జానా బాబా 40 దొంగలు | Minister KTR comments on congress leaders | Sakshi
Sakshi News home page

జానా బాబా 40 దొంగలు

Published Thu, Mar 1 2018 2:29 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

Minister KTR comments on congress leaders - Sakshi

బుధవారం సూర్యాపేట జిల్లా మద్దిరాలలో బహిరంగ సభకు హాజరైన ప్రజలు , మంత్రి కేటీఆర్‌

సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ‘ఆలీబాబా 40 దొంగలు అన్నట్లు జానాబాబా 40 దొంగలుగా కాంగ్రెస్‌ నేతలు సిగ్గు, ఎగ్గు లేకుండా బస్సు యాత్ర చేస్తున్నారు. యాత్ర చేస్తున్న వారందరిపై కేసులున్నాయి.’అని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా పర్యటనలో భాగంగా నూతనకల్‌ మండలం చిల్పకుంట్లలో రూ.143 కోట్లతో నిర్మించిన మిషన్‌ భగీరథ వాటర్‌ ప్లాంట్‌కు ఆయన ప్రారంభోత్సవం చేసి 175 గ్రామాలకు మంచి నీటిని విడుదల చేశారు.

అనంతరం మద్దిరాల క్రాస్‌రోడ్డులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నాయకుల్లో ఒకరు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికితే, ఇంకొకరు ఎన్నికల సమయంలో కోదాడలో రూ.3 కోట్లతో దొరికిపోయారని, మరికొంత మంది సీబీఐ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.

ఒక్కరూ నోరు మెదపలేదు..
55 ఏళ్లుగా కాంగ్రెస్‌ .. దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిందని, ఇన్నాళ్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వారు ఏం చేశారని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. గోదావరి, కృష్ణా జలాలు వస్తే ఫ్లోరోసిస్‌ వ్యాధితో 2లక్షల మంది చితికిపోయేవారా అని ప్రశ్నించారు. 15 ఏళ్లు మంత్రిగా ఉన్న జానారెడ్డి దేవరకొండ, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో ఫ్లోరోసిస్‌తో ప్రజలు పడుతున్న బాధలు గుర్తుకురాలేదా, నాటి సీఎంల వద్ద జానా, ఉత్తమ్‌లు ఎందుకు యుద్ధం చేయలేదని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఫ్లోరోసిస్‌పై ఏ ఒక్కరైనా శాసన సభలో నోరు మెదపలేదని విమర్శించారు. నిండు శాసనసభలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ జిల్లాలకు నిధులు ఇవ్వనని అసెంబ్లీలో చెప్పినా ఏ ఒక్క కాంగ్రెస్‌ నాయకుడు మాట్లాడలేదని మండిపడ్డారు.

ఒక చిత్తూరు జిల్లాకే తాగునీటి అవసరాల కోసం రూ.9 వేల కోట్ల రూపాయలు తన్నుకుపోతుంటే ఈ కాంగ్రెస్‌ నాయకులు నిలదీయలేదని విమర్శించారు. 45 ఏళ్ల క్రితం పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ శ్రీరాం సాగర్‌కు శంకుస్థాపన చేస్తే ఇప్పటి వరకు ఆ కాలువల్లో నీరెందుకు రాలేదని ప్రశ్నించారు. శ్రీరాంసాగర్‌ జలాలతో నియోజక వర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందించేందుకు రెండు(వెంపటి, రుద్రమదేవి చెరువులను) రిజర్వాయర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని కేటీఆర్‌ తెలిపారు.

అలాగే తుంగతుర్తిలో యువతకు ఉపాధి కల్పించేలా ఇక్కడికి పెద్ద ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసే బాధ్యత తనదే అని హామీ ఇచ్చారు. విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన ఈ 36 నెలల కాలంలో రూ.30వేల కోట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వచ్చాయని, ఈ నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సభలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement