సాక్షి, అమరావతి: పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీఓలపై ఎలాంటి స్టే ఇవ్వబోమని హైకోర్టు తేల్చిచెప్పింది. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమన్న హైకోర్టు, ఆ నిర్ణయాన్ని అమలుచేయనిద్దామని, అప్పుడే అందులో మంచిచెడ్డలు ఏమిటో తెలిసే అవకాశముంటుందని హైకోర్టు స్పష్టంచేసింది.
స్టే ఇస్తే మొత్తం ప్రక్రియ ఆగిపోతుందని, అందువల్ల ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. తదుపరి విచారణను అక్టోబర్ 11కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
ఏజీ చెప్పిన వివరాలను పరిగణనలోకి..
పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన జీఓలను సవాలు చేస్తూ తాజాగా ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ డి. రమేశ్‌చంద్ర సింహగిరి పట్నాయక్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంతో పాటు ఇదే అంశంపై గతంలో దాఖలైన వ్యాజ్యాలు మంగళవారం సీజే ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. విలీనం, హేతుబద్ధీకరణ ప్రభుత్వ విధాన నిర్ణయమన్నారు. ఇందులో ఇప్పటికే అధిక శాతం అమలైందన్నారు. అమలు తాలుకు ఫలితాలెలా ఉన్నాయన్న దానిపై సమీక్ష చేయాల్సి ఉందని వివరించారు. ఏజీ చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకుని విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.
ఈ సమయంలో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. ఈ వ్యాజ్యాలపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందని, విచారణను రెండు వారాలకు వాయిదా వేయాలని కోరారు. కానీ, ఈ వ్యవహారంలో ఎలాంటి స్టే ఇచ్చేదిలేదని ధర్మాసనం స్పష్టంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment