ఒక్కోసారి ఒక్కో లెక్క!
పాఠశాలలు, టీచర్ల సంఖ్యపై భిన్న లెక్కలు స్పష్టత అవసరమన్న ఎన్‌సీఈఆర్‌టీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలలు, టీచర్లు, అదనపు అవసరాలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఒక్కోసారి ఒక్కో రకమైన లెక్కలు చెబుతోంది. ఒకే విద్యా సంవత్సరానికి సంబంధించి లెక్కలు అడిగినపుడు జిల్లాల అధికారులు అడిగిన ప్రతిసారి లెక్కలు మార్చేస్తుండటం సమస్యగా మారింది. అసలు క్షేత్రస్థాయిలో కచ్చితంగా ఎన్ని ప్రభుత్వ పాఠశాలల ఉన్నాయి.. ఎంత మంది టీచర్లు పని చేస్తున్నారు.. ఎంత మంది విద్యార్థులు ఉన్నారనే విషయంలో లెక్కలు మారిపోతుండటం కొంత గందరగోళానికి కారణం అవుతోంది. దేశ వ్యాప్తంగా పాఠశాలల మానిటరింగ్‌లో భాగంగా 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి జాతీయ విద్యా శిక్షణ, పరిశోధన మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) లెక్కలు అడిగినపుడు ఒక్కో రకమైన లెక్కలు ఇవ్వడంతో ఇదేంటని పేర్కొంటూ వివరాలపై స్పష్టత అవసరమని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 29,315 పాఠశాలలు ఉన్నట్లు ఎలిమెంటరీ విద్యలో నాణ్యత ప్రమాణాల విశ్లేషణకు పంపిన నివేదికలో పేర్కొంది.
కానీ సవివరంగా ఇచ్చిన స్టేట్ మానిటరింగ్ ఫార్మాట్‌లో (ఎస్‌టీఎంఎఫ్) మాత్రం 28,562 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నట్లు వెల్లడించింది. ఇందులో ఏ లెక్కలు సరైనవన్న విషయంలో గందరగోళం నెలకొంది. మరోవైపు ఎలిమెంటరీ విద్యలో నాణ్యత ప్రమాణాల విశ్లేషణ నివేదికలో... స్కూల్ మానిటరింగ్ ఫార్మాట్ ప్రకారం సమాచారం ఇచ్చిన పాఠశాలలు 27,669 అని ఒకసారి వెల్లడించగా, రెండో త్రైమాసికం, నాలుగో త్రైమాసికంలో ఆ లెక్కలు మారిపోయాయి. అలాగే అదనపు టీచర్ పోస్టుల అవసరాల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎస్‌టీఎంఎఫ్‌లో ఇచ్చిన లెక్కల ప్రకారం ప్రాథమిక పాఠశాలలకు 6,867 మంది, ప్రాథమికోన్నత పాఠశాలలకు 3,078 పోస్టులు మొత్తంగా 9,945 పోస్టులు అవసరమని పేర్కొంది.
అదే సవివరంగా ఇచ్చిన లెక్కల్లో మాత్రం ఆ సంఖ్య మారిపోయింది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో 46,006 మంది టీచర్లు ఉన్నారని, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 16,383 మంది టీచర్లు (62,389) ఉన్నారని పేర్కొంది. కానీ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో 54,028 పోస్టులు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 19,544 పోస్టులు (మొత్తంగా 73,572) ఉండాలని పేర్కొంది. అంటే అదనంగా 11,183 పోస్టులు అవసరమని పేర్కొంది. ఇలా ఒక్కోసారి ఒక్కో రకమైన లెక్కలు ఇస్తుండటం ప్రణాళికల రూపకల్పనకు సమస్యగా మారుతోందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.