విజయమ్మ దీక్ష భగ్నాన్ని నిరసిస్తూ జనాగ్రహం
సాక్షి, విజయవాడ : సమన్యాయం చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కోరుతూ వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేయడాన్నినిరసిస్తూ శని వారం ఆ పార్టీ నిర్వహించిన బంద్ విజయవంతమైంది. మచిలీపట్నంలో వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేసి సంఘీభావం తెలిపారు. పెడన నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ నేతృత్వంలో బంద్ పాటించారు. బ్యాంకులు, పెట్రోలు బంకులను మూయించారు.
నియోజకవర్గంలో ఆ పార్టీ మరో సమన్వయకర్త వాకా వాసుదేవరావు విజయమ్మ దీక్షలకు మద్దతుగా గత ఐదు రోజులుగా పెడనలో చేపట్టిన రిలేదీక్షలు మధ్యాహ్నం విరమించారు. కైకలూరులో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విజయమ్మకు మద్దతుగా శనివారం బంద్ పెద్ద ఎత్తున జరిగింది. విద్యాసంస్థలు, దుకాణాలను మూయించారు. భారీగా ర్యాలీ చేపట్టి ఏలూరు రోడ్డు కూడలి వద్ద విజ్ఞాన్ కళాశాల విద్యార్థులతో కలసి మానవహారం, రాస్తారోకో చేపట్టారు.
పామర్రులో ధర్నా..
విజయమ్మ దీక్ష భగ్నం చేసినందుకు నిరసనగా పామర్రు నాలుగు రోడ్ల కూడలిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పార్టీ పామర్రు నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోరుతూ ఒక పార్టీ అధ్యక్షురాలు చేపట్టిన దీక్షను భగ్నం చేయడం దారుణమన్నారు. తోట్లవల్లూరు, కూచిపూడి, పమిడిముక్కల మండలాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు. విజయమ్మకు మద్దతుగా పెనమలురు నియోజకవర్గంలో బంద్ జరిగింది. వైఎస్సార్ సీపీ నాయకులు పడమట సురేష్‌బాబు పెనమలూరు, కంకిపాడు సెంటర్‌లలో ర్యాలీలు నిర్వహించి షాపులు మాయించగా, తాతినేని పద్మావతి పెనమలూరులో బంద్ చేయించారు. విజయవాడ రూరల్ మండలం నున్నలో బంద్ నిర్వహించారు. షాపులు, పాఠశాలలు మూసివేశారు. బ్యాంకులు పని చేయలేదు.
మైలవరంలో బైక్ ర్యాలీ..
వైఎస్సార్ సీపీ సమన్వయకర్త జ్యేష్ఠ రమేష్‌బాబు ఆధ్వర్యంలో మైలవరం నియోజకవర్గ పరిధిలో బంద్ ప్రశాంతంగా జరిగింది. మరో సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలతో ఇబ్రహీంపట్నం నుంచి ర్యాలీ నిర్వహించారు. బంద్‌కు సహకరించాల్సిందిగా వాణిజ్య, వ్యాపార సంస్థలను కోరారు. నందిగామ పట్టణంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో బంద్‌తో పాటు ర్యాలీ, రిలే నిరాహార దీక్షలు కూడా కొనసాగుతున్నాయి.
జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు బంద్ నిర్వహించారు. జగ్గయ్యపేటలో యూత్ నాయకులు బైక్‌లపై ర్యాలీ నిర్వహించి దుకాణాలు, కార్యాలయాలు మూసివేయించారు. పెనుగంచిప్రోలులో పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించి రాస్తారోకో చేశారు. ముండ్లపాడు గ్రామంలో పార్టీ మండల కన్వీనర్ ఆధ్వర్యంలో పాఠశాలలు, కార్యాలయాలను మూసివేయించారు. తిరువూరు నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. తిరువూరులో పార్టీ మండల కన్వీనర్ శీలం నాగనర్సిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు బంద్ నిర్వహించారు. జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు బంద్‌లో పాల్గొన్నారు. విజయవాడలోని వ్యాపారులు దుకాణాలు మూసివేసి బంద్‌కు సంఘీభావం తెలిపారు.