judges Appointment
-
హైకోర్టుకు మరో ఇద్దరు శాశ్వత న్యాయమూర్తులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు వీరి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణారావు శుక్రవారం శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. వీరి నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గురు వారం జీవో జారీ చేస్తే శుక్రవారం వారి ప్రమాణం ఉంటుంది. వీరి చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయిస్తారు. వీరిద్దరినీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల కేంద్రానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు కృష్ణా జిల్లా చల్లపల్లి గ్రామానికి చెందిన విశ్రాంత సబ్ రిజిస్ట్రార్ సోమయ్య, కోటేశ్వరమ్మలకు 1964 ఆగస్టు 30న జన్మించారు. 10వ తరగతి మచిలీపట్నంలోని జైహింద్ హైస్కూల్లో, ఇంటర్మీడియట్ చల్లపల్లిలోని ఎస్ఆర్వైఎస్పీ జూనియర్ కాలేజీలో.. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, న్యాయ విద్యను మచిలీపట్నంలో అభ్యసించారు. 1989 ఏప్రిల్ 5వ తేదీన న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో చేరి ప్రాక్టీస్ చేశారు. 1994లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. 2007లో సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి పొందారు. అనంతరం 2016 నుంచి 2019 వరకు శ్రీకాకుళంలో ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక జడ్జిగా పని చేశారు. అనంతరం తిరుపతిలోని ఫ్యామిలీ కోర్టులో అదనపు జిల్లా న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత గుంటూరు మొదటి అదనపు జిల్లా జడ్జిగా పని చేస్తున్న సమయంలో గతేడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసు మేరకు ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ పి.వెంకట జ్యోతిర్మయి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి గుంటూరు జిల్లా తెనాలిలో పీవీకే శాస్త్రి, బాల త్రిపుర సుందరి దంపతులకు జన్మించారు. డిగ్రీ వరకు తెనాలిలోనే చదివారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. అనంతరం 2008లో నేరుగా జిల్లా జడ్జి కేడర్‌లో ఎంపికై.. ఫ్యామిలీ కోర్టు, సీబీఐ కోర్టు, వ్యాట్ ట్రైబ్యునల్ ఛైర్మన్, ఎస్సీ ఎస్టీ కోర్టు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2023 జనవరిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అనంతరం ఈ ఏడాది మే 16న ఏపీ హైకోర్టు ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని అనుసరించి సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. -
Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు కొత్తగా మరో ఐదుగురు న్యాయమూర్తులు రానున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం గతంలోనే సిఫారసు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల పేర్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. అనంతరం ఈ ప్రతిపాదనలను రాష్ట్రపతికి పంపింది. ప్రెసిడెంట్ ద్రౌపదిముర్ము కూడా దీనిపై సంతకం చేయడంతో సుప్రీంకోర్టుకు కొత్త న్యాయమూర్తుల నియామక ప్రక్రియ అధికారికంగా పూర్తయింది. సుప్రీంకోర్టుకు కొత్తగా నియమించిన న్యాయమూర్తులు వీరే. జస్టిస్ పంకజ్ మిత్తల్, రాజస్థాన్ హైకోర్టు సీజే. జస్టిస్ సంజయ్ కరోల్, పాట్నా హైకోర్టు సీజే. జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, మణిపూర్ హైకోర్టు సీజే. జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా, పాట్నా హైకోర్టు జడ్జి. జస్టిస్ మనోజ్ మిశ్రా, అలహాబాద్ హైకోర్టు జడ్జి. కొలీజియం సిఫారసు మేరకు ఐదుగురు నూతన న్యాయమూర్తులను త్వరలోనే నియమిస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు శుక్రవారమే తెలిపింది. ఆ మరునాడే నియామక ప్రక్రియ పూర్తి చేసింది. కేంద్రం కావాలనే న్యాయమూర్తలు నియామక ప్రక్రియను ఆలస్యం చేస్తోందని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో త్వరలోనే పక్రియ పూర్తి చేస్తామని కేంద్రం చెప్పింది. చదవండి: పెండింగ్ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్.. కట్టేందుకు ఎగబడ్డ జనం -
హైకోర్టుకు కొత్తగా ఆరుగురు జడ్జీలు.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు మరో ఆరుగురు న్యాయమూర్తులు రానున్నారు. వీరి నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం ఆమోదించారు. నలుగురిని జడ్జీలుగా, ఇద్దరిని అదనపు జడ్జీలు నియమిస్తూ.. కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి రాజేందర్ కశ్యప్ నోటిఫికేషన్ జారీచేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సోమ లేదా మంగళవారం వీరితో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది. కొత్త జడ్జీలుగా నియమితులైన వారిలో న్యాయవాదులు ఏనుగుల వెంకట వేణుగోపాల్, నగేష్ భీమపాక, పుల్లా కార్తీక్ అలియాస్ పి.ఎలమందర్, కాజా శరత్.. అదనపు జడ్జీలుగా నియమితులైన వారిలో జె. శ్రీనివాసరావు, ఎన్. రాజేశ్వర్‌రావు ఉన్నారు. కాగా, సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కు పెంచారు. గత సంవత్సర కాలంలో 24 మంది న్యాయమూర్తుల నియామకం చేపట్టారు. తాజా ఆమోదం పొందిన వారితో కలిపి ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టులో జడ్జీల సంఖ్య 34కు చేరింది. ఈ నేపథ్యంలో మరో 8 న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. ఈవీ వేణుగోపాల్.. 1967, ఆగస్టు 16న కరీంనగర్ జిల్లాకేంద్రంలోని మంకమ్మతోటలో బాలాకుమారి, రాజేశ్వరరావులకు జన్మించారు. తండ్రి చేనేత, వస్త్ర పరిశ్రమ డిప్యూటీ డైరెక్టర్‌గా, తల్లి ప్రభుత్వ టీచర్‌గా పనిచేశారు. వీరికి శ్రీనివాసరావు, వేణుగోపాల్, శ్రీదేవి, శ్రీధర్, శ్రీకాంత్ సంతానం. వేణుగోపాల్ రెండోవారు. ఈయన డాక్టర్ శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు, ఒక కొడుకు. 1992లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. తొలుత సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ వద్ద జూనియర్‌గా పనిచేశారు. కరీంనగర్ కోర్టులో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా వాదనలు వినిపించారు. 2007 నుంచి 2013 వరకు ఉమ్మడి హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. వివిధ విభాగాల్లో రిట్ పిటిషన్లు, రిట్ అప్పీళ్లలో వాదించారు. ఉమ్మడి హైకోర్టులో రైల్వే కౌన్సిల్‌గా పనిచేశారు. 2021లో సీనియర్ అడ్వొకేట్‌గా పదోన్నతి పొందారు. రాజ్యాంగపరమైన, క్రిమినల్, సివిల్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య చట్టాల్లో మంచి అనుభవం ఉంది. ఉమ్మడి హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. పుల్లా కార్తీక్... 1967, జూన్ 4న జగిత్యాల పట్టణంలో పోచమల్లమ్మ, ఒగ్గు హనుమంతులకు జన్మించారు. పాఠశాల విద్య జగిత్యాలలోనే పూర్తి చేశారు. ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివారు. ఉస్మానియా వర్సిటీలో డిగ్రీ ఉత్తీర్ణులయ్యారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ పట్టా పొందారు. అనంతరం ఉస్మానియా నుంచే ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1996, మార్చి 27న అడ్వొకేట్‌గా బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేసుకున్నారు. అన్ని విభాగాల న్యాయవాదిగా ఉమ్మడి ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారు. 2015లో ఏపీ పరిపాలన ట్రిబ్యునల్ న్యాయవాదిగా నియమితులయ్యారు. 2017లో తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులై.. ప్రస్తుతం కొనసాగుతున్నారు. నగేశ్ భీమపాక.. 1969, మార్చి 8న భద్రాచలంలో శాంతమ్మ, భూపతిరావులకు జన్మించారు. స్వాతంత్య్ర సమరయోధుడైన భూపతిరావు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. నగేశ్.. పాఠశాల విద్య భద్రాచలంలో, ఇంటర్ ఖమ్మంలో, ఎల్ఎల్బీ సీఆర్ రెడ్డి కళాశాలలో, ఎల్ఎల్ఎం నిజాం కాలేజీలో పూర్తి చేశారు. 1993, ఏప్రిల్‌లో అడ్వొకేట్‌గా ఎన్రోల్ చేసుకున్నారు. ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదించారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో వాదిస్తున్నారు. సివిల్, క్రిమినల్, కాన్స్టిట్యూషనల్, లేబర్, రెవెన్యూ, మున్సిపల్ చట్టాల్లో మంచి అనుభవం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ వైద్యారోగ్య శాఖ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. పరిశ్రమలు, గనుల కౌన్సిల్‌గా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) స్టాండింగ్ కౌన్సిల్‌గా, అసిస్టెంట్ ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. జగన్నగారి శ్రీనివాసరావు.. 1969, ఆగస్టు 31న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం లింగన్నపేటలో జన్మించారు. తండ్రిపేరు మాణిక్యరావు. తల్లిపేరు లక్ష్మీబాయి. పాఠశాల విద్య లింగన్నపేటలో.. గంభీరావుపేటలోని ప్రభుత్వ కాలేజీ నుంచి ఇంటర్, హైదరాబాద్ నారాయణగూడలోని భవన్స్ న్యూ సైన్స్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఓయూలో బీఏ, ఎల్ఎల్బీ చదివారు. 1999, ఏప్రిల్ 29న అడ్వొకేట్‌గా ఎన్రోల్ చేసుకున్నారు. తొలుత జి.కృష్ణమూర్తి వద్ద జూనియర్‌గా పనిచేశారు. రిట్ సర్వీస్, నాన్ సర్వీస్ మ్యాటర్స్, సివిల్, క్రిమినల్ మ్యాటర్స్‌కు సంబంధించి లోయర్ కోర్టులు, హైకోర్టులు, ట్రిబ్యునళ్లలో వాదనలు వినిపించారు. 2006 నుంచి స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2015 నుంచి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేస్తున్నారు. ఈయన గెలిచిన 60కిపైగా తీర్పులు లా జనరల్‌కు రిపోర్టు అయ్యాయి. నామవరపు రాజేశ్వర్‌రావు.. 1969, జూన్ 30న మహబూబాబాద్ జిల్లా సూదన్‌పల్లిలో జన్మించారు. ఈయన తల్లి పేరు గిరిజా కుమారి, తండ్రిపేరు సత్యనారాయణరావు. పాఠశాల విద్య వరంగల్‌లోని సరస్వతి శిశు మందిర్‌లో.. హైస్కూల్, ఇంటర్ గోవిందరావుపేటలో.. డిగ్రీ మహబూబాబాద్‌లో పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 2001, ఫిబ్రవరి 22న అడ్వొకేట్‌గా ఎన్రోల్ చేసుకున్నారు. ఉమ్మడి ఏపీ హైకోర్టులో.. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. తొలుత సీవీ రాములు ఆఫీస్‌లో న్యాయవాదిగా పనిచేశారు. 2015లో తెలంగాణ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులై 2019 వరకు పనిచేశారు. యూజీసీ తరఫు అడ్వొకేట్‌గా(సెప్టెంబర్, 2015– అక్టోబర్, 2019) విధులు నిర్వహించారు. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(ఎస్ఎఫ్ఐఓ) కౌన్సిల్‌గా పనిచేశారు. 2016, ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2019 వరకు ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ ప్యానల్‌గా విధులు నిర్వహించారు. 