Rationalization of teachers
-
ఆ జీఓలపై స్టే ఇవ్వం
సాక్షి, అమరావతి: పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీఓలపై ఎలాంటి స్టే ఇవ్వబోమని హైకోర్టు తేల్చిచెప్పింది. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమన్న హైకోర్టు, ఆ నిర్ణయాన్ని అమలుచేయనిద్దామని, అప్పుడే అందులో మంచిచెడ్డలు ఏమిటో తెలిసే అవకాశముంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. స్టే ఇస్తే మొత్తం ప్రక్రియ ఆగిపోతుందని, అందువల్ల ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. తదుపరి విచారణను అక్టోబర్ 11కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏజీ చెప్పిన వివరాలను పరిగణనలోకి.. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన జీఓలను సవాలు చేస్తూ తాజాగా ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ డి. రమేశ్చంద్ర సింహగిరి పట్నాయక్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంతో పాటు ఇదే అంశంపై గతంలో దాఖలైన వ్యాజ్యాలు మంగళవారం సీజే ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. విలీనం, హేతుబద్ధీకరణ ప్రభుత్వ విధాన నిర్ణయమన్నారు. ఇందులో ఇప్పటికే అధిక శాతం అమలైందన్నారు. అమలు తాలుకు ఫలితాలెలా ఉన్నాయన్న దానిపై సమీక్ష చేయాల్సి ఉందని వివరించారు. ఏజీ చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకుని విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఈ సమయంలో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. ఈ వ్యాజ్యాలపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందని, విచారణను రెండు వారాలకు వాయిదా వేయాలని కోరారు. కానీ, ఈ వ్యవహారంలో ఎలాంటి స్టే ఇచ్చేదిలేదని ధర్మాసనం స్పష్టంచేసింది. -
ఇంకా తేలని లెక్క
ప్రహసనంలా హేతు బద్ధీ్దకరణ 2వ తేదీకి పెంచిన గడువు నిర్లక్ష్యం వీడని ఎంఈఓలు పరిధి మారిస్తే పట్టేస్తారు....! గ్రామీణ స్థాయిలో చర్చలు విజయనగరం అర్బన్ : టీచర్ల హేతుబద్ధీకరణ ప్రక్రియ ప్రహసనంలా మారింది. జీఓ నంబర్ 29లో పొందుపరిచిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల వారీగా ఉపాధ్యాయుల హేతుబద్ధీ్దకరణ నిర్వహించాల్సి ఉంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వారీగా వివరాలను సేకరించి ఈ నెల 30లోగా పాఠశాల విద్యాశాఖకు ఆన్లైన్లో పంపాల్సి ఉంది. దీని కోసం విద్యాశాఖ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించింది. దీనిలో పొందుపరిచిన అంశాల ప్రకారం పాఠశాలలు, విద్యార్థులు, టీచర్ల వివరాలను పంపాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఈ మేరకు క్షేత్రస్థాయి నుంచి ఎంఈఓలు వివరాలను సేకరించడంలో శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా సోమవారం ఉదయం మరో సాఫ్ట్‌వేర్‌ను ఆప్డేట్ చేస్తూ మరికొన్ని అంశాలను కొత్తగా చేర్చారు. దీంతో మొత్తం ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. దీంతో మొత్తం ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. జిల్లాలో