మహా భారతం గాథలో ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డి. ఆయన అంధత్వాన్ని గౌరవిస్తూ భార్య గాంధారి కూడా ఆజన్మాంతం కళ్లకు గంతలు కట్టుకునే జీవిస్తుంది. కళ్లుండి కూడా ప్రపంచాన్ని చూడలేకపోయిందన్నమాట. గాంధారి, ధృతరాష్ట్రులకు పెద్దకొడుకు దుర్యోధనుడంటే విపరీతమైన ప్రేమ. ఈ అతి గారబం కారణంగా దుర్యోధనుడు అహంకారిగా, దుష్ట లక్షణాలు కలిగిన వ్యక్తిగా మారతాడు. తత్ఫలితంగా యుద్దానికి కాలుదువ్వి ఘోర పరాజయం చెందడం, కురు వంశ నాశనం జరిగాయని మహాభారతం చెబుతోంది. ఇది పురాణమో! లేక ఇతిహాసమో! మరేదైనా కానీ ఇందులో నేర్చుకోగలిగినవారికి నేర్చుకున్నంత జ్ఞానం ఉంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో, సోదరి షర్మిల మధ్య కొంతకాలంగా నడుస్తున్న ఆస్తి తగాదా చూస్తుంటే, తల్లి విజయమ్మ తాజాగా విడుదల చేసిన బహిరంగ లేఖ చూసిన తరువాత ఎవరికైనా మహాభారతం గుర్తుకు రాకమానదు. తల్లిదండ్రులకు పిల్లలంటే ప్రేమ ఉంటుంది. అది అందరిపై సమానంగానే ఉండాలి. కానీ ఎందువల్లో కొన్నిసార్లు కొందరు అనూహ్యంగా ఒకరిపైనే ప్రేమ చూపుతుంటారు. ఇప్పుడు విజయమ్మ కూడా అచ్చం అలాగే వ్యవహరించినట్లు అనిపిస్తుంది.
షర్మిలపై గుడ్డి ప్రేమో, లేక బెదిరించడం వల్ల అలా ప్రకటన చేశారో తెలియదు కాని, వైఎస్ఆర్ కుటుంబానికి ఇంతకాలం ఉన్న ప్రతిష్ట దెబ్బతినడానికి ఆమె కూడా కారణం అవడం విషాదమే. కుమారుడు, కుమార్తె మధ్య వివాదం వస్తే ఇద్దరిని కూర్చోబెట్టి సర్దుబాటు చేయాల్సిన ఆమె ఏకపక్షంగా షర్మిలకు అనుకూలంగా ప్రకటన చేయడం పద్దతి అనిపించుకోదు. తన ప్రకటన మొదటి భాగంలో ఇద్దరూ పరిష్కరించుకుంటారు అని చెప్పినప్పుడు, అంతటితో ముగించి ఉంటే బాగుండేది. అలాకాకుండా ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు చేసిన ప్రకటనలను ఖండిస్తూ అంతా ఉమ్మడి కుటుంబ ఆస్తి అని, ఇతర అంశాలు ప్రస్తావించడం ద్వారా ఆమె తప్పు చేశారనిపిస్తుంది.
విజయ సాయి కుటుంబ ఆడిటర్ అయితే, విజయమ్మ చెల్లిలి భర్త వైవి సుబ్బారెడ్డి. విజయ సాయిరెడ్డి తన ప్రకటనలో షర్మిలకు వైఎస్ ఏ ఏ ఆస్తులు ఇచ్చింది సవివరంగా చెప్పడంతో వాస్తవాలు బయటకు వచ్చాయి. అంతవరకు నిజంగానే షర్మిలకు తండ్రి ఆస్తి నుంచి ఏ వాటా దక్కలేదేమో అని భావించిన వారికి పరిస్థితి అర్థమైంది. అంతేకాకుండా షర్మిలకు గత పదేళ్లలో జగన్ నుంచి రూ.200 కోట్లు అందితే కూడా ఆ కృతజ్ఞత చూపకుండా నోటికొచ్చినట్టు మాట్లాడడాన్ని విజయమ్మ తప్పు పట్టకపోవడం ఘోరంగా ఉంది. కొడుకుని విషనాగు అని, జైలుకెళ్లినా ఫర్వాలేదు అని, చివరకు మరణం గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తే తన ప్రకటనలో విజయమ్మ మాట మాత్రం తప్పుపట్టకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అసలు ఈ లేఖ ఆమె రాశారా? లేదా? అనే సందేహం కలుగుతోంది. గతంలో జగన్ పై ఆమె చూపిన ప్రేమ ఆప్యాయతలన్నీ ఏమైపోయాయన్న సందేహం కలుగుతోంది.