2019, నవంబర్‌లో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(ఏఎస్ఎస్జీఐ)గా పనిచేస్తున్నారు. రిట్ పిటిషన్లు, సర్వీస్ మ్యాటర్స్, సివిల్, క్రిమినల్ మ్యాటర్స్, వివాహ సంబంధిత, కార్పొరేట్ లా, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్.. కేసుల్లో వాదనలు వినిపించారు. సరస్వతి శిశుమందిర్ విద్యా సంస్థల్లో చదివి సొలిసిటర్ జనరల్‌గా, హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం అయిన తొలి వ్యక్తి రాజేశ్వరరావు కావడం గమనార్హం. కాజా శరత్... 1971, జనవరి 29న భద్రాచలంలో లలితాంబ, సీతారామయ్యలకు జన్మించారు. పాఠశాల విద్య, ఇంటర్, డిగ్రీ(బీఎస్సీ) భద్రాచలంలోనే పూర్తి చేశా రు. ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎంఏ పట్టాపొందారు. ఆంధ్రా వర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ లా, ఉస్మానియా నుంచి ఎల్ఎల్ఎం(కాన్స్టిట్యూషనల్ లా) పూర్తి చేశారు. 1997, డిసెంబర్ 31న అడ్వొకేట్‌గా ఎన్రోల్ చేసుకున్నారు. తొలుత కొత్తగూడెం, భద్రాచలం ట్రయల్ కోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. 2002 నుంచి హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఉమ్మడి హైకోర్టులో అన్ని విభాగాల న్యాయవాదిగా కేసులు వాదించారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. -
హైకోర్టుకు ఏడుగురు జడ్జీలు!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తుల పోస్టులకు ఏడుగురు న్యాయవాదుల పేర్లను సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానం చేసింది. ఈ నెల 29న సమావేశమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ ఉమేశ్ ఉదయ్ లలిత్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్లతో కూడిన కొలీజియం ఈ మేరకు తీర్మానం చేస్తూ ఏడుగురు న్యాయవాదుల పేర్లను కేంద్రానికి పంపింది. కేంద్ర ప్రభుత్వం ఈ పేర్లకు ఆమోదం తెలిపిన తరువాత అవి రాష్ట్రపతికి చేరుతాయి. రాష్ట్రపతి నియామక ఉత్తర్వులు వెలువడిన అనంతరం ఏడుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన వారిలో కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తర్లాడ రాజశేఖరరావు, సత్తి సుబ్బారెడ్డి, రవి చీమలపాటి, వడ్డిబోయన సుజాత పేర్లున్నాయి. 27కి చేరుకోనున్న న్యాయమూర్తుల సంఖ్య హైకోర్టు కొలీజియం గతేడాది ఏడుగురి పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసింది. వీరితోపాటు ఎస్ఎం సుభానీ పేరును కూడా హైకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఎనిమిది మంది పేర్లపై చర్చించిన సుప్రీంకోర్టు కొలీజియం సుభానీ మినహా మిగిలిన ఏడుగురు పేర్లకు ప్రస్తుతం ఆమోదముద్ర వేసింది. సుభానీ విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం తెలియరాలేదు. సుప్రీంకోర్టు ఆమోదించిన ఏడుగురిలో శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర్లు, రాజశేఖరరావు, సుబ్బారెడ్డి, రవి, సుజాత హైకోర్టు న్యాయవాదులు కాగా రామకృష్ణ ప్రసాద్ సుప్రీంకోర్టు న్యాయవాదిగా కొనసాగుతున్నారు. కొనకంటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, సుజాత ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. వెంకటేశ్వర్లు, సుబ్బారెడ్డి, రవి గతంలో వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లకు స్టాండింగ్ కౌన్సిళ్లుగా ఉన్నారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 27కి చేరుకుంటుంది. గన్నమనేని రామకృష్ణ ప్రసాద్.. 1964 మే 28న జన్మించారు. తండ్రి గన్నమనేని గాంధీ చౌదరి. ప్రాథమిక విద్యాభ్యాసం గుంటూరు లయోలా పబ్లిక్ స్కూల్లో సాగింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 12వ తరగతి వరకు చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని ఆంధ్ర విద్యాలయ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్‌లో బీకాం చదివారు. 1990లో ఏసీ కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1991–93లో నాగార్జున యూనివర్సిటీ నుంచి మాస్టర్ లా పొందారు.1991లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2000లో సుప్రీంకోర్టుకు ప్రాక్టీస్ మార్చారు. అక్కడ పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. రాజ్యసభ సెక్రటేరియట్, రాజ్యసభ టెలివిజన్‌కు స్టాండింగ్ కౌన్సిల్‌గా ఉన్నారు. నాగాలాండ్ ప్రభుత్వం తరఫున పలు కేసులు వాదించారు. నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు.. 1967 జూలై 1న జన్మించారు. తండ్రి రామకృష్ణారావు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీకాం చదివారు. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంఎల్ పూర్తి చేశారు. 1992 జూన్ 30న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2014 డిసెంబర్ నుంచి 2019 వరకు హైకోర్టులో ఆంధ్ర ప్రాంత మునిసిపాలిటీలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 2015–16లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టాండింగ్ కౌన్సిల్‌గా కూడా ఉన్నారు. తర్లాడ రాజశేఖరరావు.. 1967 ఆగస్టు 3న జన్మించారు. శ్రీకాకుళం జిల్లా మూలసవలాపురం స్వగ్రామం.తల్లి కళ్యాణి. తండ్రి సురన్నాయుడు. విశాఖపట్నం ఎన్‌బీఎం కాలేజీలో బీఎస్సీ, బీఎల్ పూర్తి చేశారు. 1993 ఆగస్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వీవీఎస్ రావు న్యాయవాదిగా ఉన్న సమయంలో జూనియర్‌గా వృత్తి మెలకువలు నేర్చుకున్నారు. తరువాత సొంతంగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. విశ్రాంత న్యాయమూర్తి టీసీహెచ్ సూర్యారావుకు సమీప బంధువు. రవి చీమలపాటి.. 1967 డిసెంబర్ 4న విశాఖపట్నంలో జన్మించారు. తండ్రి శ్రీరామమూర్తి విశాఖలో పేరుపొందిన న్యాయవాది. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1995లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. తండ్రి వద్దే వృత్తి జీవితాన్ని ఆరంభించారు. సోదరుడు కూడా న్యాయవాదే. ఏడాదిన్నర తరువాత ప్రాక్టీస్‌ను హైకోర్టుకు మార్చారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధిత కేసులు వాదించారు. మూడేళ్ల పాటు పంచాయతీరాజ్ శాఖ స్టాండింగ్ కౌన్సిల్‌గా ఉన్నారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు న్యాయవాదిగా వ్యవహరించారు. వడ్డిబోయన సుజాత.. 1966 సెప్టెంబర్ 10న జన్మించారు. పాఠశాల విద్య మొత్తం ఢిల్లీ కేంద్రీయ విద్యాలయంలో పూర్తి చేశారు. ఎంఏ (పొలిటికల్‌సైన్స్), ఎంఏ (సైకాలజీ), ఎల్ఎల్ఎం చదివారు. 1998లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాదులు ఏవీ శివయ్య, భాస్కర లక్ష్మీల వద్ద జూనియర్‌గా పనిచేశారు. రాజ్యాంగ సంబంధిత కేసుల్లో మంచి పేరు సంపాదించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌కు ప్యానెల్ అడ్వొకేట్‌గా ఉన్నారు. హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి న్యాయవాదిగా వ్యవహరించారు. ప్రస్తుతం హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్నారు. కొనకంటి శ్రీనివాసరెడ్డి.. 1966 జూన్ 3న హైదరాబాద్‌లో జన్మించారు. తల్లిదండ్రులు రామలక్ష్మీ, లక్ష్మిరెడ్డి. కొనకంటి శ్రీనివాసరెడ్డి తండ్రి లక్ష్మిరెడ్డి గతంలో ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంకు ఏజీఎంగా పని చేశారు. శ్రీనివాసరెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్‌తో పాటు పలు చోట్ల సాగింది. హైదరాబాద్ నాగార్జున జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. 1991 ఆగస్టు 11న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది చాగరి పద్మనాభరెడ్డి వద్ద వృత్తి జీవితాన్ని ప్రారంభించి క్రిమినల్ లాలో మెలకువలు నేర్చుకున్నారు. తరువాత సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించి పలు కీలక కేసుల్లో వాదనలు వినిపించారు. 2019లో రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులై ప్రస్తుతం ఆ పోస్టులో కొనసాగుతున్నారు. మద్రాస్ హైకోర్టు సీజేగా జస్టిస్ భండారీ! కేంద్రానికి సుప్రీం కొలీజియం సిఫారసు సాక్షి, న్యూఢిల్లీ: మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మునీశ్వర్‌నాధ్ భండారీని ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు న్యాయవాదులు, ముగ్గురు జ్యుడిషియల్ అధికారులను న్యాయమూర్తులుగా నియమించాలని కూడా సిఫార్సు చేసింది. ఒడిశా హైకోర్టులో నలుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని కొలీజియం సిఫార్సు చేసింది. సత్తి సుబ్బారెడ్డి.. 1970 ఫిబ్రవరి 5న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు లక్ష్మీదేవి, బాలనాగేంద్రరెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా అరవల్లి స్వస్థలం. 1989లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి బీఏ పూర్తి చేశారు. 1993లో అదే విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. 1994 జూన్ 22న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. తాడేపల్లిగూడెంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. 1994–97 వరకు అక్కడే ఉన్నారు. 1997లో హైకోర్టుకు ప్రాక్టీస్ మార్చారు. సీనియర్ న్యాయవాది వీఎల్ఎన్ గోపాలకృష్ణమూర్తి వద్ద జూనియర్‌గా చేరారు. తరువాత సొంతంగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. సివిల్ కేసుల్లో మంచి పేరు సంపాదించారు. హైకోర్టులో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. -
న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్ కల్పించండి
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుతో పాటు దేశంలోని వివిధ హైకోర్టుల్లోని న్యాయమూర్తుల నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. ఈమేరకు మంగళవారం కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి ఎస్పీ సింగ్ భగేల్‌కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ వివిధ కోర్టుల్లో జరిగిన న్యాయమూర్తుల నియామకాల్లో ఇప్పటివరకు 3% కంటే ఎక్కువ బీసీలకు, 2% కంటే ఎక్కువ ఎస్సీ, ఎస్టీలకు అవకాశం రాలేదన్నారు. తాము చేసిన విజ్ఞప్తులపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు కృష్ణయ్య చెప్పారు. అనంతరం కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి కిషన్‌రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం నేతలు కలిశారు. బీసీలకు సంబంధించిన డిమాండ్లను ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. -
జడ్జీల నియామకం : ప్రధానికి న్యాయమూర్తి సంచలన లేఖ