మూతపడే, విలీనం అయ్యే పాఠశాలల వివరాలపై పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే సరికి మరో రెండు రోజులు పట్టొచ్చని ఉన్నతాధికారులు గ్రహించి గడువు తేదీని వచ్చే నెల 2 వరకు పొడిగించారు. నిర్లక్ష్యం వీడని ఎంఈఓలు.. హేతుబద్ధీ్దకరణ చేయాలంటే క్షేత్రస్థాయి నుంచి వివరాలు విద్యాశాఖకు అందాల్సి ఉంది. వివరాలు అందించడంలో ఎంఈఓలే కీలకం. గడువు పూర్తయినా ఇంకా సగం మంది వివారాలు ఇవ్వలేదు. రేషనలైజేషన్ జీఓ 29ను అమలు చేస్తే పాఠశాల విద్యా శాఖ జీపీఎస్ ద్వారా గుర్తించిన 516 పాఠశాలలకు సంబంధించిన వివరాలను క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి గడువు తేదీలోపు జిల్లా కేంద్రానికి ఎంఈఓలు ఆన్లైన్లో పంపాల్సి ఉంది. సంబంధిత పాఠశాలల వివరాలు దాదాపు జిల్లాలోని 34 మండలాల్లోనూ ఉన్నాయి. ప్రా««థమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వేర్వేరుగా విద్యార్థులు, టీచర్ల సంఖ్య ఉంటుంది. ఈ వివరాలన్నింటినీ నాలుగు ప్రొఫార్మాల్లో ఎంఈఓలు ఇవ్వాలి. క్షేత్రస్థాయిలో పరిశీలించి, వివరాలిస్తే విద్యాశాఖ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తుంది. మంగళవారం సాయంత్రానికి ఇంకా 15 మండలాల నుంచి వివరాలు రావాల్సి ఉంది. పరిధి మారిస్తే పట్టేస్తారు..! గ్రామంలో పాఠశాలలు మూతబడతాయిని ప్రభుత్వం జారీ చేసిన జీఓ 29 విధి విధానాలను అమలు చేయకుండా ఉద్దేశ పూర్వకంగా తప్పుడు వివరాలు పంపితే ఎంఈఓలపై చర్యలు తప్పవు. ఆయా గ్రామాల్లో ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాల మూత పడకూడదనే ఉద్దేశంతో కిలోమీటర్ల నిడివిని పెంచేలా ఎంఈఓలపై పలువురు ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే విషయాన్ని డీఈఓ ఎస్ అరుణకుమారి వద్ద ప్రస్తావించగా జీపీఎస్ విధానం వల్ల కిలోమీటర్ల పరిధిని పెంచడం కానీ, తగ్గించ డం కానీ వీలుకా దన్నారు. స్కూళ్లు మూతపడకుండా ప్రజాప్రతినిధులు ఎవరైనా ఎంఈఓలపై ఒత్తిడి తెస్తుంటే ఆ సమాచారాన్ని తనకు తెలియజేయాలని ఇప్పటికే వారికి సూచించినట్లు తెలిపారు. హేతుబద్ధీ్దకరణ ఉత్తర్వులపై చర్చ.. 2017 హేతుబద్ధీ్దకరణకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 29ను ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఇది గ్రామీణ ప్రాంతాల ప్రజలపై ప్రభావం చూపిస్తోంది. గ్రామాల్లో ఏ ఇద్దరు వ్యక్తులు కలిసిన మాట్లాడుకున్నా, చివరికి ఇదే ప్రస్తావనతో ముగిస్తున్నారు. ఇక్కడున్న పాఠశాల మూసివేతకు గురైతే తమ పిల్లల భవిష్యత్తు కార్యాచరణ, రాబోవు విద్యా సంవత్సరానికి ఇదే పాఠశాలల్లో కొనసాగించాలా...? బడి మాన్పిం చాలా..? అన్న సందిగ్ధంలో పడ్డారు. నిబంధనలు కచ్చితంగా పాటించి వీలైనంతలో పాఠశాలలు మూతపడకుండా చూడాలని గ్రామస్థులు ఎంఈఓలను కోరుతున్నారు. మూసివేతలో భాగంగా ప్రాథమిక పాఠశాలలకు కిలోమీటరు, ప్రాథమికోన్నత పాఠశాలకు 3 కిలోమీటర్లు, ఉన్నత పాఠశాలకు 5 కిలోమీటర్లు లోపు దూరంలోని పాఠశాలల్లో కలిపేయడం వంటి చర్యలపై అధికారులు చర్చించుకుంటున్నారు. -
టీచర్ల హేతుబద్ధీకరణ ఇప్పట్లో లేనట్టే!
* కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పక్కనపెట్టిన విద్యాశాఖ * వీలైతే సంక్రాంతి నాటికి.. లేదంటే వచ్చే వేసవి సెలవుల్లోనే * డీఎస్సీ నోటిఫికేషన్ కూడా జనవరి నాటికే! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయులు, పాఠశాలల హేతుబద్ధీకరణ దాదాపు నిలిచిపోయింది. ఇప్పట్లో హేతుబద్ధీకరణకు సంబంధించిన ఎలాంటి చర్యలు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. కొత్త జిల్లాల ఏర్పాటు, ఆయా జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు, కార్యాలయాల ఏర్పాటు, సదుపాయాల కల్పన వంటి కార్యక్రమాల్లోనే విద్యాశాఖ బిజీ అయిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇప్పట్లో హేతుబద్ధీకరణ చేపట్టే అవకాశం లేదని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే విద్యార్థులు ఉండీ.. టీచర్లులేని స్కూళ్లకు టీచర్లను ఇవ్వాల్సిన చోట్లలో దాదాపు 10 వేల మంది విద్యా వాలంటీర్లను నియమించిన నేపథ్యంలో వారితోనే ఈ విద్యా సంవత్సరం నెట్టుకురావాలన్న ఆలోచనల్లో అధికారులు ఉన్నారు. విద్యార్థుల్లేని స్కూళ్లలో పని చేస్తున్న టీచర్లను స్థానికంగా విద్యార్థులు ఎక్కువగా ఉన్న స్కూళ్లకు పంపించి బోధన కొనసాగించాలని ఇప్పటికే విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు 10 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో వాటి భర్తీకి జనవరి నాటికి నోటిఫికేషన్ జారీచేసేందుకు చర్యలు చేపడితే జూన్‌లో స్కూళ్లు తెరిచే నాటికి కొత్త టీచర్లను ఇవ్వొచ్చని, ఆలోగా వేసవి సెలవుల్లో హేతుబద్ధీకరణను పూర్తి చేస్తే సరిపోతుందని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. మరో పక్క కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత సంక్రాంతి సెలవుల్లో స్కూళ్ల హేతుబద్ధీకరణ చేస్తే ఎలా ఉంటుందని విద్యాశాఖ ఆలోచిస్తోంది. కానీ సంక్రాంతి సెలవులు తక్కువగా ఉంటాయి. వార్షిక పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. అలాంటపుడు టీచర్ల హేతుబద్ధీకరణపై దృష్టి సారించే అవకాశాలు తక్కువేనని, అదే వేసవి సెలవుల్లో అయితే పక్కాగా చేపట్టవచ్చని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఆ పాఠశాలల సంగతేంటి? రాష్ట్రంలో 405 సున్నా ఎన్రోల్మెంట్ స్కూళ్లు ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు తేల్చింది. కాగా, ఒకటో తరగతిలో ఇంగ్లిష్ మీడియం సెక్షన్లను ప్రారంభించడంతో వాటిలోని 275 స్కూళ్లలో విద్యార్థులు చేరారు. అందు లో 10 మందిలోపే విద్యార్థులు చేరిన పాఠశాలలు ఎక్కువ. ఇపుడు వాటిని ఏం చేయాలన్నదానిపై విద్యాశాఖ ఆలోచిస్తోంది. వీటితోపాటు పది మందిలోపు విద్యార్థులున్నవి మరో 1,200 వరకు పాఠశాలలున్నాయి. వీటిలో సాధ్యమైనన్నింటిని విలీనం చేయాలని, అవసరమైతే ఆ స్కూళ్లలోని విద్యార్థుల్ని వేరే పాఠశాలలకు పంపేం దుకు రవాణా సదుపాయం కల్పించాలని అధికారుల కమిటీ సూచించింది. 19 మందిలోపు విద్యార్థులున్న 2,774 స్కూళ్లను ఏం చేయాలన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక పంపింది. దానిపై ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. -
స్కూళ్ల మూసివేతపై వెనక్కి?
