‘బోరు’మంటున్నారు! | water source nil | Sakshi
Sakshi News home page

‘బోరు’మంటున్నారు!

Published Sat, Apr 1 2017 12:07 AM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM

‘బోరు’మంటున్నారు! - Sakshi

‘బోరు’మంటున్నారు!

- రోజురోజుకూ అడుగంటుతున్న భూగర్భ జలాలు
- వేల సంఖ్యలో ఒట్టిపోయిన బోరుబావులు
- కొత్త బోర్ల తవ్వకానికి రోజూ రూ.కోటిన్నర ఖర్చు
- అయినా అన్నదాతలకు నిరాశే

 
ధర్మవరం : ధర్మవరం మండలం నడిమిగడ్డపల్లికి చెందిన రైతు రమణ తనకున్న పొలంలో రెండెకరాల మేర ద్రాక్ష పంటను సాగుచేశాడు. పంట దిగుబడి బాగా ఉన్న సమయంలో ఉన్నట్లుండి బోరులో నీరు తగ్గిపోయింది. పంట ఎండుముఖం పట్టడంతో కాపాడుకోవడానికి  రైతు తన పొలంలోనే మరోచోట బోరు వేయించాడు. దాదాపు రూ.1.50 లక్షలు ఖర్చు చేసి..  వెయ్యి అడుగుల మేర తవ్వించాడు. అయినా చుక్కనీరు పడలేదు. అంతటితో ప్రయత్నం ఆపలేదు. మరో నాలుగు బోర్లు  వేయించి దాదాపు రూ.6లక్షలు ఖర్చు చేసి పంటను కాపాడుకున్నాడు. అయితే.. పంట దిగుబడి మొత్తం బోర్లకు పెట్టిన ఖర్చుకే సరిపోయింది.  

చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండి గ్రామానికి చెందిన ముత్యాలరెడ్డి ఈ నెల 8వ తేదీన తన తోటలో 800 అడుగుల మేర బోరు వేయించాడు. నీళ్లు దాదాపు రెండున్నర ఇంచుల మేర పడ్డాయి. దీంతో ఆయన రూ.1.50 లక్షలు ఖర్చుపెట్టి కొత్త మోటారు తీసుకొచ్చి బిగించాడు.అయితే ఆ బోరులో నీరు కేవలం వారం రోజులు వచ్చి నిలిచిపోయాయి.

     రైతులు రమణ, ముత్యాలరెడ్డి మాత్రమే కాదు.. జిల్లావ్యాప్తంగా వేలాది మంది ఇదేవిధమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తీవ్ర వర్షాభావం వల్ల భూగర్భజలాలు అడుగంటిపోవడంతో బోర్లు ఒట్టిపోతున్నాయి. రైతన్నలు తమ పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు. రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా పాతాళగంగను పైకి తేలేకపోతున్నారు. ప్రతిరోజూ జిల్లాలో సగటున వంద బోర్లు వేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ధర్మవరం, రాప్తాడు, శింగనమల, కళ్యాణదుర్గం, కదిరి, రాయదుర్గం, పెనుకొండ నియోజకవర్గాల్లో భూగర్భజలాలు రోజురోజుకూ అడుగంటిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యాన పంటలను కాపాడేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో గత ఆరు నెలలుగా డీప్‌బోర్లు అధికంగా తవ్విస్తున్నారు.

లోతులో నీరుపడితే చాలా రోజుల పాటు  ఎండిపోకుండా ఉంటాయని భావిస్తున్న రైతులు చాలా మంది వెయ్యి అడుగుల మేర తవ్విస్తున్నారు. ఒక్కో డీప్‌ బోరు తవ్వకానికి రూ.1.30 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు ఖర్చవుతోంది. ఈ లెక్కన రోజుకు వంద బోర్లు తవ్వించేందుకు రూ.1.50 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. జనవరి  నుంచి ఇప్పటి దాకా బోర్లు తవ్వించడానికి జిల్లా రైతులు దాదాపు రూ.135 కోట్లు ఖర్చు చేశారు. ఈ మూడు నెలల్లో రైతులు పెట్టిన ఖర్చుతో ఒక చిన్న ప్రాజెక్ట్‌ పూర్తి చేయొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

    వెయ్యి అడుగుల బోరు తవ్వకానికి రూ.1,22,000తో పాటు కేసింగ్‌ ఖర్చు ప్రతి అడుగుకు రూ.350 చొప్పున  అవుతుంది. సాధారణ భూముల్లో అయితే 20 అడుగుల మేర కేసింగ్‌ వేస్తారు. ఇసుక నేలల్లో అయితే 50 నుంచి 100 మేర కేసింగ్‌ వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా బోర్‌లారీ సిబ్బంది భోజనం, ట్రాన్స్‌పోర్టు ఖర్చులు రూ.3 వేల వరకు వస్తాయి.

ఇదీ భూగర్భ జలాల పరిస్థితి
వర్షాలు పడితే భూగర్భ నీటి మట్టం పెరుగుతుంది. లేదంటే తగ్గుతుంది. అయితే వరుస కరువులతో జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ లోతుకు పడిపోతున్నాయి. ప్రస్తుతం 26.50 మీటర్ల లోతుకు పడిపోయాయి.  

డీప్‌ బోరు వేయడానికి అయ్యే ఖర్చు
అడుగులు        ధర (అడుగుకు)        ఖర్చు
1–300        రూ.75            రూ.22,500
300–400        రూ.85            రూ.8,500
400–500        రూ.95            రూ.9,500
500–600        రూ.115            రూ.11,500
600–700        రూ.135            రూ.13,500
700–800        రూ.175            రూ.17,500
800–1000        రూ.195            రూ.39,000

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement