సాక్షి, విశాఖపట్నం: సర్కారీ స్కూళ్లకు అప్రకటిత సెలవులొచ్చాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఉపాధ్యాయులు సమ్మెబాటతో ఈ పరిస్థితి నెలకొంది. శుక్రవారం నాటికి జిల్లాలోని 218 స్కూళ్లు పూర్తిగా మూతపడ్డాయి. మిగిలిన చోట్ల ఒకరిద్దరు ఉపాధ్యాయులే ఉన్నారు. విద్యాశాఖ లెక్కల మేరకే 8,400(52 శాతం) మంది సమ్మెబాట పట్టారు. ఈ సంఖ్య పదివేల పైమాటే అని ఉపాధ్యాయ సంఘాల సమాచారం. శనివారం నుంచి ఎస్టీయూ సమ్మెకు పిలుపిస్తుండగా మరికొన్ని సంఘాలు ఇదేబాటలో ఉన్నాయి.
మూసివేత దిశగా మరికొన్ని...
జిల్లాలో స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ, రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో ప్రాథమిక పాఠశాలలు 2,616, ప్రాథమికోన్నత పాఠశాలలు 351 ఉన్నాయి. ఉన్నత పాఠశాలల్లో జిల్లా పరిషత్ యాజమాన్యంలో 247, మున్సిపాలిటీ పరిధిలో 27, రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవి 132 వరకు ఉన్నాయి. ఎయిడెడ్ యాజమాన్యంలో 52 ప్రాథమిక, 9 ప్రాథమికోన్నత, 26 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో 16,106 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు 10 వేల మంది శుక్రవారం నుంచి సమ్మెబాట పట్టారు. కొన్ని సంఘాల నేతలు సమైక్య సమ్మెకు వ్యతిరేకంగా ఫోన్ మెసేజ్‌లు విస్తృతంగా పంపినా ఉపాధ్యాయులు పట్టించుకోలేదు. సంఘాలతో పనిలేకుండానే సమ్మెబాట పట్టారు. దీంతో 218 స్కూళ్లు పూర్తిగా తెరుచుకోలేదు. సమ్మెను వ్యతిరేకిస్తున్న సంఘాల్లో మండల ప్రధాన ప్రతినిధుల్లో కొందరు మాత్రం స్కూళ్లకు వె ళ్తున్నారు. సగం సిబ్బంది కూడా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తెరిచిన పాఠశాలల్లో కూడా సక్రమంగా తరగతులు జరగడం లేదు. శనివారం, సోమవారం నాటికి పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
వసతి గృహాల సిబ్బంది సమ్మె బాట
జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలకు సమైక్య సెగ తాకింది. నాలుగో తరగతి సిబ్బం ది కూడా శుక్రవారం నుంచి సమ్మెబాట పట్టా రు. దీంతో వసతి గృహాలు మూతపడనున్నా యి. గురువారం నుంచి వార్డెన్లు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం నాలుగో తరగతి సిబ్బంది సమ్మె నోటీసు అందించారు. జిల్లావ్యాప్తంగా 79 ఎస్సీ వసతిగృహాలలో 5,500 మంది, 68 బీసీ వసతి గృహాలలో 6420 మంది విద్యార్థులు ఉన్నారు. నాలుగో తరగతి సిబ్బంది సమ్మె కారణంగా శుక్రవారం నుంచి విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అప్పగించాలని ఉన్నతాధికారులు ఇప్పటికే హాస్టల్ సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. బీసీ హాస్టళ్లలో 136 మంది, ఎస్సీ హాస్టళ్లలో 137 మంది నాలుగో తరగతి సిబ్బంది సమ్మె లోకి వెళ్లనున్నారు. కాగా, ఎస్సీ వసతి గృహాలలో వంద మంది, బీసీ వసతి గృహాలలో పదిమంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మెకు దూరంగా ఉన్నారు. జిల్లాలోని 15 ఎస్సీ, 16 బీసీ కళాశాల వసతి గృహాలు కూడా శనివారం మూతపడనున్నాయి. వీటి వార్డెన్లు కూడా సమ్మెబాట పడుతున్నారు.
నేటి నుంచి సంక్షేమ అధికారులు
సమైక్యాంధ్రకు మద్దతుగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి సంక్షేమ అధికారులు సమ్మెకు దిగారు. జిల్లాలో బీసీ, ఎస్సీ, నాల్గో తరగతి ఉద్యోగ సంఘం నాయకులు, ఉద్యోగులు విధులను బహిష్కరించారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా దీక్షలు చేస్తున్న వారికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు పి.అప్పారావు తెలిపారు.
218 బడులు మూత
Published Sat, Aug 24 2013 3:24 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
Advertisement
Advertisement