బంద్ సంపూర్ణం
= పలుచోట్ల దిష్టిబొమ్మల దహనం
=జాతీయరహదారుల దిగ్బంధం
= స్వచ్ఛందంగా ప్రజల మద్దతు
=వ్యాపార సంస్థల మూసివేత
తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడం జిల్లా ప్రజలను ఆగ్రహావేశాలకు గురిచేసింది. కేబినెట్ నిర్ణయానికి నిరసనగా రాజకీయ పార్టీలు, ఏపీ ఎన్జీవోలు శుక్రవారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. సోనియా, దిగ్విజయ్‌ల దిష్టిబొమ్మలను పలుచోట్ల దహనం చేశారు. వైఎస్సార్‌సీపీ, టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో కార్యక్రమాలు జరిగాయి.
సాక్షి, విజయవాడ : రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం చేపట్టిన బంద్ సంపూర్ణంగా జరిగింది. మచిలీపట్నంలో జిల్లా కలెక్టరేట్, హెడ్ పోస్టాఫీస్, ఎల్‌ఐసీ ప్రధాన కార్యాలయాలు మూతపడ్డాయి.
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, పెట్రోల్ బంకులు, బ్యాంకులు స్వచ్ఛందంగా మూసేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బంద్ పిలుపునకు జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన లభించింది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎన్జీవోలు కూడా బంద్‌లో పాల్గొన్నారు. టీడీపీ ఆధ్వర్యంలోనూ జిల్లాలో ఆందోళనలు నిర్వహించి, బంద్ చేపట్టారు.
ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈస్ట్ కృష్ణా జేఏసీ చైర్మన్ ఉల్లి కృష్ణ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని సిబ్బందిని బంద్‌కు సహకరించాలని కోరారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని సీపీవో, సంక్షేమశాఖల కార్యాలయాలు, ఖజానా శాఖ, పంచాయతీ, ఆర్డీవో కార్యాలయాలు, ఇతర జిల్లాశాఖల సిబ్బందిని బయటకు పంపి కార్యాలయాలు మూసివేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా స్తంభించాయి. పలుచోట్ల న్యాయవాదులు కోర్టులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. విజయవాడలో సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించి బంద్ చేయించారు.
జాతీయ రహదారులపై రాస్తారోకోలు...
బంద్‌లో భాగంగా జిల్లావ్యాప్తంగా జాతీయరహదారులపై రాస్తారోకోలు నిర్వహించారు. జగ్గయ్యపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను బంద్‌కు నేతృత్వం వహించారు. జాతీయ రహదారిని దిగ్బంధనం చేశారు. మైలవరంలో నియోజకవర్గ సమన్వయకర్తలు జ్యేష్ఠ రమేష్‌బాబు, జోగి రమేష్‌లు బంద్ కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జ్యేష్ఠ రమేష్‌బాబు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక బోసుబొమ్మ సెంటర్లో ధర్నా చేపట్టారు.
జోగి రమేష్ తన అనుచ రులతో బంద్‌లో పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం రింగ్‌సెంటర్‌లో జోగి ఆధ్వర్యంలో సుమారు గంటసేపు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలియజేశారు. దీంతో జాతీయ రహదారికిరువైపులా భారీ స్థాయిలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నందిగామలో పార్టీ సమన్వయకర్త మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై పార్టీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. హనుమాన్‌జంక్షన్‌లో వైఎస్సార్‌సీపీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు ఆధ్వర్యంలో జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు. చల్లపల్లిలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ, ఎన్జీవో సంఘ నాయకులు విజయవాడ, మచిలీపట్నం, అవనిగడ్డ రహదారులను దిగ్బంధించారు.
డిపోలకే పరిమితమైన బస్సులు...
మచిలీపట్నంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య (నాని) శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి బందరు బస్టాండ్‌కు చేరుకుని బస్సుల రాకపోకలను నిలువరించారు. దీంతో బస్సులు డిపోకే పరిమితమవగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు రాలేదు. బంద్‌లో భాగంగా నాయకులు, కార్యకర్తలు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
దివిసీమలో అవనిగడ్డ నియోజకవర్గ కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు, జిల్లా స్టీరింగ్‌కమిటీ సభ్యులు గుడివాక శివరావ్, యాసం చిట్టిబాబు బంద్‌ను పర్యవేక్షించారు. గుడివాడలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో రాస్తారోకో, ప్రదర్శనలు నిర్వహించారు. కైకలూరులో పార్టీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ, రాస్తారోకో చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, మాజీ మంత్రి మాగంటి బాబు ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మను తాలూకా సెంటర్ వద్ద దహనం చేసి, రోడ్డుపై భోజనాలు చేశారు. ఎన్జీవోలు ర్యాలీ చేపట్టి దుకాణాలు మూయించారు.
పెడనలో నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాదు ఆధ్వర్యంలో పెడన, గూడూరు మండలాలు, మున్సిపాల్టీకి చెందిన నాయకులతో ర్యాలీ నిర్వహించి, బంటుమిల్లి చౌరస్తాలో మానవహారం చేశారు. పెనమలూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నేతలు సమన్వయకర్తలు పడమట సురేష్‌బాబు, తాతినేని పద్మావతి ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. తిరువూరు పట్టణంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బంద్ పూర్తిగా జరిగింది. నూజివీడులో పార్టీ పట్టణ కన్వీనర్ బసవా భాస్కరరావు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు.
విజయవాడలో రాధా అరెస్ట్
విజయవాడలో పార్టీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్, సమన్వయకర్తలు వంగవీటి రాధాకృష్ణ, పి.గౌతంరెడ్డి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. బెంజిసర్కిల్ వద్ద పోలీసులు రాధాకృష్ణను, మరికొంతమంది కార్యకర్తలను అరెస్టు చేశారు. దీనికి నిరసనగా కార్యకర్తలు గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్ వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించారు. రాధాకృష్ణను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.