సత్తెనపల్లి: చదువుకునే కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలను ప్రభుత్వం అందిచనుంది. ఎన్నో ఏళ్ల తరబడి ఫ్యాకర్టీలు, దుకాణాలు, క్వారీల్లో పని చేసే కార్మికుల స్థితిగతులను మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యంతో కార్మిక సంక్షేమ మండలిని ఏర్పాటు చేశాయి. ఈ మండలి ద్వారా కార్మికుల పిల్లల ఉన్నత విద్యలకు సంక్షేమ నిధిని కూడా ఏర్పాటు చేశారు. ఈ నిధి ద్వారా కార్మికుల పిల్లలు చదువులకు ఉపకార వేతనాలను అందిస్తూ విద్య ప్రగతిని ప్రోత్సహిస్తున్నాయి. ఈ మేరకు కార్మిక సంక్షేమ మండలి ఆదేశాలు జారీ చేసింది. ఫ్యాకర్టీలు, దుకాణాలు, వాణిజ్య సంస్థలు, కర్మాగారాలు, ట్రస్టులు, సొసైటీలు, మోటార్, రవాణా సంస్థలు నిర్వహిస్తున్న వారు కార్మిక శాఖలో లైసెన్సు పొంది చట్ట బద్ధత కల్పించుకున్న సంస్థలే ఈ సంక్షేమ మండలి పరిధిలోకి వస్తాయి.
అర్హతలు ఇవి....
కార్మికులు తాను పని చేస్తున్న సంస్థ లేదా యజమాని నుంచి వేతన ధ్రువీకరణ పత్రం, పిల్లవాడి విద్యార్థి ధ్రువీకరణ పత్రం, గత సంవత్సరం మార్కుల జాబితా, ప్రస్తుతం చదువుతున్న కళాశాల వివరాలతో కూడిన దరఖాస్తును కార్మిక శాఖ కార్యాలయాల్లో అందజేయాలి. ఇంజనీరింగ్, మెడిసిన్, పాలిటెక్నిక్, లా, వ్యవసాయ బీఎస్సీ, బీఎస్సీ వెటర్నరీ, బీఎస్సీ నర్సింగ్, బీసీఏ, ఎంసీఏ, బీ పార్మశి, ఎం.ఫార్మశి, ఎంబీఏ, బీబీఏ, డిప్లమా ఇన్ మెడికల్ లేబొరేటరి టెక్నిషియన్, పీజీ డిప్లమా ఇన్ మెడికల్ లేబొరేటరి టెక్నిషియన్ కోర్సులు చదివే విద్యార్థులు అర్హులు.
ఉపకార వేతనాలు వీరికి
564 మంది ఉపకార వేతనం పొందే అవకాశం ఉంది. కోర్సుల వారీగా చూస్తే.... పాలిటెక్నిక్ 90, ఇంజనీరింగ్ 150, మెడిసిన్ 30, లా 12, బీఎస్సీ (అగ్రికల్చర్) 12, బీఎస్సీ (వెటరర్నీ)12, బీఎస్సీ (నర్సింగ్) 12, బీఎస్సీ (ఉద్యాన) 12, బీసీఏ 60, ఎంసీఏ 60, బీఫార్మశి, ఎం.ఫార్మశి 30, బీబీఏ 30, ఎంబీఏ 30, డిప్లమా ఇన్ మెడికల్ లేబోరేటరి టెక్నిషియన్ (డీఎంఎల్‌టీ) 12, పీజీ డిప్లమా ఇన్ మెడికల్ లేబోరేటరీ టెక్నిషియన్ 12మందికి ఉపకార వేతనాలను అందించనుంది.
దరఖాస్తులు ఇలా....
జిల్లాలో ప్రతిభావంతులైన కార్మికుల కుటుంబాల పిల్లల సంక్షేమ మండలికి నిధి చెల్లించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. జిల్లాలో సహాయ కార్మిక కమిషనర్ కార్యాలయాలు గుంటూరు, తెనాలి, నరసరావుపేట లో ఉన్నాయి. వీటి పరిధిలో జిల్లాలోని 57 మండలాలు వస్తాయి. ఆయా మండలాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. జిల్లాలోని నరసరావుపేట డివిజన్‌లో నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల, వినుకొండ సహాయ కార్మిక శాఖాధికారుల కార్యాలయాల్లో, గుంటూరు డివిజన్‌లో గుంటూరు నగరంలో ఆరు సర్కిళ్లు, అమరావతి సహాయ కార్మిక శాఖ అధికారుల కార్యాలయాల్లో, తెనాలి డివిజన్‌లో తెనాలి పట్టణంలో రెండు సర్కిళ్లు, మంగళగిరి, పొన్నూరు, బాపట్ల, రేపల్లెలో సహాయ కార్మిక శాఖాధికారుల కార్యాలయాల్లో ఆయా పరిధిలోని మండలాల కార్మికుల పిల్లలు దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తులు అందించడానికి ఈనెల 15 చివరి తేదీగా నిర్ణయించారు.
అవకాశాన్ని వినియోగించుకోవాలి
ప్రతిభావంతులైన కార్మికుల కుటుంబాల పిల్లలు సంక్షేమ మండలికి నిధి చెల్లించన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎంపికైన విద్యార్థులకు వారి బ్యాంకు ఖాతాకు మేడే కానుకగా ఉపకార వేతన జమ చేస్తారు.– వడ్డెం హనుమత్ సాయి, సహాయ కార్మిక శాఖాధికారి, సత్తెనపల్లి
Comments
Please login to add a commentAdd a comment