Minister Jagdish Reddy
-
నేడు సూర్యాపేటకు సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం జిల్లా కేంద్రం సూర్యా పేటలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయ సముదాయం, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కళాశాల, వెజ్, నాన్ వెజ్ మార్కెట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనాలను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను జిల్లాకు తీసుకొచ్చినందున ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నా రు. ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో 100 ఎకరాల్లో పెద్ద ఎత్తున సభకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11:15 గంటలకు సీఎం కేసీఆర్ సూర్యాపేట పట్టణ కేంద్రానికి చేరుకొని, సాయంత్రం 4:50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. జాతీయ రహదారిపై నేడు వాహనాల మళ్లింపు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ బహిరంగసభ నేపథ్యంలో వాహనాలను దారి మళ్లిస్తు న్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి వద్ద నల్లగొండ వైపు మళ్లిస్తారు. ఖమ్మం వెళ్లే వాహనాలను టేకుమట్ల నుంచి ఖమ్మం రహదారి మీదుగా మళ్లించనున్నారు. విజయవాడ నుంచి హైదరాబా ద్ వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్నగర్, మి ర్యాలగూడ మీదుగా నార్కట్‌పల్లి వైపు మళ్లిస్తారు. -
ప్రపంచాన్ని పరిచయం చేసేది నాన్నే
‘ప్రపంచాన్ని మనకు పరిచయం చేసేది నాన్నే’ అని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఫాదర్స్‌డేను పురస్కరించుకుని ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘మన జీవితం అమ్మది.. జీవనం నాన్నది’ అని చెప్పారు. ‘మా నాన్న రామచంద్రారెడ్డి ఉపాధ్యాయుడు కావడంతో చిన్నతనం నుంచే నాకు నాయకత్వ లక్షణాలునేర్పారు’ అని పేర్కొన్నారు. నాన్న ఎప్పుడూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని.. ఉన్నతంగా బతకాలని చెప్పేవారని తెలిపారు. ఆయన చూపిన బాటలో తాను నడుస్తున్నానని.. రాజకీయంగా కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్నానని చెప్పారు. -
అవాక్కయ్యే ఘటన.. ‘జయహో జగదీష్‌రెడ్డి’.. జిల్లా పోలీస్ బాస్ అత్యుత్సాహం
సాక్షి, సూర్యాపేట జిల్లా: సూర్యాపేటలో జరిగిన వజ్రోత్సవ వేడుకల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సాక్షాత్తూ ఒక జిల్లా ఎస్పీనే అత్యుత్సాహం ప్రదర్శించారు. వజ్రోత్సవాల్లో ఏర్పాటు చేసిన సభలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్.. ‘జయహో జగదీష్‌రెడ్డి’ అంటూ నినాదాలు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జాతీయ వజ్రోత్సవాల్లో మంత్రి జగదీష్‌రెడ్డి, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చదవండి: నిజాం నిరంకుశత్వంపై నినదించిన ‘మా భూమి’ ఎస్పీ.. ‘‘జయహో జగదీష్‌రెడ్డి’’ అంటూ నినాదాలు చేయడంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వేదిక ముందున్నవారితో కూడా ఎస్సీ.. ‘జయహో జగదీషన్న’ అంటూ నినాదాలు చేయించారు. జిల్లా పోలీస్ బాస్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీఆర్ఎస్ నేత మాట్లాడినట్లుగా ఎస్పీ ప్రసంగం ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. -
‘గులాబీ’ పార్టీలో కలవరం అందుకేనా?.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?
సాక్షి, నల్గొండ/సూర్యాపేట: మంత్రి జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే సూర్యాపేట సెగ్మెంట్లో వచ్చేసారి తీర్పు ఎలా ఉండబోతోంది? ప్రతిపక్షమే లేని జిల్లాలో గులాబీ పార్టీ మళ్లి ఏకఛత్రాధిపత్యం వహిస్తుందా? కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి ఎలా ఉంది? యాదాద్రి, భువనగిరి జిల్లాలో మూడు పార్టీలు ఏమంటున్నాయి? చదవండి: కాంగ్రెస్‌లో సీనియర్లు, పెద్దలు అంతా అక్కడే.. భీకర పోరు తప్పదా? ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్లో వర్గపోరు లేని ఏకైక నియోజకవర్గం సూర్యాపేట. రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి నియోజకవర్గం కావడంతో ముఠాలు కట్టి వర్గాలుగా విడిపోయే ధైర్యం ఎవరూ చేయడం లేదు. అయితే గత రెండు ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో గెలవడం టీఆర్ఎస్ను కలవరపెడుతోంది. దీనికి తోడు కొంతమంది అనుచరులు మంత్రికి తలనొప్పులు తీసుకొస్తున్నారనే టాక్ కూడా ఉంది. ఈసారి అక్కడ జరిగిన అభివృద్ధి పనులను చూపిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని ఆ పార్టీ ఆలోచిస్తోంది. స్థానికంగా మెడికల్ కాలేజీ నిర్మాణం, రోడ్ల వెడల్పు, కొత్త కలెక్టరేట్ నిర్మాణం గులాబీ పార్టీకి పాజిటీవ్‌గా మారే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్‌లో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, రేవంత్ అనుచరుడు పటేల్ రమేష్‌రెడ్డి మధ్య నువ్వానేనా అన్నట్లు పరిస్థితి తయారైంది. ఇక్కడ పార్టీ పిలుపునిచ్చే ఏ కార్యక్రమాన్ని జాయింట్‌గా నిర్వహించడం లేదు. గత ఎన్నికల్లో ఈ వర్గపోరే పార్టీని దెబ్బతీసింది. మరోసారి అలాంటి పరిస్థితులు రాకుండా చూడాల్సిన రేవంతే తన శిష్యుడిని దామోదర్‌రెడ్డికి వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ రాకున్నా ఇండిపెండెంట్‌గా పోటీ చేయడం పక్కా అని తెలుస్తోంది. బీజేపీలో మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావుకు వర్గపోరు లేకున్నా నోటి దురుసుతనమే ఆయనకు మైనస్‌గా మారుతోంది. కోదాడలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఎదురు చూస్తున్నారు. మరోసారి తన భార్యను నిలబెట్టి గెలిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం కుటుంబంలో ఒకరికే టికెట్ అని ప్రకటించిన నేపథ్యంలో టికెట్ రాకపోతే పరిస్థితి ఏంటనేది స్పష్టత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ వర్గంగా ముద్రపడిన పందిరి నాగిరెడ్డి తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. టీఆర్ఎస్ సిటింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కి వర్గపోరు పెద్ద తలనొప్పిగా తయారైంది. పైగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కేటీఆర్, హరీష్‌రావుకు దగ్గర అని చెప్పుకునే జలగం సుధీర్, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు కుటుంబం నుంచి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో బీజేపీ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది అన్న చందంలా తయారు అయింది పరిస్థితి. హుజూర్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ యుద్ధం మధ్య తారాస్థాయికి చేరింది. గతంలో జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచే పోటీ చేస్తానని ఉత్తమ్ ప్రకటించడంతో రాజకీయ వేడి పెరిగిపోయింది. టీఆర్ఎస్లో టికెట్ అడిగే స్థాయిలో వర్గపోరు లేకున్నా కొందరు ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు అనుచరులపై వస్తున్న అవినీతి ఆరోపణలు కూడా ఎమ్మెల్యేకు కొంత ఇబ్బందిగా మారిందంట. అయితే ఇవేవి తనను అడ్డుకోలేవన్న ధీమాతో ప్రస్తుత ఎమ్మెల్యే సైదిరెడ్డి ఉన్నారు. బీజేపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఒకప్పుడు కాంగ్రెస్‌కి పోటీగా నిలబడాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబడతారో తెలియని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తీవ్రంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అద్దంకి దయాకర్‌తో పాటు మరో ఇద్దరు తెరపైకి వచ్చారు. వడ్డేపల్లి రవిని పార్టీలో చేర్చుకోవడాన్ని రాంరెడ్డి దామోదర్‌రెడ్డితో పాటు అద్దంకి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు రెండుసార్లు ఓడిపోయిన అద్దంకికి కాకుండా మరో నేతకు టికెట్ ఇవ్వాలని దామోదర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన గ్యాదరి కిషోర్ హ్యాట్రిక్ సాధించాలని ఆశిస్తున్నారు. అయితే మందుల శ్యామ్యూల్ ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారంట. రెండు సార్లు టికెట్ త్యాగం చేశానని ఈసారి తనను దృష్టిలో పెట్టుకోవాలని అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఇక ఇక్కడ బీజేపీకి సరైన అభ్యర్థి లేరు. ఇతర పార్టీల నుంచి ఎవరైనా గట్టి నేత వస్తే పోటీకి నిలపాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. భువనగిరి నుంచి గత రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పైళ్ల శేఖర్ రెడ్డి విజయం సాధిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి జెండా ఎగరేయాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. కానీ ఆయన ఆశలకు చింతల వెంకటేశ్వర రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అడ్డుతగిలే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి భువనగిరి నుంచి పోటీ చేసేది తామే అని బహిరంగంగా ప్రకటించుకుంటున్నారని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి లాంటి సంపన్న నేత ఉన్నప్పటికీ కోలుకోలేకపోతోంది. పార్టీలో ముఠా తగాదాలే దీనికి కారణం. క్యాడర్ పటిష్టంగా ఉన్నా నేతల కొట్లాటలతో పార్టీని దెబ్బ తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో భువనగిరి ఒకటి. ఇక్కడి నుంచి పోటీకి చాలామంది నేతలు సిద్ధంగా ఉన్నారు. జిట్టా బాలకృష్ణరెడ్డి, పీవీ శ్యాంసుందర్, గూడూరు నారాయణ రెడ్డి, పడమటి జగన్మోహన్రెడ్డి లిస్టులో ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు సెగ్మెంట్ రాజకీయం అస్తవ్యస్తంగా మారిందా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు సార్లు టీఆర్ఎస్ విజయం సాధించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగడి సునీత ఈ సారి తన భర్తకు అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని కోరినట్లు ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహ్ములు కూడా టీఆర్ఎస్లో చేరడంతో సునీతకు తలనొప్పిగా మారింది. అసంతృప్తులు అంతా నర్సింహ్ములు వర్గంలో చేరిపోయారు. దీంతో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. అయితే ఇక్కడి నుంచి కేసీఆర్ పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం ఇద్దరు నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇక కాంగ్రెస్‌లో క్యాడర్ కంటే లీడర్ల సంఖ్యే ఎక్కువగా ఉందని జోకులు వేసుకుని నవ్వుకునే పరిస్థితి వచ్చింది. బీజేపీలో వర్గపోరు లేనప్పటికీ కొద్ది రోజుల క్రితం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య అసలైన బీజేపీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చదవండి: మునుగోడు బరిలోకి వైఎస్సార్టీపీ! -
స్లాబు ప్రకారమే విద్యుత్ బిల్లులు: జగదీష్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లలో ఉండటంతో విద్యుత్ వినియోగం పెరిగిందని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్లాబుల్లో ఉన్న విధంగా బిల్లులు వస్తున్నాయని.. వాడిన దాని కంటే ఎక్కువ బిల్లులు ఎక్కడా రాలేదని జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి ఏడాది సాధారణంగా వేసవిలో 35-40 శాతం వరకు విద్యుత్ వాడకం పెరుగుతుందని, లాక్డౌన్ కారణంగా 10-15 శాతం పెరిగిందని వివరించారు. గతంలో కంటే ఎక్కువగా బిల్లు వచ్చిందన అనుమానం ప్రజల్లో ఉందని.. కానీ వాడిన దానికంటే ఎక్కువ బిల్లు రాలేదన్నారు. తుంగతుర్తి, హుజూర్నగర్ ఎమ్మెల్యేలు కూడా బిల్లులు ఎక్కువ వచ్చాయని తన దృష్టికి తీసుకొచ్చారని, కానీ వారు వాడుకున్న మేరకే బిల్లులు వచ్చాయని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. -
జానా బాబా 40 దొంగలు
-
జానా బాబా 40 దొంగలు
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ‘ఆలీబాబా 40 దొంగలు అన్నట్లు జానాబాబా 40 దొంగలుగా కాంగ్రెస్ నేతలు సిగ్గు, ఎగ్గు లేకుండా బస్సు యాత్ర చేస్తున్నారు. యాత్ర చేస్తున్న వారందరిపై కేసులున్నాయి.’అని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా పర్యటనలో భాగంగా నూతనకల్ మండలం చిల్పకుంట్లలో రూ.143 కోట్లతో నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్‌కు ఆయన ప్రారంభోత్సవం చేసి 175 గ్రామాలకు మంచి నీటిని విడుదల చేశారు. అనంతరం మద్దిరాల క్రాస్‌రోడ్డులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకుల్లో ఒకరు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికితే, ఇంకొకరు ఎన్నికల సమయంలో కోదాడలో రూ.3 కోట్లతో దొరికిపోయారని, మరికొంత మంది సీబీఐ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. ఒక్కరూ నోరు మెదపలేదు.. 55 ఏళ్లుగా కాంగ్రెస్ .. దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిందని, ఇన్నాళ్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వారు ఏం చేశారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. గోదావరి, కృష్ణా జలాలు వస్తే ఫ్లోరోసిస్ వ్యాధితో 2లక్షల మంది చితికిపోయేవారా అని ప్రశ్నించారు. 15 ఏళ్లు మంత్రిగా ఉన్న జానారెడ్డి దేవరకొండ, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో ఫ్లోరోసిస్‌తో ప్రజలు పడుతున్న బాధలు గుర్తుకురాలేదా, నాటి సీఎంల వద్ద జానా, ఉత్తమ్‌లు ఎందుకు యుద్ధం చేయలేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఫ్లోరోసిస్‌పై ఏ ఒక్కరైనా శాసన సభలో నోరు మెదపలేదని విమర్శించారు. నిండు శాసనసభలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ జిల్లాలకు నిధులు ఇవ్వనని అసెంబ్లీలో చెప్పినా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలేదని మండిపడ్డారు. ఒక చిత్తూరు జిల్లాకే తాగునీటి అవసరాల కోసం రూ.9 వేల కోట్ల రూపాయలు తన్నుకుపోతుంటే ఈ కాంగ్రెస్ నాయకులు నిలదీయలేదని విమర్శించారు. 45 ఏళ్ల క్రితం పండిట్ జవహర్లాల్ నెహ్రూ శ్రీరాం సాగర్‌కు శంకుస్థాపన చేస్తే ఇప్పటి వరకు ఆ కాలువల్లో నీరెందుకు రాలేదని ప్రశ్నించారు. శ్రీరాంసాగర్ జలాలతో నియోజక వర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందించేందుకు రెండు(వెంపటి, రుద్రమదేవి చెరువులను) రిజర్వాయర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని కేటీఆర్ తెలిపారు. అలాగే తుంగతుర్తిలో యువతకు ఉపాధి కల్పించేలా ఇక్కడికి పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసే బాధ్యత తనదే అని హామీ ఇచ్చారు. విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన ఈ 36 నెలల కాలంలో రూ.30వేల కోట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వచ్చాయని, ఈ నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సభలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ పదవుల కోసం లక్షలు ఖర్చు పెట్టుకున్నారు
సాధారణ ఎన్నికల్లా.. టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలు: జగదీశ్‌రెడ్డి హన్మకొండ: టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలు సాధారణ ఎన్నికల్లా జరిగాయని, గ్రామ కమిటీ అధ్యక్షుల పదవులకు పోటీ పెరిగిందనీ, ఇందుకోసం రూ.లక్షల్లో ఖర్చు పెట్టుకున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం హన్మకొండలో జరిగిన పార్టీ కమిటీల ఎన్నికల్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా తక్కెళ్లపల్లి రవీందర్రావు, గ్రేటర్ వరంగల్ పార్టీ అధ్యక్షుడిగా నన్నపునేని నరేందర్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు జగదీశ్‌రెడ్డి పరిశీలకుడిగా హాజరై మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలతో టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో అదరణ పెరిగిందన్నారు. దీంతో దేశంలోనే ఏ పార్టీకి రాని స్పందన టీఆర్ఎస్ చేపట్టిన సభ్యత్వ నమోదుకు వచ్చిందన్నారు. తెలంగాణ ఏర్పాటైతే పాలించే నాయకులు లేరని ఎగతాళి చేయబడిన మన రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో ముందంజలో ఉందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ కూడాకేసీఆర్‌ను అభినందించారన్నారు. మొదటి తారీకు వచ్చిందంటే ఏపీ సీఎం చంద్రబాబుకు వణుకు పుడుతుందని విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కేంద్రం వైపు చూస్తున్నారన్నారు. ఆంధ్రోళ్లు చేసిన పాపానికి విద్యుత్ కష్టాలు వస్తే, తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరం పూర్తికాక ముందే సీఎం కేసీఆర్ విద్యుత్ సమస్య లేకుండా చేశారనీ, అవినీతి రహిత పాలన అందిస్తున్నారన్నారు. డిప్యూటీ ఈవో పోస్టుల భర్తీకి ఉత్తర్వులు హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డిప్యూటీఈఓ) పోస్టుల భర్తీకి ప్రభుత్వం గురువారం ఉత్తర్వులిచ్చింది. 2013లో ట్రిబ్యునల్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఈ పోస్టులను (పూర్తి అదనపు బాధ్యతలతో) భర్తీ చేయాలని ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి టి. విజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 56 ఉప విద్యాధికారి పోస్టుల్లో 46 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులకే పోస్టులు: జీటీఏ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఉప విద్యాధికారి పోస్టులను ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులతోనే భర్తీ చేయాలని ప్రభుత్వ టీచర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విశ్వనాథ్‌గుప్తా, సురేందర్, మామిడోజు వీరాచారి కోరారు. ఆగ్రోస్ ఎండీగా వీరబ్రహ్మయ్య హైదరాబాద్: ఆగ్రోస్ సంస్థ ఎండీగా ఎం.వీరబ్రహ్మయ్యను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన ఆయిల్‌ఫెడ్‌కు ఎండీగా, సీడ్ కార్పొరేషన్‌కు పూర్తి అదనపు బాధ్యతలతో ఎండీగా వ్యవహరించనున్నారని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులు ఈ నెల 13వ తేదీ నుంచే వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు. వీరబ్రహ్మయ్య ఇప్పటివరకు జీహెచ్ఎంసీ ప్రత్యేక కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు కరీంనగర్ కలెక్టర్‌గా కూడా పనిచేశారు. -
టీఆర్ఎస్లోకి నల్లగొండ వైస్ చైర్మన్, ఐదుగురు కౌన్సిలర్లు
నల్లగొండ టూటౌన్: నల్లగొండ మున్సిపల్ రాజకీయం రసకందాయంలో పడింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డితో పాటు ఐదుగురు కౌన్సిలర్లు బుధవారం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ దుబ్బాక నర్సింహారెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ వెళ్లి వీరు మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో వైస్ చైర్మన్‌తో పాటు కౌన్సిలర్లు ఎండీ.ఖయ్యూంబేగ్, ఆంగోతు ప్రదీప్‌నాయక్, బొంత రేణుకా శ్రీనివాస్, అబ్బగోని రమేశ్, షాహీన్ తఖీ ఉన్నారు. కాగా ముగ్గురు మహిళా కౌన్సిలర్ల తరఫున వాళ్ల పతులు చేరారు. మరో నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా కారు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే ప్రస్తుతం ఊగిసలాటలో ఉన్న వీరు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే మున్సిపాలిటీలో టీఆర్ఎస్ బలం మరింత పెరగనుంది. ప్రస్తుతం కౌన్సిలర్ల సంఖ్య 10కి చేరింది. కాంగ్రెస్ హస్తగతమైన మున్సిపల్ పీఠాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు అధికారపార్టీ చాపకింది నీరులా పావులు కదుపుతోంది. దానిలో భాగంగానే కాంగ్రెస్ కౌన్సిలర్లను తన పార్టీలో చేర్చుకుంటుంది. ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం జీఓ తీసుకువస్తే పురపీఠం హస్తం చేజారీ కారు చేతిలోకి వెళ్లే అవకాశం ఉంది. కొంపముంచిన అసమ్మతి మున్సిపాలిటీలో అన్ని పార్టీలకన్నా కాంగ్రెస్ పార్టీ 22 స్థానాలను గెలుపొందినా ఆ పార్టీలో నెలకొన్న అసమ్మతి కొంపముంచింది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలతో దాదాపు 10మంది కౌన్సిలర్లు తీవ్ర అసంతృప్తికి గురయ్యారనే ప్రచారం జరిగింది. మున్సిపాల్టీకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా చైర్పర్సన్ తమను ఏ మాత్రం సంప్రదించలేదని కొన్ని నెలలు గుర్రుగా ఉన్నారు. చైర్పర్సన్ భర్త వ్యవహరించిన తీరు కూడా తమను అవమానించేలా ఉందని పలువురు సభ్యులు వారి సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలి సింది. ఈ విషయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఆమెకే మద్దతుగా పలికారని అసమ్మతి కౌన్సిలర్లు కాంగ్రెస్ ముఖ్య నాయకుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. రసకందాయంలో రాజకీయం... కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో మున్సిపల్ రాజకీయం రసకందాయంలో పడింది. వరుసగా మూడు పర్యాయాలు మున్సిపల్‌పై కాంగ్రెస్ జెండా ఎగిరింది. కానీ ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మున్సిపాలిటీని గులాబి పరం చేసేందుకు ఆ పార్టీ ముఖ్య నాయకుడు వ్యూహాత్మాకంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపాల్టీలో మొత్తం 40 వార్డులు ఉండగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 22, టీఆర్ఎస్ 2, బీజేపీ 4, సీపీఎం 2, టీడీపీ 4, ఎంఐఎం 3, స్వతంత్రులు 3 చొప్పున గెలిచారు. వీరిలో ఇద్దరు కౌన్సిలర్లు టీఆర్ఎస్లోగా చేరగా మరో స్వతంత్ర కౌన్సిలర్ తటస్థంగా ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి గెలిచిన 22 మంది కౌన్సిలర్లలో ఆరుగురు కారెక్కడంతో కాంగ్రెస్ బలం 16కు తగ్గిపోయింది. టీఆర్ఎస్ పార్టీ బలం 10కి చేరుకుంది. జీఓ తీసుకొస్తే చేజారనున్న చైర్మన్ పదవి మున్సిపల్ చైర్మన్ పదవిలో కొనసాగే వారిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే నాలుగేళ్ల పదవీ కాలం పూర్తికావాలి. గతంలో రెండేళ్లకే అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉండగా దానిని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నాలుగేళ్లకు పొడిగించారు. అయితే అవిశ్వాస తీర్మానం ఒక సంవత్సరానికే పెట్టే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం జీఓ తెచ్చే అవకాశం ఉన్నట్లు కొద్ది రోజలుగా ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే కనుక నల్లగొండ మున్సిపల్ చైర్మన్ పదవి హస్తం నుంచి చేజారే అవకాశం లేకపోలేదు. -
స్కూళ్ల మూసివేతపై వెనక్కి?
హేతుబద్ధీకరణపై వ్యతిరేకత నేపథ్యంలో టీసర్కార్ యోచన ఉపాధ్యాయుల రేషనలైజేషన్ మాత్రం కొనసాగింపు షెడ్యూల్‌ను కూడా సిద్ధం చేసిన అధికారులు! నేడు మంత్రి సమీక్ష...అనంతరం తుది నిర్ణయం హైదరాబాద్: ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణలో భాగంగా తక్కువ సంఖ్యలో విద్యార్థులున్న పాఠశాలలను మూసివేయాలన్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకునే దిశగా యోచిస్తోంది. ఉపాధ్యాయ సంఘాల తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో.. ఆ నిబంధనను తొలగించి, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపట్టాలని భావిస్తోంది. అధికారులు దీనిపై తాత్కాలిక షెడ్యూల్‌ను కూడా సిద్ధం చేశారు. మంగళవారం ఈ వ్యవహారంపై మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్షించనున్నారు. అనంతరం ఈ షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.రాష్ట్రంలో ఉపాధ్యాయ హేతుబద్ధీకరణలో భాగంగా... 19 మందిలోపు పిల్లలున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను, 75 మందిలోపు పిల్లలున్న ఉన్నత పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇలా విద్యా సంవత్సరం మధ్యలో హేతుబద్ధీకరణ చేపట్టడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వేసవి సెలవుల్లోనే ఈ ప్రక్రియను చేపట్టాలని కోరుతున్నాయి. కొత్త సర్వీసు రూల్స్ ఇవ్వకుండా ఇప్పటికిప్పుడు హేతుబద్ధీకరణ చేపట్టడం సరికాదని వాదిస్తున్నాయి. ఈ అంశాలపై చర్చించేందుకు తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ మంగళవారం (30వ తేదీన) సమావేశమవుతోంది. స్కూళ్ల మూసివేత కారణంగా దాదాపు రెండు లక్షల మంది గ్రామీణ విద్యార్థులు ప్రభుత్వ విద్యకు దూరమవుతారని... పక్క గ్రామాలకు పిల్లలను పంపించలేని తల్లిదండ్రుల వైఖరితో డ్రాపవుట్స్‌గా మిగిలిపోయే అవకాశముందని జేఏసీ పేర్కొంటోంది. ఈ నిర్ణయం వల్ల దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలు నష్టపోయే ప్రమాదం నెలకొంటుందని చెబుతోంది. ఈ నేపథ్యంలో హేతుబద్ధీకరణ ఉత్తర్వులను ఉపసంహరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి కూడా. ఉపాధ్యాయ జేఏసీ కూడా తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. నేడు మంత్రి సమీక్ష.. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ అంశంపై మంగళవారం విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్షించనున్నారు. ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకత నేపథ్యంలో హేతుబద్ధీకరణను తాత్కాలికంగా వాయిదా వేసే అంశంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ప్రక్రియను ఇప్పుడే చేపట్టాలనుకుంటే పాఠశాలల మూసివేత నిబంధనను తొలగించి.. ముందుకు వెళ్లాలనే ఆలోచన అధికారవర్గాల్లో ఉన్నట్లు తెలిసింది. తద్వారా ఉపాధ్యాయ సం ఘాల నుంచే కాకుండా మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని ప్రజల నుంచి పాఠశాలల ను మూసివేశారనే అపవాదు రాకుండా చూసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు విద్యార్థుల సంఖ్య విషయాన్ని పక్కనబెట్టి ప్రాథమిక పాఠశాలలను మాత్రం కొనసాగించే అంశంపైనా చర్చించనున్నారు. హేతుబద్ధీకరణ తరువాత ఎలాగూ అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది కనుక 10 మందిలోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలను అకడమిక్ ఇన్స్ట్రక్టర్లతో కొనసాగించే అంశంపై చర్చించనున్నారు. ఒక్క విద్యార్థి కూడా లేని దాదాపు 350 స్కూళ్లను భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇప్పుడే అధికారికంగా రద్దు చేయకుండా.. అక్కడి టీచర్లను మాత్రం విద్యార్థులున్న స్కూళ్లకు పంపించేలా మార్పులు చేసే అవకాశం ఉంది. మంగళవారం జరిగే సమావేశంలో దీనిపై తుది నిర్ణయం వెలువడనుంది.