హేతుబద్ధీకరణపై వ్యతిరేకత నేపథ్యంలో టీసర్కార్ యోచన ఉపాధ్యాయుల రేషనలైజేషన్ మాత్రం కొనసాగింపు షెడ్యూల్‌ను కూడా సిద్ధం చేసిన అధికారులు! నేడు మంత్రి సమీక్ష...అనంతరం తుది నిర్ణయం హైదరాబాద్: ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణలో భాగంగా తక్కువ సంఖ్యలో విద్యార్థులున్న పాఠశాలలను మూసివేయాలన్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకునే దిశగా యోచిస్తోంది. ఉపాధ్యాయ సంఘాల తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో.. ఆ నిబంధనను తొలగించి, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపట్టాలని భావిస్తోంది. అధికారులు దీనిపై తాత్కాలిక షెడ్యూల్‌ను కూడా సిద్ధం చేశారు. మంగళవారం ఈ వ్యవహారంపై మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్షించనున్నారు. అనంతరం ఈ షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.రాష్ట్రంలో ఉపాధ్యాయ హేతుబద్ధీకరణలో భాగంగా... 19 మందిలోపు పిల్లలున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను, 75 మందిలోపు పిల్లలున్న ఉన్నత పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇలా విద్యా సంవత్సరం మధ్యలో హేతుబద్ధీకరణ చేపట్టడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వేసవి సెలవుల్లోనే ఈ ప్రక్రియను చేపట్టాలని కోరుతున్నాయి. కొత్త సర్వీసు రూల్స్ ఇవ్వకుండా ఇప్పటికిప్పుడు హేతుబద్ధీకరణ చేపట్టడం సరికాదని వాదిస్తున్నాయి. ఈ అంశాలపై చర్చించేందుకు తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ మంగళవారం (30వ తేదీన) సమావేశమవుతోంది. స్కూళ్ల మూసివేత కారణంగా దాదాపు రెండు లక్షల మంది గ్రామీణ విద్యార్థులు ప్రభుత్వ విద్యకు దూరమవుతారని... పక్క గ్రామాలకు పిల్లలను పంపించలేని తల్లిదండ్రుల వైఖరితో డ్రాపవుట్స్‌గా మిగిలిపోయే అవకాశముందని జేఏసీ పేర్కొంటోంది. ఈ నిర్ణయం వల్ల దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలు నష్టపోయే ప్రమాదం నెలకొంటుందని చెబుతోంది. ఈ నేపథ్యంలో హేతుబద్ధీకరణ ఉత్తర్వులను ఉపసంహరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి కూడా. ఉపాధ్యాయ జేఏసీ కూడా తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. నేడు మంత్రి సమీక్ష.. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ అంశంపై మంగళవారం విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్షించనున్నారు. ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకత నేపథ్యంలో హేతుబద్ధీకరణను తాత్కాలికంగా వాయిదా వేసే అంశంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ప్రక్రియను ఇప్పుడే చేపట్టాలనుకుంటే పాఠశాలల మూసివేత నిబంధనను తొలగించి.. ముందుకు వెళ్లాలనే ఆలోచన అధికారవర్గాల్లో ఉన్నట్లు తెలిసింది. తద్వారా ఉపాధ్యాయ సం ఘాల నుంచే కాకుండా మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని ప్రజల నుంచి పాఠశాలల ను మూసివేశారనే అపవాదు రాకుండా చూసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు విద్యార్థుల సంఖ్య విషయాన్ని పక్కనబెట్టి ప్రాథమిక పాఠశాలలను మాత్రం కొనసాగించే అంశంపైనా చర్చించనున్నారు. హేతుబద్ధీకరణ తరువాత ఎలాగూ అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది కనుక 10 మందిలోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలను అకడమిక్ ఇన్స్ట్రక్టర్లతో కొనసాగించే అంశంపై చర్చించనున్నారు. ఒక్క విద్యార్థి కూడా లేని దాదాపు 350 స్కూళ్లను భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇప్పుడే అధికారికంగా రద్దు చేయకుండా.. అక్కడి టీచర్లను మాత్రం విద్యార్థులున్న స్కూళ్లకు పంపించేలా మార్పులు చేసే అవకాశం ఉంది. మంగళవారం జరిగే సమావేశంలో దీనిపై తుది నిర్ణయం వెలువడనుంది. -
హేతుబద్ధీకరణతో 3 వేల స్కూళ్లకు ముప్పు
మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ హైదరాబాద్: ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ కారణంగా రాష్ట్రంలో మూడువేలకు పైగా ప్రభుత్వస్కూళ్లు మూసివేస్తే గ్రామాల్లోని దాదాపు 2 లక్షల మంది దళిత, గిరిజన, బీసీ వర్గాల విద్యార్థులు బడికి దూరం అవుతారని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. సమీపంలోని స్కూళ్లకు వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడతారని, తద్వారా వారు డ్రాపవుట్స్‌గా మిలిగిపోతారని చెబుతున్నారు. ఆ శాస్త్రీయంగా ఉన్న ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. విద్యాసంవత్సరం నాలుగు నెలలు గడిచాక ఇలా హేతుబద్ధీకరణ చేయడం సరైంది కాదంటున్నాయి. 19 మంది అంతకంటే తక్కువ మంది విద్యార్థులు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను, 75 మంది కంటే తక్కువ మంది ఉన్న ఉన్నత పాఠశాలలను, ఇంగ్లిష్ మీడియం సక్సెస్ స్కూళ్లను మూసివేయాలని హేతుబద్ధీకరణ ఉత్తర్వుల్లో తెలుపడం దారుణమని సంఘాలు పేర్కొంటున్నాయి. వీటిని ఉపసంహరించుకోవాలని పీఆర్టీయూ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఎస్టీయూ అధ్యక్షుడు రాజిరెడ్డి, తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం నేతలు కొండల్‌రెడ్డి, వేణుగోపాల్, రవీందర్, ధమనేశ్వర్‌రావు, మనోహర్‌రావులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాలు సేకరించినమేరకు మూతపడే ప్రమాదం ఉన్న స్కూళ్ల వివరాలు... ► ఆదిలాబాద్ జిల్లాలో 367 స్కూళ్లు మూతపడునున్నాయి. అందులో 300 ప్రాథమిక, 37 ప్రాథమికోన్నత, 30 ఉన్నత పాఠశాలలు మూసివేయనున్నారు. ► నల్లగొండలో 350 స్కూళ్లు మూతపడను న్నాయి. అందులో 100 ఉన్నత, 200 ప్రాథమిక, 50 ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. ► కరీంనగర్లో 692 స్కూళ్లు మూతపడే ప్రమాదం నెలకొంది. ఇందులో 447 ప్రాథమిక, 110 ప్రాథమికోన్నత, 27 ఉన్నత పాఠశాలలున్నాయి. అలాగే 108 ఇంగ్లిష్ మీడియం సక్సెస్ స్కూళ్లు మూత పడనున్నాయి. ► రంగారెడ్డిలో 226 స్కూళ్లకు ప్రమాదమే. ఇందులో 105 ప్రాథమిక, 56 ప్రాథమికోన్నత, 65 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ► హైదరాబాబాద్‌లో 20 ఉన్నత పాఠశాలలు, 15 వరకు ప్రాథమిక పాఠశాలలకు మూసివేసే ప్రమాదం. ► మహబూబ్‌నగర్‌లో 315 స్కూళ్లు మూత పడనున్నాయి. అందులో 300 ప్రాథమిక, ప్రా థమికోన్నత, 15 ఉన్నత పాఠశాలలున్నాయి. ► వరంగల్‌లో 658 స్కూళ్లు మూత పడనున్నాయి. 496 ప్రాథమిక, 151 ప్రాథమికోన్నత , 18 ఉన్నత పాఠశాలలు, 3 గిరిజన సంక్షేమ పాఠశాలలున్నాయి. పదిజిల్లాల్లో మొత్తం 3,103 పాఠశాలలకు ముప్పుంది. ► ఖమ్మంలో 145 స్కూళ్లకు మూసివేత ముప్పుంది. ఇందులో 20 ఉన్నత, 25 ప్రాథమికోన్నత, 100 ప్రాథమిక పాఠశాలలున్నాయి. ► నిజమాబాద్‌లో 350కి పైగా స్కూళ్లు మూతపడే అవకాశం ఉంది. ఇందులో 40 ఉన్నత పా ఠశాలలు, 100 ప్రాథమికోన్నత పాఠశాలలు, 100 ప్రాథమిక పాఠశాలలుండగా, మిగిలినవి ఉర్దూ మీడియం స్కూళ్లున్నాయి. ► మెదక్ జిల్లాలో 280 వరకు పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉంది.