టీఆర్‌ఎస్‌లోకి నల్లగొండ వైస్ చైర్మన్, ఐదుగురు కౌన్సిలర్లు | vice-chairman, five councilors in trs party | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లోకి నల్లగొండ వైస్ చైర్మన్, ఐదుగురు కౌన్సిలర్లు

Published Thu, Nov 13 2014 4:52 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

టీఆర్‌ఎస్‌లోకి నల్లగొండ వైస్ చైర్మన్, ఐదుగురు కౌన్సిలర్లు - Sakshi

టీఆర్‌ఎస్‌లోకి నల్లగొండ వైస్ చైర్మన్, ఐదుగురు కౌన్సిలర్లు

నల్లగొండ టూటౌన్: నల్లగొండ మున్సిపల్ రాజకీయం రసకందాయంలో పడింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డితో పాటు ఐదుగురు కౌన్సిలర్లు బుధవారం టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దుబ్బాక నర్సింహారెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ వెళ్లి వీరు మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో వైస్ చైర్మన్‌తో పాటు కౌన్సిలర్లు ఎండీ.ఖయ్యూంబేగ్, ఆంగోతు ప్రదీప్‌నాయక్, బొంత రేణుకా శ్రీనివాస్, అబ్బగోని రమేశ్, షాహీన్ తఖీ ఉన్నారు. కాగా ముగ్గురు మహిళా కౌన్సిలర్ల తరఫున వాళ్ల పతులు చేరారు.

మరో నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా కారు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే ప్రస్తుతం ఊగిసలాటలో ఉన్న వీరు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్ బలం మరింత పెరగనుంది. ప్రస్తుతం కౌన్సిలర్ల సంఖ్య 10కి చేరింది. కాంగ్రెస్ హస్తగతమైన మున్సిపల్ పీఠాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు అధికారపార్టీ చాపకింది నీరులా పావులు కదుపుతోంది. దానిలో భాగంగానే కాంగ్రెస్ కౌన్సిలర్లను తన పార్టీలో చేర్చుకుంటుంది. ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం జీఓ తీసుకువస్తే పురపీఠం హస్తం చేజారీ కారు చేతిలోకి వెళ్లే అవకాశం ఉంది.
 
కొంపముంచిన అసమ్మతి
 మున్సిపాలిటీలో అన్ని పార్టీలకన్నా కాంగ్రెస్ పార్టీ 22 స్థానాలను గెలుపొందినా ఆ పార్టీలో నెలకొన్న అసమ్మతి కొంపముంచింది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలతో దాదాపు 10మంది కౌన్సిలర్లు తీవ్ర అసంతృప్తికి గురయ్యారనే ప్రచారం జరిగింది. మున్సిపాల్టీకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా చైర్‌పర్సన్ తమను ఏ మాత్రం సంప్రదించలేదని కొన్ని నెలలు గుర్రుగా ఉన్నారు. చైర్‌పర్సన్ భర్త వ్యవహరించిన తీరు కూడా తమను అవమానించేలా ఉందని పలువురు సభ్యులు వారి సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలి సింది. ఈ విషయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఆమెకే మద్దతుగా పలికారని అసమ్మతి కౌన్సిలర్లు కాంగ్రెస్ ముఖ్య నాయకుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం.
 
రసకందాయంలో రాజకీయం...
కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు టీఆర్‌ఎస్ పార్టీలో చేరడంతో మున్సిపల్ రాజకీయం రసకందాయంలో పడింది. వరుసగా మూడు పర్యాయాలు మున్సిపల్‌పై  కాంగ్రెస్ జెండా ఎగిరింది. కానీ ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మున్సిపాలిటీని గులాబి పరం చేసేందుకు ఆ పార్టీ ముఖ్య నాయకుడు వ్యూహాత్మాకంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపాల్టీలో మొత్తం 40 వార్డులు ఉండగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 22, టీఆర్‌ఎస్ 2, బీజేపీ 4, సీపీఎం 2, టీడీపీ 4, ఎంఐఎం 3, స్వతంత్రులు 3 చొప్పున గెలిచారు. వీరిలో ఇద్దరు కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌లోగా చేరగా మరో స్వతంత్ర కౌన్సిలర్ తటస్థంగా ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి గెలిచిన 22 మంది కౌన్సిలర్లలో ఆరుగురు కారెక్కడంతో కాంగ్రెస్ బలం 16కు తగ్గిపోయింది. టీఆర్‌ఎస్ పార్టీ బలం 10కి చేరుకుంది.
 
జీఓ తీసుకొస్తే చేజారనున్న చైర్మన్ పదవి
మున్సిపల్ చైర్మన్ పదవిలో కొనసాగే వారిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే నాలుగేళ్ల పదవీ కాలం పూర్తికావాలి. గతంలో రెండేళ్లకే అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉండగా దానిని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నాలుగేళ్లకు పొడిగించారు. అయితే అవిశ్వాస తీర్మానం ఒక సంవత్సరానికే పెట్టే విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం జీఓ తెచ్చే అవకాశం ఉన్నట్లు కొద్ది రోజలుగా ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే కనుక నల్లగొండ మున్సిపల్ చైర్మన్ పదవి హస్తం నుంచి చేజారే అవకాశం లేకపోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement