హేతుబద్ధీకరణతో 3 వేల స్కూళ్లకు ముప్పు
మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్
హైదరాబాద్: ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ కారణంగా రాష్ట్రంలో మూడువేలకు పైగా ప్రభుత్వస్కూళ్లు మూసివేస్తే గ్రామాల్లోని దాదాపు 2 లక్షల మంది దళిత, గిరిజన, బీసీ వర్గాల విద్యార్థులు బడికి దూరం అవుతారని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. సమీపంలోని స్కూళ్లకు వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడతారని, తద్వారా వారు డ్రాపవుట్స్‌గా మిలిగిపోతారని చెబుతున్నారు. ఆ శాస్త్రీయంగా ఉన్న ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. విద్యాసంవత్సరం నాలుగు నెలలు గడిచాక ఇలా హేతుబద్ధీకరణ చేయడం సరైంది కాదంటున్నాయి. 19 మంది అంతకంటే తక్కువ మంది విద్యార్థులు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను, 75 మంది కంటే తక్కువ మంది ఉన్న ఉన్నత పాఠశాలలను, ఇంగ్లిష్ మీడియం సక్సెస్ స్కూళ్లను మూసివేయాలని హేతుబద్ధీకరణ ఉత్తర్వుల్లో తెలుపడం దారుణమని సంఘాలు పేర్కొంటున్నాయి. వీటిని ఉపసంహరించుకోవాలని పీఆర్‌టీయూ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఎస్టీయూ అధ్యక్షుడు రాజిరెడ్డి, తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం నేతలు కొండల్‌రెడ్డి, వేణుగోపాల్, రవీందర్, ధమనేశ్వర్‌రావు, మనోహర్‌రావులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాలు సేకరించినమేరకు
మూతపడే ప్రమాదం ఉన్న స్కూళ్ల వివరాలు...
► ఆదిలాబాద్ జిల్లాలో 367 స్కూళ్లు మూతపడునున్నాయి. అందులో 300 ప్రాథమిక, 37 ప్రాథమికోన్నత, 30 ఉన్నత పాఠశాలలు మూసివేయనున్నారు.
► నల్లగొండలో 350 స్కూళ్లు మూతపడను న్నాయి. అందులో 100 ఉన్నత, 200 ప్రాథమిక, 50 ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి.
► కరీంనగర్‌లో 692 స్కూళ్లు మూతపడే ప్రమాదం నెలకొంది. ఇందులో 447 ప్రాథమిక, 110 ప్రాథమికోన్నత, 27 ఉన్నత పాఠశాలలున్నాయి. అలాగే 108 ఇంగ్లిష్ మీడియం సక్సెస్ స్కూళ్లు మూత పడనున్నాయి.
► రంగారెడ్డిలో 226 స్కూళ్లకు ప్రమాదమే. ఇందులో 105 ప్రాథమిక, 56 ప్రాథమికోన్నత, 65 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
► హైదరాబాబాద్‌లో 20 ఉన్నత పాఠశాలలు, 15 వరకు ప్రాథమిక పాఠశాలలకు మూసివేసే ప్రమాదం.
► మహబూబ్‌నగర్‌లో 315 స్కూళ్లు మూత పడనున్నాయి. అందులో 300 ప్రాథమిక, ప్రా థమికోన్నత, 15 ఉన్నత పాఠశాలలున్నాయి.
► వరంగల్‌లో 658 స్కూళ్లు మూత పడనున్నాయి. 496 ప్రాథమిక, 151 ప్రాథమికోన్నత , 18 ఉన్నత పాఠశాలలు, 3 గిరిజన సంక్షేమ పాఠశాలలున్నాయి. పదిజిల్లాల్లో మొత్తం 3,103 పాఠశాలలకు ముప్పుంది.
► ఖమ్మంలో 145 స్కూళ్లకు మూసివేత ముప్పుంది. ఇందులో 20 ఉన్నత, 25 ప్రాథమికోన్నత, 100 ప్రాథమిక పాఠశాలలున్నాయి.
► నిజమాబాద్‌లో 350కి పైగా స్కూళ్లు మూతపడే అవకాశం ఉంది. ఇందులో 40 ఉన్నత పా ఠశాలలు, 100 ప్రాథమికోన్నత పాఠశాలలు, 100 ప్రాథమిక పాఠశాలలుండగా, మిగిలినవి ఉర్దూ మీడియం స్కూళ్లున్నాయి.
► మెదక్ జిల్లాలో 280 వరకు పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉంది.