పార్టీ పదవుల కోసం లక్షలు ఖర్చు పెట్టుకున్నారు
సాధారణ ఎన్నికల్లా.. టీఆర్‌ఎస్ సంస్థాగత ఎన్నికలు: జగదీశ్‌రెడ్డి
హన్మకొండ: టీఆర్‌ఎస్ సంస్థాగత ఎన్నికలు సాధారణ ఎన్నికల్లా జరిగాయని, గ్రామ కమిటీ అధ్యక్షుల పదవులకు పోటీ పెరిగిందనీ, ఇందుకోసం రూ.లక్షల్లో ఖర్చు పెట్టుకున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం హన్మకొండలో జరిగిన పార్టీ కమిటీల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడిగా తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, గ్రేటర్ వరంగల్ పార్టీ అధ్యక్షుడిగా నన్నపునేని నరేందర్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు జగదీశ్‌రెడ్డి పరిశీలకుడిగా హాజరై మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలతో టీఆర్‌ఎస్ పట్ల ప్రజల్లో అదరణ పెరిగిందన్నారు. దీంతో దేశంలోనే ఏ పార్టీకి రాని స్పందన టీఆర్‌ఎస్ చేపట్టిన సభ్యత్వ నమోదుకు వచ్చిందన్నారు. తెలంగాణ ఏర్పాటైతే పాలించే నాయకులు లేరని ఎగతాళి చేయబడిన మన రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో ముందంజలో ఉందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ కూడాకేసీఆర్‌ను అభినందించారన్నారు. మొదటి తారీకు వచ్చిందంటే ఏపీ సీఎం చంద్రబాబుకు వణుకు పుడుతుందని విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కేంద్రం వైపు చూస్తున్నారన్నారు. ఆంధ్రోళ్లు చేసిన పాపానికి విద్యుత్ కష్టాలు వస్తే, తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరం పూర్తికాక ముందే సీఎం కేసీఆర్ విద్యుత్ సమస్య లేకుండా చేశారనీ, అవినీతి రహిత పాలన అందిస్తున్నారన్నారు.
డిప్యూటీ ఈవో పోస్టుల భర్తీకి ఉత్తర్వులు
హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డిప్యూటీఈఓ) పోస్టుల భర్తీకి ప్రభుత్వం గురువారం ఉత్తర్వులిచ్చింది. 2013లో ట్రిబ్యునల్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఈ పోస్టులను (పూర్తి అదనపు బాధ్యతలతో) భర్తీ చేయాలని ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి టి. విజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 56 ఉప విద్యాధికారి పోస్టుల్లో 46 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులకే పోస్టులు: జీటీఏ
ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఉప విద్యాధికారి పోస్టులను ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులతోనే భర్తీ చేయాలని ప్రభుత్వ టీచర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విశ్వనాథ్‌గుప్తా, సురేందర్, మామిడోజు వీరాచారి కోరారు.
ఆగ్రోస్ ఎండీగా వీరబ్రహ్మయ్య
హైదరాబాద్: ఆగ్రోస్ సంస్థ ఎండీగా ఎం.వీరబ్రహ్మయ్యను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన ఆయిల్‌ఫెడ్‌కు ఎండీగా, సీడ్ కార్పొరేషన్‌కు పూర్తి అదనపు బాధ్యతలతో ఎండీగా వ్యవహరించనున్నారని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులు ఈ నెల 13వ తేదీ నుంచే వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు. వీరబ్రహ్మయ్య ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు కరీంనగర్ కలెక్టర్‌గా కూడా పనిచేశారు.