
సాక్షి, హైదరాబాద్: దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, కర్మాగారాలు, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి ద్వారా ఉపకారవేతనాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా 2018–19 విద్యా సంవత్సరంలో పదో తరగతి నుంచి పీజీ వరకు ఏదైనా కోర్సు పూర్తి చేసిన కార్మికుల పిల్లలు సంబంధిత కార్మిక కమిషనర్ కార్యాలయం నుంచి దరఖాస్తును పొందాలని, వాటిని పూర్తి వివరాలతో పూరించి 2020 ఫిబ్రవరి 15వ తేదీలోగా కార్మిక శాఖ కార్యాలయంలో సమర్పించాలని తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి ఒక ప్రకటనలో తెలిపింది. 2018–19 విద్యా సంవత్సరంలో పదో తరగతి నుంచి పీజీ పూర్తి చేసిన అభ్యర్థులే అర్హులని, రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ఉపకారవేతనాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాలకు సమీపంలోని కార్మిక శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించింది.