హైకోర్టుకు మరో ఇద్దరు శాశ్వత న్యాయమూర్తులు | Two more permanent judges of the AP High Court | Sakshi
Sakshi News home page

హైకోర్టుకు మరో ఇద్దరు శాశ్వత న్యాయమూర్తులు

Published Thu, Aug 22 2024 6:20 AM | Last Updated on Thu, Aug 22 2024 6:21 AM

Two more permanent judges of the AP High Court

జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి, జస్టిస్‌ గోపాలకృష్ణారావు నియామకం 

రాష్ట్రపతి ఆమోదముద్ర.. శుక్రవారం ప్రమాణం చేసే అవకాశం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్‌ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు వీరి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి, జస్టిస్‌ గోపాలకృష్ణారావు శుక్రవారం శాశ్వత న్యాయ­మూ­ర్తులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. వీరి నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గురు వారం జీవో జారీ చేస్తే శుక్రవారం వారి ప్రమాణం ఉం­టుంది. వీరి చేత హైకోర్టు ప్రధాన న్యాయ­మూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణం చేయిస్తారు. వీరిద్దరినీ హైకోర్టు శాశ్వత న్యాయ­మూ­ర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీ­జియం ఇటీవల కేంద్రానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.

జస్టిస్‌ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు 
జస్టిస్‌ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు కృష్ణా జిల్లా చల్లపల్లి గ్రామానికి చెందిన విశ్రాంత సబ్‌ రిజిస్ట్రార్‌ సోమయ్య, కోటేశ్వరమ్మలకు 1964 ఆగస్టు 30న జన్మించారు. 10వ తరగతి మచి­లీపట్నంలోని జైహింద్‌ హైస్కూల్‌లో, ఇంటర్మీ­డియట్‌ చల్లపల్లిలోని ఎస్‌ఆర్‌వైఎస్‌పీ జూని­యర్‌ కాలేజీలో.. గ్రాడ్యుయేషన్, పోస్ట్‌ గ్రాడ్యు­యేషన్, న్యాయ విద్యను మచిలీపట్నంలో అభ్యసించారు. 1989 ఏప్రిల్‌ 5వ తేదీన న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్‌లో చేరి ప్రాక్టీస్‌ చేశారు. 1994లో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. 2007లో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పదోన్నతి పొందారు. 

అనంతరం 2016 నుంచి 2019 వరకు శ్రీకాకుళంలో ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక జడ్జిగా పని చేశారు. అనంతరం తిరుపతిలోని ఫ్యామిలీ కోర్టులో అదనపు జిల్లా న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత గుంటూరు మొదటి అదనపు జిల్లా జడ్జిగా పని చేస్తున్న సమయంలో గతేడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసు మేరకు ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 

జస్టిస్‌ పి.వెంకట జ్యోతిర్మయి  
జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి గుంటూరు జిల్లా తెనాలిలో పీవీకే శాస్త్రి, బాల త్రిపుర సుందరి దంపతులకు జన్మించారు. డిగ్రీ వరకు తెనాలిలోనే చదివారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. అనంతరం 2008లో నేరుగా జిల్లా జడ్జి కేడర్లో ఎంపికై..  ఫ్యామిలీ కోర్టు, సీబీఐ కోర్టు, వ్యాట్‌ ట్రైబ్యునల్‌ ఛైర్మన్, ఎస్సీ ఎస్టీ కోర్టు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 

2023 జనవరిలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అనంతరం ఈ ఏడాది మే 16న ఏపీ హైకోర్టు ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని అనుసరించి సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement