టీచర్ల హేతుబద్ధీకరణ ఇప్పట్లో లేనట్టే!
* కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పక్కనపెట్టిన విద్యాశాఖ
* వీలైతే సంక్రాంతి నాటికి.. లేదంటే వచ్చే వేసవి సెలవుల్లోనే
* డీఎస్సీ నోటిఫికేషన్ కూడా జనవరి నాటికే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయులు, పాఠశాలల హేతుబద్ధీకరణ దాదాపు నిలిచిపోయింది. ఇప్పట్లో హేతుబద్ధీకరణకు సంబంధించిన ఎలాంటి చర్యలు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. కొత్త జిల్లాల ఏర్పాటు, ఆయా జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు, కార్యాలయాల ఏర్పాటు, సదుపాయాల కల్పన వంటి కార్యక్రమాల్లోనే విద్యాశాఖ బిజీ అయిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇప్పట్లో హేతుబద్ధీకరణ చేపట్టే అవకాశం లేదని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇప్పటికే విద్యార్థులు ఉండీ.. టీచర్లులేని స్కూళ్లకు టీచర్లను ఇవ్వాల్సిన చోట్లలో దాదాపు 10 వేల మంది విద్యా వాలంటీర్లను నియమించిన నేపథ్యంలో వారితోనే ఈ విద్యా సంవత్సరం నెట్టుకురావాలన్న ఆలోచనల్లో అధికారులు ఉన్నారు. విద్యార్థుల్లేని స్కూళ్లలో పని చేస్తున్న టీచర్లను స్థానికంగా విద్యార్థులు ఎక్కువగా ఉన్న స్కూళ్లకు పంపించి బోధన కొనసాగించాలని ఇప్పటికే విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు 10 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో వాటి భర్తీకి జనవరి నాటికి నోటిఫికేషన్ జారీచేసేందుకు చర్యలు చేపడితే జూన్‌లో స్కూళ్లు తెరిచే నాటికి కొత్త టీచర్లను ఇవ్వొచ్చని, ఆలోగా వేసవి సెలవుల్లో హేతుబద్ధీకరణను పూర్తి చేస్తే సరిపోతుందని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి.
మరో పక్క కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత సంక్రాంతి సెలవుల్లో స్కూళ్ల హేతుబద్ధీకరణ చేస్తే ఎలా ఉంటుందని విద్యాశాఖ ఆలోచిస్తోంది. కానీ సంక్రాంతి సెలవులు తక్కువగా ఉంటాయి. వార్షిక పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. అలాంటపుడు టీచర్ల హేతుబద్ధీకరణపై దృష్టి సారించే అవకాశాలు తక్కువేనని, అదే వేసవి సెలవుల్లో అయితే పక్కాగా చేపట్టవచ్చని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
ఆ పాఠశాలల సంగతేంటి?
రాష్ట్రంలో 405 సున్నా ఎన్‌రోల్‌మెంట్ స్కూళ్లు ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు తేల్చింది. కాగా, ఒకటో తరగతిలో ఇంగ్లిష్ మీడియం సెక్షన్లను ప్రారంభించడంతో వాటిలోని 275 స్కూళ్లలో విద్యార్థులు చేరారు. అందు లో 10 మందిలోపే విద్యార్థులు చేరిన పాఠశాలలు ఎక్కువ. ఇపుడు వాటిని ఏం చేయాలన్నదానిపై విద్యాశాఖ ఆలోచిస్తోంది. వీటితోపాటు పది మందిలోపు విద్యార్థులున్నవి మరో 1,200 వరకు పాఠశాలలున్నాయి. వీటిలో సాధ్యమైనన్నింటిని విలీనం చేయాలని, అవసరమైతే ఆ స్కూళ్లలోని విద్యార్థుల్ని వేరే పాఠశాలలకు పంపేం దుకు రవాణా సదుపాయం కల్పించాలని అధికారుల కమిటీ సూచించింది.
19 మందిలోపు విద్యార్థులున్న 2,774 స్కూళ్లను ఏం చేయాలన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక పంపింది. దానిపై ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.