకాళ్లపై నిలబడి ఆందోళన చేశారు. నూజివీడులో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 48వ రోజుకు చేరాయి. ఈ దీక్షలలో కుమార్ స్కూల్ విద్యార్థులు, చెవిటి, మూగవారు కూర్చున్నారు. మచిలీపట్నం ఎనిమిదో వార్డు ప్రజలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహానికి సమైక్యాంధ్రను కాంక్షిస్తూ ఓ చిన్నారి వినతిపత్రాన్ని అందించింది. కంభంపాడులో విద్యార్థులు మానవహారం నిర్మించారు. పెడనలో వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలు 36వ రోజుకు చేరాయి. కృత్తివెన్నులోని 216 జాతీయ రహదారిపై మహిళలు కుర్చీలాట, ఒప్పులకుప్ప ఆడారు. కేసీఆర్ చేస్తున్న లొల్లి ఉల్లిఘాటును తలపిస్తోందనిఅర్థం వచ్చేలా సమైక్యవాదులు కృత్తివెన్ను జాతీయ రహదారిపై ఉల్లి విక్రయాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. 216 జాతీయ రహదారిపై సమైక్యవాదులు వంటావార్పు నిర్వహించారు. వ్యవసాయ కార్మికుల వంటావార్పు.. తోట్లవల్లూరు మండలంలోని చాగంటిపాడు శివారు కళ్లంవారిపాలెంలో వ్యవసాయ కార్మికులు, కూలీల ఆధ్వర్యంలో కృష్ణా కరకట్టపై నిరశన శిబిరం ఏర్పాటు చేసి, వంటావార్పు జరిపారు. తోట్లవల్లూరులో జేఏసీ నాయకులు, గొర్రెల కాపరులు గొర్రెలతో నిరసన తెలిపారు. కంచికచర్ల, వీరులపాడు మండలాల జర్నలిస్టుల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ప్రదర్శన నిర్వహించారు. ఏపీఎన్జీవోలు, ఉపాధ్యాయ, ఆర్టీసీ కార్మికులు, ప్రైవేటు విద్యా సంస్థలు, విద్యార్థి జేఏసీ నాయకులు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొని సంఘీభావం తెలిపారు. నందిగామ జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రైతుపేట వద్ద రాస్తారోకో చేసి, మానవహారం ఏర్పాటు చేశారు. న్యాయవాదుల వినూత్న నిరసన.. న్యాయవాదులు నందిగామలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కొందరు న్యాయవాదులు కేసీఆర్ మాస్కులు ధరించి గాంధీ సెంటర్లో కనక తప్పెట్ల మోతలతో చిందేసి నిరసన తెలిపారు. నందిగామ, పెనుగంచిప్రోలు, చందర్లపాడు మండలాలకు చెందిన విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో. గాంధీ సెంటర్లో పలువురు వడ్రంగి వృత్తిదారులు బాడిసలు పట్టుకుని మొద్దులను చెక్కుతూ నిరసన తెలిపారు. కలిదిండి సెంటరులో ఉపాధ్యాయులు, వీఆర్వోలు రిలే దీక్ష చేశారు. మండవల్లిలో ఐఎన్టీయూసీ మండల ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం జరిగింది. కత్తిపూడి-పామర్రు 214 జాతీయ రహదారిపై వంటావార్పు నిర్వహించారు. ఎమ్మెల్యే జయమంగళకు సమైక్య సెగ.. మండవల్లిలో దీక్ష చేస్తున్నవారికి మద్దతు తెలపటానికి వచ్చిన ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణను విద్యార్థులు చుట్టుముట్టి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట, వత్సవాయి మండలాలకు చెందిన జిల్లా పరిషత్ పాఠశాలల వ్యాయామోపాధ్యాయులు రహదారిపై షటిల్, బాల్‌బ్యాడ్మింటన్, క్రికెట్, పవర్ లిఫ్టింగ్, వాలీబాల్, టెన్నీకాయిట్, కబడ్డీ వంటి ఆటలు ఆడి నిరసన తెలిపారు. జగ్గయ్యపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద మండల రెవెన్యూ ఉద్యోగ జేఏసీ నాయకులు నేలపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. పామర్రులో జాతీయ రహదారిపై మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. -
అంతటా రిలే నిరాహార దీక్షలు