జగన్ పేరుతో ఉన్న ఆస్తుల్లో ఏవి వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రిగా ఇచ్చినవి, జగన్ సొంతంగా సంపాదించుకున్నవి ఏమిటీ అనేదానిపై విజయమ్మకు క్లారిటీ లేకుండా ఉంటుందా? 1996 నుంచే పవర్ ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాల్లో జగన్ ఉన్న సంగతి ఆమెకు తెలుసు కదా! తన పవర్ ప్రాజెక్ట్ అమ్మి 2004 ఎన్నికల్లో తండ్రికి నిధులు సమకూర్చిన మాట అవాస్తవమా? అదే సమయంలో షర్మిల గానీ, ఆమె భర్త అనిల్ గానీ ఏ వ్యాపారాలు చేశారు? ఎంత సంపాదించారు? నిజంగా షర్మిలకు సొంత ఆస్తులు ఉంటే సోదరుడు ఇచ్చిన డబ్బులు ఎందుకు తీసుకునేవారు? జగన్ ఆస్తులపై ఎందుకు ఆశపడేవారు? ఎందుకు ఇంత రచ్చ చేసేవారు? జగన్ ప్రేమతో ఎంఓయు చేస్తే ఆయనకు తెలియకుండానే సరస్వతి పవర్ షేర్లను బదలాయించుకోవడాన్ని విజయమ్మ ఎలా సమర్థించుకుంటారు?
అందుకే ఆ విషయాలేవీ చెప్పకుండా షర్మిలకు విజయమ్మ ఏకపక్షంగా మద్దతు ఇచ్చి వైఎస్ అభిమానులకు ఆవేదన కలిగించారు. జగన్ ఎప్పుడు తన చెల్లి గురించి ఒక్క మాట అనకపోయినా షర్మిల మాత్రం అన్నను దూషిస్తున్నా, రాజకీయ ప్రత్యర్థులతో మిలాఖత్ అయినా, విజయమ్మ ఎందుకు ఆమెను మందలించలేదో అర్థం కావడం లేదు. ఏ కాంగ్రెస్ అయితే జగన్ ను జైలు పాలు చేసిందో ఆ కాంగ్రెస్ కే ఇప్పుడు షర్మిల అధ్యక్షురాలు అవ్వడం, ఆ పార్టీ పక్షాన కడప నుంచి పోటీ చేయడం విజయమ్మ ఎలా జీర్ణించుకోగలిగారు?
పైగా కడపలో ఆమెను గెలిపించాలని ప్రజలకు ఎలా విజ్ఞప్తి చేశారు? అయినా షర్మిలకు డిపాజిట్ రాలేదు. దీన్నిబట్టి ఏం అర్థమవుతోంది? అటు వ్యాపారపరంగానైనా, ఇటు రాజకీయంగానైనా జగన్ చేసిన కృషి వల్లనే ఆయన పైకి వచ్చారు. ముఖ్యమంత్రి అయ్యారు. అలా అని 2019 ఎన్నికల్లో అంతకు ముందు జగన్ కు వీళ్లిద్దరూ సాయపడలేదని ఎవరూ అనరు. అంతవరకూ ఉన్న ప్రేమ అభిమానాల కారణంగానే జగన్ కూడా షర్మిల కుటుంబాన్ని ఆదరిస్తూ వచ్చారు. కానీ షర్మిల రాజకీయంగా పెడదారిపట్టి చివరకు తనకే చికాకుగా మారితే ఆ విషయం విజయమ్మ అర్థం చేసుకోకపోవడం దురదృష్టకరం.
ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. షర్మిల, విజయమ్మల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి సడన్ గా ప్రేమ నటిస్తుండడంలో ఆంతర్యాన్ని విజయమ్మ పసిగట్టలేకపోవడం బాధాకరం. చంద్రబాబుతో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటివారితో షర్మిల చేతులు కలపడాన్ని విజయమ్మ ఎలా సహిస్తున్నారోగానీ వైఎస్సార్ అభిమానులు ఎవ్వరూ భరించలేకపోతున్నారు!
ఒకప్పుడు విజయమ్మ చేతిలో బైబిల్ ఉంటేనే ఫోటోలు వేసి మరీ నానారకాలుగా ప్రజల్లో అప్రతిష్టపాలు చేయడానికి కథనాలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇప్పుడు అమ్మ.. ఆవేదన అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాయి. ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం షర్మిల చేస్తున్న పిచ్చి పనులను విజయమ్మ నియంత్రించలేక చివరకు గుడ్డి ప్రేమ వల్లనో, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కారణమో గానీ షర్మిలకు మద్దతిచ్చే దయనీయ పరిస్థుతుల్లో పడ్డారు. ఒకవైపు షర్మిల, విజయమ్మలకు అనుకూలంగా రాస్తున్నట్టు డ్రామా ఆడుతూనే, ఇంకోవైపు షర్మిల కోరుతున్న ఆస్తులన్నీ అక్రమాస్తులనీ ప్రచారం చేస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా శకుని పాత్రను వీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. చివరగా ఒక మాట! జరగకూడనివి అన్నీ తన కళ్ల ముందే జరుగుతున్నాయని విజయమ్మ ఆవేదన చెందారు. నిజమే! కళ్లముందు జరుగుతున్నవాటిలో వాస్తవం ఏదో, అవాస్తవం ఏదో తెలుసుకోకుండా కళ్లకు గంతలు కట్టుకున్నట్టుగా గాంధారి పాత్ర పోషిస్తే ఎవరు సానుభూతి చూపుతారు?
-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment