బడిత బాజా
బడిత బాజా
Published Tue, Jun 13 2017 12:37 AM | Last Updated on Wed, Sep 18 2019 2:52 PM
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : మౌలిక సదుపాయాల మాట లేదు. సమస్యల పరిష్కారంపై ఏమాత్రం దృష్టి లేదు. వేసవి సెలవులు పూర్తవడంతో ఎప్పటిలా పాత సమస్యలతోనే సోమవారం బడులు తెరుచుకున్నాయి. ఇరుకు గదుల్లో దుమ్ము, ధూళి విద్యార్థులకు స్వాగతం పలికాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పలుచోట్ల బెంచీలు లేకపోవడంతో నేలబారు చదువులు తప్పని పరిస్థితి కనిపించింది. ఇటు సర్కారీ బడులతోపాటు అటు ప్రైవేట్ పాఠశాలల నిర్వా హకులు సైతం బడిత బాజా (మంచీచెడు అనే ఆలోచన లేకుండా) చందాన సావధానంగా బడి తలుపులు బార్లా తెరిచారు.
దుమ్ము దులపలేదు.. నేలపై తప్పలేదు
ప్రభుత్వ పాఠశాలల్లో పాత తరగతి నుంచి కొత్త తరగతి గదుల్లోకి విద్యార్థులు ఉత్సాహంగా తరలిరాగా సమస్యలు స్వాగతం పలి కాయి. చాలాచోట్ల తరగతి గదుల్లో దుమ్ము, ధూళిని దులపలేదు. బెంచీలన్నీ దుమ్ముకొట్టుకుపోయి దర్శనమిచ్చాయి. కొన్ని పాఠశాలల్లో బెంచీలు లేక చిన్నారులు నేలపైనే కూర్చోవాల్సి వచ్చింది. అక్కడక్కడా ఉపాధ్యాయులకూ ఇలాంటి పరిస్థితి తప్పలేదు. కొన్ని పాఠశాలల్లో తరగతి గదుల కొరత ఉండటంతో ఒకేచోట రెండు తరగతులు నిర్వహించడం కనిపించింది. తొలి రోజున అరకొరగానే విద్యార్థులు తరగతులకు హాజరుకాగా.. ఉపాధ్యాయులూ వారితో పోటీపడ్డారు. కొన్ని పాఠశాలల్లో శ్లాబులు పాడై వర్షం నీరు గదుల్లోకి చేరే పరిస్థితి కనిపించింది. పలుచోట్ల నూతన తరగతి గదులు నిర్మించినా ఫ్లోరింగ్, సున్నాలు వేయకపోవడంతో అక్కరకు రాలేదు.
అరకొరగా పాఠ్య పుస్తకాలు
జిల్లాలో 2,920 ప్రాథమిక, 490 ప్రాథమికోన్నత, 520 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 3,930 ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో సుమారు 3.20 లక్షల మంది విద్యార్థులు ఉండగా.. వారికి 14.74 పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంది. ఇప్పటివరకు 8.70 లక్షల పాఠ్య పుస్తకాలు మాత్రమే వచ్చాయి. ఇంకా 40 శాతం పుస్తకాలు పాఠశాలలకు చేరుకోవాల్సి ఉంది. తమకు పుస్తకాలు ఇస్తారో లేక బయట కొనుక్కోమంటారోననే ఆందోళన విద్యార్థుల్ని వెంటాడుతోంది.
బదిలీల టెన్షన్
ఉపాధ్యాయులు బదిలీల టెన్షన్‌లో ఉండటంతో పాఠ్యాంశాల బోధనపై ఇప్పట్లో దృష్టి సారించే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు రేషనలైజేషన్ ప్రకియ కొలిక్కి రాకపోవడంతో ఏ పాఠశాలలు ఉంటాయో.. ఏ పాఠశాలలో విలీనమవుతాయోననే ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది. తాము పనిచేస్తున్న పాఠశాలను ఉంచుతారో మూసేస్తారో అనే దిగులు.. మూసేస్తే తమకు ఎక్కడ స్థానం కల్పిస్తారో అనే అనుమానం ఉపాధ్యాయుల్ని వెంటాడుతున్నాయి. హేతుబద్ధీ్దకరణలో భాగంగా జిల్లాలో 129 పాఠశాలలు మూతపడనున్నాయని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడం, హేతుబద్ధీకరణ పూర్తయ్యాకే బదిలీలు చేయాల్సి ఉండటం బోధనపై ప్రభావం చూపనుంది.
ప్రైవేట్ స్కూళ్లది మరో దారి
పైకి హంగులు కనిపిస్తున్నా ప్రైవేట్ పాఠశాల్లోని పరిస్థితులు సైతం సర్కారు బడులతో పోటీ పడుతున్నాయి. బెంచీల సమస్య లేకపోయినా.. ఇరుకు గదుల సమస్య ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థుల్ని వెంటాడుతోంది. కనీసం ఆడుకునేందుకు స్థలం లేక.. భోజనం చేసేందుకు జాగా లేక విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. అధిక శాతం ప్రైవేట్ స్కూల్స్ నివాస గృహాల్లాంటి గదులు, అపార్ట్‌మెంట్స్‌లో కొనసాగుతున్నాయి. కనీసం సైకిల్ పార్క్ చేసుకునే సదుపాయం లేని పాఠశాలలు అనేకం ఉన్నాయి. వీటిలో ఫీజుల మోత మాత్రం భారీగా మోగుతోంది. జిల్లాలో 1,129 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా.. వీటిలో 2.27 లక్షల మంది చదువుతున్నారు. వీరికి విరామ సమయంలో ఆడుకోవడానికి కనీసం క్రీడా ప్రాంగణాలు కూడా అందుబాటులో లేవు.
Advertisement
Advertisement