అనకాపల్లి, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమం శనివారం తీవ్ర రూపం దాల్చింది. పట్టణం, పల్లె తేడా లేకుండా హోరెత్తిపోయింది. పాతిక రోజులవుతున్నా ఉద్యమకారుల దీక్ష సడలడం లేదు. మరో వైపు గుంటూరులోని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ దీక్షను పోలీసులు భగ్నం చేసినందుకు నిరసనగా జిల్లాలో ఆ పార్టీ శ్రేణులు పలు చోట్ల బంద్ నిర్వహించాయి. పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి ఆమరణ దీక్షకు దిగుతున్న నేపథ్యంలో పార్టీ నాయకులూ దీక్షలకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగులు, విద్యార్థుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పెదబయలు మండల కేంద్రంలో కళాశాల, పాఠశాలల విద్యార్థులు మూడు కిలోమీటర్ల భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ మూడు రోడ్ల కూడలిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు థింసా నృత్యం చేశారు. ఉపాధ్యాయ జేఏసీ నర్సీపట్నంలో నిర్వహించిన నమూనా అసెంబ్లీ ఆద్యంతం నవ్వుల్లో ముంచెత్తింది. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ పెట్ల ఉమాశంకర గణేష్ తదితర నేతల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు ఇందులో పాల్గొన్నారు. ఎన్నడూ లేని రీతిలో అనకాపల్లి పట్టణాన్ని ఆందోళనకారులు దిగ్బంధించారు. పట్టణంలోకి ప్రవేశించే అన్ని రహదారుల్లోనూ రాళ్లు, వాహానాలను అడ్డంగా పెట్టి రాకపోకలను అడ్డుకున్నారు. వ్యాపారులు స్వచ్ఛందంగానే షాపులు మూసేశారు. పట్టణమంతా బోసిపోయింది. అత్యవసర సేవలయిన మందుల దుకాణాలు, ఆస్పత్రులకు మాత్రం వెసులుబాటు కల్పించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా సాగిన ఆందోళనకు స్టూడెంట్ జేఏసీ, ఎన్జీవోలు నేతృత్వం వహించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసనలు మిన్నంటాయి. వైఎస్సార్సీపీ నేతలు బంద్ నిర్వహించారు. ఉపాధ్యాయ, న్యాయవాదుల సంఘాలతో పాటు వైఎస్సార్సీపీ నేతల దీక్షలు కొనసాగుతున్నాయి. పాడేరు పాత బస్టాండ్‌లో ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఏడో రోజుకు చేరుకున్నాయి. గిరిజన సంక్షేమశాఖ డీడీ మల్లికార్జునరెడ్డి వారికి మద్దతు తెలిపారు. విజయమ్మ దీక్ష భగ్నానికి నిరసనగా పాడేరులో వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు వంజంగి కాంతమ్మ, సత్యవేణి ఆధ్వర్యంలో రాస్తారోకో జరిపారు. లగిశపల్లి నుంచి పాడేరు వరకు టీడీపీ కార్యకర్తలు పాదయాత్ర చేసి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఏయూలో విద్యార్థి ఐక్య ఫ్రంట్ ఆధ్వర్యంలో విద్యార్థులు యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద కేంద్రమంత్రి చిరంజీవి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పౌరసరఫరాల శాఖ సిబ్బంది బీచ్‌రోడ్డులోని అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాయకరావుపేటలో విద్యుత్ జేఏసీ రాస్తారోకో నిర్వహించారు. నక్కపల్లిలో మోకాళ్ల ప్రదర్శన ద్వారా ఉద్యమ కారులు తమ నిరసన వ్యక్తం చేశారు. చోడవరంలో మానవహారాలు, నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. చోడవరం వైఎస్సార్సీపీ సమన్వయకర్త బలిరెడ్డి సత్యారావు ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. కశింకోట జాతీయ రహదారిపై నిరసన జ్వాలలు మిన్నంటాయి.