స్కూళ్ల మూసివేతపై వెనక్కి?
హేతుబద్ధీకరణపై వ్యతిరేకత
నేపథ్యంలో టీసర్కార్ యోచన
ఉపాధ్యాయుల రేషనలైజేషన్ మాత్రం కొనసాగింపు
షెడ్యూల్‌ను కూడా సిద్ధం చేసిన అధికారులు!
నేడు మంత్రి సమీక్ష...అనంతరం తుది నిర్ణయం
హైదరాబాద్: ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణలో భాగంగా తక్కువ సంఖ్యలో విద్యార్థులున్న పాఠశాలలను మూసివేయాలన్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకునే దిశగా యోచిస్తోంది. ఉపాధ్యాయ సంఘాల తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో.. ఆ నిబంధనను తొలగించి, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపట్టాలని భావిస్తోంది. అధికారులు దీనిపై తాత్కాలిక షెడ్యూల్‌ను కూడా సిద్ధం చేశారు. మంగళవారం ఈ వ్యవహారంపై మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్షించనున్నారు. అనంతరం ఈ షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.రాష్ట్రంలో ఉపాధ్యాయ హేతుబద్ధీకరణలో భాగంగా... 19 మందిలోపు పిల్లలున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను, 75 మందిలోపు పిల్లలున్న ఉన్నత పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇలా విద్యా సంవత్సరం మధ్యలో హేతుబద్ధీకరణ చేపట్టడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వేసవి సెలవుల్లోనే ఈ ప్రక్రియను చేపట్టాలని కోరుతున్నాయి. కొత్త సర్వీసు రూల్స్ ఇవ్వకుండా ఇప్పటికిప్పుడు హేతుబద్ధీకరణ చేపట్టడం సరికాదని వాదిస్తున్నాయి. ఈ అంశాలపై చర్చించేందుకు తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ మంగళవారం (30వ తేదీన) సమావేశమవుతోంది. స్కూళ్ల మూసివేత కారణంగా దాదాపు రెండు లక్షల మంది గ్రామీణ విద్యార్థులు ప్రభుత్వ విద్యకు దూరమవుతారని... పక్క గ్రామాలకు పిల్లలను పంపించలేని తల్లిదండ్రుల వైఖరితో డ్రాపవుట్స్‌గా మిగిలిపోయే అవకాశముందని జేఏసీ పేర్కొంటోంది. ఈ నిర్ణయం వల్ల దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలు నష్టపోయే ప్రమాదం నెలకొంటుందని చెబుతోంది. ఈ నేపథ్యంలో హేతుబద్ధీకరణ ఉత్తర్వులను ఉపసంహరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి కూడా. ఉపాధ్యాయ జేఏసీ కూడా తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.
నేడు మంత్రి సమీక్ష..
ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ అంశంపై మంగళవారం విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్షించనున్నారు. ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకత నేపథ్యంలో హేతుబద్ధీకరణను తాత్కాలికంగా వాయిదా వేసే అంశంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ప్రక్రియను ఇప్పుడే చేపట్టాలనుకుంటే పాఠశాలల మూసివేత నిబంధనను తొలగించి.. ముందుకు వెళ్లాలనే ఆలోచన అధికారవర్గాల్లో ఉన్నట్లు తెలిసింది. తద్వారా ఉపాధ్యాయ సం ఘాల నుంచే కాకుండా మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని ప్రజల నుంచి పాఠశాలల ను మూసివేశారనే అపవాదు రాకుండా చూసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు విద్యార్థుల సంఖ్య విషయాన్ని పక్కనబెట్టి ప్రాథమిక పాఠశాలలను మాత్రం కొనసాగించే అంశంపైనా చర్చించనున్నారు. హేతుబద్ధీకరణ తరువాత ఎలాగూ అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది కనుక 10 మందిలోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలను అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లతో కొనసాగించే అంశంపై చర్చించనున్నారు. ఒక్క విద్యార్థి కూడా లేని దాదాపు 350 స్కూళ్లను భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇప్పుడే అధికారికంగా రద్దు చేయకుండా.. అక్కడి టీచర్లను మాత్రం విద్యార్థులున్న స్కూళ్లకు పంపించేలా మార్పులు చేసే అవకాశం ఉంది. మంగళవారం జరిగే సమావేశంలో దీనిపై తుది నిర్ణయం వెలువడనుంది.