లక్నో : హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకంలో కులం, బంధుప్రీతి ప్రధాన అర్హతగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి రంగనాథ్ పాండే ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో న్యాయవ్యవస్ధ బంధుప్రీతి, కులతత్వంతో పెనవేసుకుపోవడం దురదృష్టకరమని, జడ్జీల కుటుంబ సభ్యులకు చెందిన వారు కచ్చితంగా తదుపరి న్యాయమూర్తి అవటం ఖాయమని లేఖలో ప్రస్తావించారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి పారదర్శకతతో కూడిన యంత్రాంగం లేదని దుయ్యబట్టారు. బంధుప్రీతి, కులమే ప్రధాన అజెండాగా మారిందని ప్రధానిక రాసిన లేఖలో పాండే ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీ గదుల్లో తేనీరు సేవిస్తూ సీనియర్ న్యాయమూర్తులు హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకం చేపడుతున్నారని, అత్యంత రహస్యంగా ఈ తంతును ముగిస్తుండటంతో మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాతే నూతన న్యాయమూర్తుల పేర్లు బహిర్గతమవుతున్నాయని చెప్పారు. ఏ న్యాయమూర్తికి పదోన్నతి వచ్చిందో, అందుకు అవసరమైన ప్రాతిపదిక ఏమిటో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి నెలకొందని అన్నారు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ను ఏర్పాటు చేస్తే న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో పారదర్శకత వస్తుందని, అయితే న్యాయవ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి పేరుతో సీనియర్ న్యాయమూర్తులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. -
జడ్జీల నియామకంలో రిజర్వేషన్లు కల్పించాలి
హైదరాబాద్: హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కోటా కల్పించాల ని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సభ్యులుగా గెలుపొందిన బీసీలకు అభినందన సత్కార సభ జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. గత 70 ఏళ్లుగా న్యాయస్థానాల్లో మెజారిటీ తీర్పులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా వస్తున్నాయన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఈ వర్గాల అభివృద్ధిని పూర్తిగా దెబ్బతీస్తున్నారని విమర్శించారు. చట్టసభల్లో రిజ ర్వేషన్లు లేకపోవడం వల్ల ఈ కులాలకు న్యాయం జరగడం లేదని అన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. పంచా యతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 50 శాతానికి పెంచాలని, ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్టును తీసుకురావాలని డిమాండ్ చేశారు. బార్ కౌన్సిల్‌కు ఎన్నికైన సిరికొండ సంజీవరావు, చలకాని వెంకట్ యాదవ్, శంకర్, డి.జనార్దన్, సునీల్ గౌడ్, ఫణీంద్ర భార్గవ్‌లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అడ్వకేట్ నాగుల శ్రీనివాస్ యాదవ్, కొండూరు వినోద్‌కుమార్, జనార్దన్ గౌడ్, విజయ్ ప్రశాంత్, కోల జనార్దన్, వేల్పుల బిక్షపతి, నర్సింహ గౌడ్, నీల వెంకటేశ్ జి.అంజి, అనంతయ్య, జైపాల్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
‘జోసెఫ్ నియామకాన్ని ఎందుకు తొక్కిపెట్టారు’
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కేఎం జోసెఫ్ నియామకాన్ని కేంద్రం తొక్కిపెట్టడం పట్ల సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం విస్మయం వ్యక్తం చేశారు. ఆయన మతం, రాష్ట్రం, ఉత్తరాఖండ్ కేసులో ఇచ్చిన తీర్పు అడ్డంకిగా మారాయా అని కేంద్రాన్ని నిలదీశారు. జడ్జీల నియామకంలో సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సులను విస్మరించడం ద్వారా మోదీ ప్రభుత్వం చట్టానికి అతీతంగా వ్యవహరిస్తోందా అని ప్రశ్నించారు. న్యాయమూర్లు నియామకంలో సుప్రీం కొలీజియం సిఫార్సులే తుది నిర్ణయమని, వాటికి కట్టుబడి ఉండాలని అన్నారు. మోదీ ప్రభుత్వం చట్టానికి అతీతమా అంటూ వరుస ట్వీట్లలో కేంద్రంపై ధ్వజమెత్తారు. సీనియర్ న్యాయవాది ఇందూ మల్హోత్రా సుప్రీం న్యాయమూర్తిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయడం సంతోషకరమని, అయితే జస్టిస్ జోసెఫ్ నియామకం ఇంకా పెండింగ్‌లో ఉండటం దురదృష్టకరమని అన్నారు. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని 2016లో జస్టిస్ జోసెఫ్ నేతృతృంలోని ఉత్తరాఖండ్ హైకోర్టు కొట్టివేస్తూ జారీ చేసిన ఉత్తర్వులతో మోదీ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలడం గమనార్హం. హరీష్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి పగ్గాలు చేపట్టేందుకు ఈ తీర్పు దోహదపడింది. -
సౌదీ కింగ్ మరో కీలక నిర్ణయం
సౌదీ కింగ్ మొహమ్మద్ బిన్ సల్మాన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం సౌదీ కింగ్ కొత్తగా 30 మంది జడ్జీలను నియమించడంతో పాటు 26 మందిని ప్రమోట్ చేసినట్టు సౌదీ అరేబియా స్టేట్ న్యూస్ ఏజెన్సీ ఎస్పీఏ రిపోర్టు చేసింది. అవినీతి కేసులో 11 మంది యువరాజులను, నలుగురు మంత్రులను, డజన్ల కొద్దీ మాజీ మంత్రులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ నియామకం, ప్రమోషన్లు చర్చనీయాంశమైంది. సల్మాన్ ఆదేశాలతోనే వీరిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్, లంచం, వ్యక్తిగత లాభం కోసం ప్రభుత్వ కార్యాలయాన్ని దోచుకోవడం, దోపిడీ చేయడం వంటి ఆరోపణలు వీరిపై ఉన్నాయి. 26 మంది జడ్జీలను ప్రమోట్ చేస్తున్నట్టు మరో 30 మందిని జ్యుడీషియరీలో వివిధ స్థానాల్లో నియమిస్తున్నట్టు సౌదీ రాజు రాయల్ ఆర్డర్ జారీచేశారు. అదుపులోకి తీసుకున్న వారి బ్యాంకుల సమాచారం అందించాలని యునిటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రెగ్యులేటర్స్ ఇప్పటికే ఆదేశించాయి. వీలైతే వీరి అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేయాలని పేర్కొన్నాయి. సెంట్రల్ బ్యాంకు ఆదేశాల మేరకు 1700 దేశీయ బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేశామని బ్యాంకింగ్ వర్గాలు చెప్పాయి. -
జడ్జీల నియామకానికి ‘నీట్’ తరహా పరీక్ష
న్యూఢిల్లీ: కింది స్థాయి కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి నీట్ తరహాలో దేశవ్యాప్త ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామని కేంద్రం ప్రతిపాదించింది. సీబీఎస్ఈ నిర్వహిస్తున్న నీట్‌తో పాటు, ఐబీపీఎస్(బ్యాంకులు) తరహా విధానాల్లో న్యాయమూర్తుల ఖాళీల్ని భర్తీ చేయగలమని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి సుప్రీం కోర్టు సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. అంతేకాకుండా అత్యున్నత ధర్మాసనం పర్యవేక్షణలో జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షను నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రం కోరింది. దేశవ్యాప్తంగా దిగువకోర్టుల్లో ప్రస్తుతమున్న 4,452 ఖాళీలను భర్తీచేయడానికి హైకోర్టుల సూచనలతో యూపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని లేఖలో కేంద్రం ప్రతిపాదించింది. ఎంసీఐపై 13న భేటీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వం లోని కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు–2016 ముసాయిదాపై చర్చించడానికి జూన్ 13న రెండోసారి సమావేశం కానుంది. అనుమతుల జారీ, పర్యవేక్షణల్లో ఎంసీఐ (భారతీయ వైద్య మండలి) విఫలమైందని నీతిఆయోగ్ తేల్చిచెప్పడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. -
సయోధ్య మీ దయ కాదు, బాధ్యత!
సమకాలీనం దేశవ్యాప్తంగా మొత్తం పెండింగ్ కేసులు 2.28 కోట్లని కేంద్ర న్యాయశాఖ అధికారికంగా వెల్లడించింది. ఇక మన దేశంలో జనాభా–న్యాయమూర్తుల నిష్పత్తి కూడా ఆశావహంగా లేదు. సగటున ప్రతి పదిలక్షల జనాభాకు 13 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. ఐక్యరాజ్య సమితి అధ్యయనం జరిపిన 65 దేశాల్లో ఇంతకన్నా తక్కువ నిష్పత్తిలో జడ్జీలున్న దేశాలు గోటమాల, నికరాగువా, కెన్యా ఈ మూడు మాత్రమే! ప్రతి పదిలక్షల జనాభాకు కనీసం 50 మంది జడ్జీలు సగటున ఉండాలని లా కమిషన్ ఏనాడో సిఫారసు చేసింది. ఏ దేశ న్యాయవ్యవస్థ నుంచైనా ఆ దేశస్తులు ఆశించేదేముంటుంది? అమె రికా చీఫ్ జస్టిస్‌గా పనిచేసిన ఎర్ల్ వారెన్ (అంతకు ముందు మూడు పర్యా యాలు కాలిఫోర్నియా గవర్నర్) ఆ పదవి చేపట్టడానికి ముందు ఒక గొప్ప మాట చెప్పారు. ‘‘...ఎక్కడ అన్యాయం జరిగినా మనం సరిదిద్దాలి. ఎక్కడ పేదరికం ఉన్నా మనం నిర్మూలించాలి. ఎక్కడ హింస చెలరేగినా మనం శిక్షించాలి. ఎక్కడ నిర్లక్ష్యం పొడచూపినా మనం శ్రద్ధ–భరోసా కల్పించాలి’’ ఇంతకన్నా న్యాయవ్యవస్థ నుంచి ఎవరైనా ఏమాశిస్తారు? కానీ, ఇవేవీ లభించనప్పుడు... పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది? పరిష్కారం నోచక న్యాయస్థానాల్లో కూరుకుపోయిన కోట్లకొలది కేసుల్లోని కక్షిదారులు మన దేశంలో సకాలంలో న్యాయం అందక అలమటిస్తున్నారు. ‘న్యాయ జాప్యం న్యాయ తిరస్కరణ కిందే లెక్క’ అన్న మౌలిక సూత్రం ప్రకారం చూస్తే ఇక్కడ న్యాయమెంత అపురూపమైందో ఊహించవచ్చు. ఎంత అరు దైనదో! అని కూడా అనిపిస్తుంది. ఒక లోతైన సమీక్ష, ఆత్మపరిశీలన, ప్రగతి శీల సంస్కరణలు, ప్రజాసేవకు పునరంకితం కావాల్సిన దిశా నిర్దేశం అవస రమైన పరిస్థితిని భారత న్యాయవ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటోంది. న్యాయ మూర్తుల ఖాళీలు–నియామకాలు, కొలీజియం–కమిషన్ స్పర్థలు, సుప్రీం కోర్టు–కేంద్రప్రభుత్వం గిల్లికజ్జాలు వంటివి బయటకు కనిపించే పాలనాపర మైన వివాదాల్లాగున్నా... అంతర్లీనమైన ఎన్నో కారణాలు, ఎత్తులు–పై ఎత్తులూ తలచుకుంటే మనసును కలచివేస్తాయి. వాటి ప్రతికూల ప్రభావం ప్రజాస్వామ్య స్పూర్థికి గండికొట్టడమే కాక, భారత రాజ్యాంగం సంకల్పించిన దేశ సమ పురోగతినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పైపైన కనిపించే న్యాయ– కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య విభేదాలుగానో, న్యాయ–శాసన వ్యవస్థల మధ్య పంతాలుగానో వీటిని చూడలేము. ఇంకొంచెం లోతుకు వెళ్లి, రాజ్యాంగం అమలును సాకారం చేసే మూడు కీలకాంగాల మధ్య సమ న్వయ సాధనకు ప్రతిబంధకమౌతున్న కారణాల్ని అన్వేషించాలి. ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్ వంటి వారు చిత్తశుద్ధితో కృషిచేయాలి. ఏకాభిప్రాయం ఎందుకు రాదు? ఏ విషయంలోనైనా కాస్త పట్టువిడుపులుంటే ఏకాభిప్రాయం సుసాధ్యమే! న్యాయమూర్తుల్ని న్యాయమూర్తులే ఎంపిక చేయడమేమిటన్న మౌలిక ప్రశ్నతో ‘కొలీజియం’ పద్ధతి వివాదాస్పదమైంది. కొలీజియం భేటీల్లో వెల్ల డయ్యే అభి ప్రాయాల్ని రికార్డు చేయటం లేదని, పారదర్శకత లోపించిందని, జవాబు దారీతనం కోసం వాటిని పొందుపరచడం అవసరమని... అందులో సభ్యు డైన జస్టిస్ చలమేశ్వర్ ఫిర్యాదు చేసిన తర్వాత ఈ వివాదం మరింత జటిల మైంది. న్యాయమూర్తుల నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘జాతీయ న్యాయ నియామక కమిషన్’ (ఎన్‌జేఏసీ) ప్రక్రియ కూడా లోపభూయిష్ఠంగా ఉందనే విమర్శలు వచ్చాయి. దరిమిలా గత సంవ త్సరం సుప్రీంకోర్టు ధర్మాసనం సదరు కమిషన్ చెల్లుబాటునే కొట్టివేసింది. ఫలి తంగా తలెత్తిన ప్రతిష్ఠంభన ఉన్నత న్యాయస్థానాల్లో ఖాళీల భర్తీకి ఆటం కంగా మారింది. ఈ లోపు, నియామకాల కోసం కొంత ప్రత్యామ్నాయ ప్రక్రియ జరిగినా... ప్రతిష్ఠంభన మాత్రం తొలగలేదు. నిజానికి అసాధారణ ఖాళీలకు, కేసుల పరిష్కారంలో జరుగుతున్న విపరీత జాప్యాలకు అదొక్కటే కారణం కాదు. చివరకు పరిస్థితి, ‘న్యాయవ్యవస్థను ధ్వంసం చేసి, న్యాయ స్థానాల్నే మూసివేయాలనుకుంటున్నారా? అది సాగనివ్వం...!’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహించే దాకా వచ్చింది. ‘మా సహనం పరీ క్షించకండి, కార్యనిర్వాహక వ్యవస్థ నిష్క్రియాపరత్వానికి న్యాయవ్యవస్థను బలిపెట్టకండి’ అని కూడా మందలించారు. కమిషన్ రద్దుతో పూర్వపు కొలీ జియం వ్యవస్థ తిరిగి అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వపు అభ్యంతరాల దృష్ట్యా కొత్తగా ఒక ‘ప్రక్రియ పత్రం’ (ఎంఓపీ) రూపొందించాలని సుప్రీం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ఎంఓపీ పై ఏకా భిప్రాయం కుదరకపోవడంతో అది అమల్లోకి రాలేదు. ‘అయినా నియామక ప్రక్రియ ఏం ఆగిపోలేదు కదా! గడచిన రెండేళ్లలో పెద్ద సంఖ్యలోనే జడ్జీల నియామకాలు, సుప్రీం కొలీజియం ప్రతిపాదించినట్టు జడ్జీల బదిలీలు చేశాం’ అని కేంద్ర ప్రభుత్వం అంటోంది. ‘86 మంది హైకోర్టు జడ్జీల్ని, నలు గురు సుప్రీంకోర్టు జడ్జీల్ని కొత్తగా నియమించాం, 33 మంది హైకోర్టు జడ్జీల్ని, నలుగురు సుప్రీంకోర్టు జడ్జీల్ని కొలీజియం ప్రతిపాదించినట్టే బది లీలు చేశాం’ అన్నది కేంద్ర వాదన. ‘మేం 77 మంది జడ్జీల జాబితా ఇస్తే, కేవలం 18 మందినే ఖరారు చేశారు. మిగతా పేర్ల జాబితా పెట్టుకొని కూర్చో వడం ఏం పద్ధతి, అందులో ఎవరి విషయంలోనైనా అభ్యంతరాలుంటే వెనక్కి పంపొచ్చు కదా! మేం పరిశీలించి, సరిదిద్ది పంపుతాం’ అనేది సుప్రీం వాదన. ఎదుటివారి ఆధిపత్యాన్ని అంగీకరించరాదన్న ఇరువురి భావనే ప్రస్తుత ప్రతిష్టంభనకు కారణమని న్యాయనిపుణులభిప్రాయపడుతున్నారు. కేంద్రం తాజాగా రూపొందించిన ఎంఓపీలో ఒక ప్రతిపాదన ఉంది. కొలీ జియం ప్రతిపాదనలు ఇష్టం లేకుంటే, దేశ భద్రత కారణాలతో వీటో చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికుంది. అది తుది నిర్ణయమౌతుంది, అలాంటి నిర్ణయాధికారం ఉండటాన్ని ఆధిపత్యంగానే సుప్రీం భావిస్తున్నట్టుంది. గగుర్పాటు కలిగించే గణాంకాలు దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో పేరుకుపోయిన పెండింగ్ కేసుల్ని తలచు కుంటే గగుర్పాటు కలుగుతుంది. దేశవ్యాప్తంగా 2.72 కోట్ల కేసులు పెండిం గ్లో ఉండగా, అందులో 2.30 కోట్ల కేసులు కిందిస్థాయి (సబార్డనేట్) న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నాయని ఒక లెక్క. అన్ని హైకోర్టుల్లో 40 లక్షల కేసుల వరకు, సుప్రీంకోర్టులో 60 వేల వరకు కేసులు, వివాదాలు అపరి ష్కృతంగా ఉన్నాయనేది విశ్వసనీయ సమాచారం. గత సెప్టెంబరు1 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం పెండింగ్ కేసులు 2.28 కోట్లని కేంద్ర న్యాయశాఖ అధికారికంగా వెల్లడించింది. ఇక మన దేశంలో జనాభా–న్యాయమూర్తుల నిష్పత్తి కూడా ఆశావహంగా లేదు. సగటున ప్రతి పదిలక్షల జనాభాకు 13 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. ఐక్యరాజ్యసమితి అధ్యయనం జరిపిన 65 దేశాల్లో ఇంతకన్నా తక్కువ నిష్పత్తిలో జడ్జీలున్న దేశాలు గోటమాల, నిక రాగువా, కెన్యా ఈ మూడు మాత్రమే! ప్రతి పదిలక్షల జనాభాకు కనీసం 50 మంది జడ్జీలు సగటున ఉండాలని చాలా కాలం కిందటే లా కమిషన్ సిఫా రసు చేసింది. ఇక ఖాళీల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇదే నెల ఒకటో తేదీ నాటికి ఉన్నత న్యాయస్థానాల్లో ఈ ఖాళీల సంఖ్య 461 (1079 ఆమోదించిన పోస్టులు) అని న్యాయశాఖ వెల్లడించింది. అంటే, దాదాపు 46 శాతం పైనే ఖాళీలన్నమాట! అందులో అయిదు ఖాళీలు సుప్రీం కోర్టువి కూడా ఉన్నాయి. మన ఉమ్మడి న్యాయస్థానంలో ఆమోదించిన 61 జడ్జీ స్థానాలకు గాను 23 మంది మాత్రమే ఉన్నారు. ఇది సగం కన్నా చాలా తక్కువ. ఇక దేశంలో కింది స్థాయి న్యాయస్థానాల్లో 4,400 జడ్జీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనుమతించిన పోస్టుల్లో ఇది దాదాపు సగం సంఖ్య. ఖాళీ లను భర్తీ చేసేలా జడ్జీల నియామకం పాలనాపరమైన నిర్ణయమే అయినా ఉన్నత న్యాయస్థానాల క్రియాశీల పాత్ర ఉంటుంది. కోర్టుల్లో కేసుల పరి ష్కారం కావడంలో జాప్యాలకు అనేకానేక కారణాలున్నా, జడ్జీల కొరత, ఖాళీలు కూడా ప్రధానమైనదేనని లా కమిషన్ 245వ నివేదిక స్పష్టం చేసింది. వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని, మౌలిక/కనీస సదుపాయాల్ని మెరుగు పరచాలని విస్పష్టంగా సిఫారసు చేసింది. అమలు ఆమడ దూరంలోనే ఉంది. ‘కేసు ఓడిన వాడు కోర్టు ప్రాంగణంలో ఏడిస్తే, గెలిచిన వాడు ఇంటికొచ్చి ఏడ్చాడ’న్న నూరేళ్ల కింద పుట్టిన నానుడి కాస్త అటుఇటుగా ఇప్పటికీ వాస్తవం కావడమే దురదృష్టకరం! సంస్కరణ లు, చొరవ అవసరం ‘దేశంలోని న్యాయస్థానాల్లో ప్రభుత్వమే ఓ పెద్ద కక్షిదారు, ఆ పరిస్థితి ఉండ కూడదు, వీలయినన్ని వివాదాల్ని ప్రభుత్వ స్థాయిలోనే పరిష్కరించుకొని న్యాయస్థానాలపై భారం తగ్గించాల’ని స్వయానా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెలవిచ్చారు. నిజమే! పాలకుల నిర్లక్ష్యం, కార్యనిర్వాహక వ్యవస్థ తోలుమందం వైఖరి వల్ల సమస్యలు, చట్టోల్లంఘనలు తలెత్తి బాధితులైన పౌరులు న్యాయస్థానాలకెక్కాల్సి వస్తోంది. ఇది చాలదన్నట్టు, పౌరులకు అనుకూలంగా కోర్టులు తీర్పిచ్చిన సందర్భాల్లో కూడా ప్రభుత్వాలు పెడచెవిన పెట్టి, న్యాయధిక్కార (కంటెప్ట్) కేసులు వేసుకోవాల్సిన పరిస్థితులు కల్పిస్తు న్నారు. ఇది పౌరులకు అదనపు కష్టం, ఓ రకంగా వేధింపే! అభివృద్ధి చెందిన దేశాలు వినియోగిస్తున్నట్టు ఆధునిక శాస్త్ర–సాంకేతికతను ఉపయోగించుకొని న్యాయ విచారణ ప్రక్రియల్లో ఇ–సిస్టమ్స్ అభివృద్ధి చేసుకోవాలి. న్యాయ వ్యవస్థలోనూ బాధ్యత–జవాబుదారీతనాన్ని వ్యవస్థాగతం చేయాల్సిన అవస రాన్ని న్యాయకోవిదులు నొక్కి చెబుతున్నారు. రెండో తరం సంస్కరణలకు వాకిళ్లు తెరవడమే కాకుండా న్యాయమూర్తులు క్రియాశీలంగా వ్యవహరిస్తూ మరింత చొరవ చూపాలి. న్యాయ జాప్యాల నివారణకు తోడ్పడుతూనే సత్వర న్యాయానికి మానవీయ దృక్పథాన్ని కనబరచాలి. యావజ్జీవ శిక్షపడ్డ కేసుల్లో సదరు అప్పీళ్లు ఉన్నత న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నపుడు, సదరు ఖైదీలకు సానుకూల దృక్ప«థంతో బెయిలివ్వాలని హైదరాబాద్ హైకోర్టు గురువారం ఇచ్చిన తీర్పు ప్రశంసనీయం. అభియోగం ఎదుర్కొం టున్న ఒక వ్యక్తి, సత్యాసత్య నిరూపణతో నిమిత్తం లేకుండా నేరాన్ని స్వయంగా అంగీకరించినా... విధించే పూర్తి శిక్షా కాలానికి మించి, విచారణ ఖైదీలుగానే జైళ్లలో మగ్గే దుస్థితినేమనాలి? విచారణ అనంతరం దోషిగా తేలినా, నిర్దోషిగా విడుదలైనా, మన పాలనాపరమైన నిర్హేతుక కారణాలతో జైల్లో మగ్గిన సదరు కాలాన్ని ఎవరు వెనక్కి తెచ్చిస్తారు? ఖాళీల్ని భర్తీ చేస్తూ సత్వర నియామకాలు జరిపి కోట్లాది పెండింగ్ కేసుల్ని పరిష్కరించాలి. మహ నీయుడు జస్టిస్ కృష్ణ అయ్యర్ చెప్పిన ఒకమాట గుర్తుచేస్తాను. ‘‘...తొమ్మిది మంది జడ్జీల ధర్మాసనం తీర్పుతో, దురదృష్టకరమైన ప్రయోగంగా వచ్చిన కొలీజియం పక్షపాత నియామకాలెంత అసంతృప్తి నిచ్చాయో తెలుసు... అలా అని కార్యనిర్వాహక వ్యవస్థనూ విశ్వసించలేము, ఎందుకంటే, దానివల్ల నియామక ప్రక్రియలోకి రాజకీయాలు జొరబడ తాయి. ప్రధానమంత్రికి నిర్ణయాధికారాన్ని కట్టబెట్టే పద్ధతిని మనం బ్రిటిష్ పార్లమెంటరీ విధానం నుంచి అరువు తెచ్చుకున్నాం, అదెంత లోపభూయిష్ట మంటే, 30 మంది బంధువులు, పార్టీ శ్రేణుల్ని బెంచి మీదకు తెచ్చినట్టు లార్డ్ హల్స్బరీనే విమర్శలెదుర్కోవాల్సి వచ్చింది. అందుకని, సమపాళ్లలో ప్రాతి నిధ్యముండే జాతీయ న్యాయ కమిషన్ నియామకమే మంచిది. జడ్జీల పనితీరును కూడా ఇదే కమిషన్ తనిఖీ చేయాలి, పర్యవేక్షించాలి.’’ ఆయన చెప్పిన బాటలో, ప్రజాస్వామ్య మూల స్తంభాలయిన న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు సమన్వయంతో ఆలోచించి పనికొచ్చే పరిష్కారం వెతకాలి. (వ్యాసకర్త : దిలీప్ రెడ్డి ఈ–మెయిల్: dileepreddy@sakshi.com) -
ఎడతెగని కీచులాట
ప్రజాస్వామ్యంలో కీలక వ్యవస్థలు పరస్పరం తలపడటం... అది అంతూదరీ లేకుండా కొనసాగడం ఎవరికైనా ఆందోళన కలిగిస్తుంది. న్యాయమూర్తుల నియామకం వ్యవహారంలో కేంద్రానికీ, న్యాయ వ్యవస్థకూ మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న వివాదం తీరు ఇలాగే ఉంది. కేంద్రంలో ఎవరున్నా ఇందులో మార్పుండటం లేదు. జస్టిస్ టీఎస్ ఠాకూర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చాక దీని సంగతి తేల్చాలన్న పట్టుదలను ప్రదర్శిస్తున్నారు. గతంలో పనిచేసినవారు కేంద్రానికి ప్రతిపాదనలు పంపి ఊరుకునేవారు. సందర్భం వచ్చినప్పుడు దాన్ని గుర్తు చేసేవారు. కానీ పురోగతి శూన్యం. అందుకే కాబోలు... పాతవారికి భిన్నంగా జస్టిస్ ఠాకూర్ కేంద్రాన్ని ‘ఎలాగైనా...’ ఒప్పించి తీరాలన్న దృక్పథాన్ని ప్రదర్శించడం మొదలెట్టారు. న్యాయమూర్తుల నియామకంపై దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని విచారిస్తున్న సందర్భంగా నాలుగైదు రోజుల క్రితం ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు అందులో భాగమే. న్యాయమూర్తుల నియామకాలపై సాచివేత ధోరణి అవలంబించడం ద్వారా న్యాయవ్యవస్థను నిరోధించాలని చూస్తే... నాశనం చేయబూనుకుంటే చూస్తూ ఊరుకోబోమని కార్యనిర్వాహక వ్యవస్థను ఆయన హెచ్చరించారు. ‘మాకుగా మేం ఏ వ్యవస్థతోనూ ఘర్షణ పడాలని అనుకోవడం లేదు. కానీ అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే’ అని కూడా ఆయనన్నారు. జస్టిస్ ఠాకూర్ ఈ మాదిరి వ్యాఖ్యలు చేయడం ఇది మొదటి సారి కాదు. గత మార్చిలో ప్రధాని, ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తులు పాల్గొన్న జాతీయ సదస్సులో ఏకంగా ఆయన కంటతడి పెట్టారు. మరో సందర్భంలో ‘మేం న్యాయపరంగా జోక్యం చేసుకునే స్థితి కల్పించకండి’ అని కేంద్రాన్ని హెచ్చరించారు. తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా ఆ మాదిరే ఉన్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీఠంపై ఉన్నవారు ఇలా మాట్లాడటం తగదని అభిప్రాయపడినవారున్నారు. సమస్య తీవ్రత నిజమే అయినా దాన్ని పరిష్క రించుకోవడానికి ఘర్షణ వైఖరి మంచిది కాదన్నవారున్నారు. ఆయన తీరుపై వ్యక్తమవుతున్న అభిప్రాయాల మాటెలా ఉన్నా న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల కొరత ఉండటం, కేసుల పరిష్కారానికి అదొక అడ్డంకిగా ఉండటం కాదనలేని సత్యం. అయిదేళ్లుగా వివిధ కోర్టుల్లో 80 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఇందులో 16 లక్షలకు పైగా కేసులు వివిధ హైకోర్టుల్లో పెండింగ్ పడితే, మిగిలినవి జిల్లా కోర్టుల్లో, సబార్డినేట్ కోర్టుల్లో కునుకు తీస్తున్నాయి. సుప్రీంకోర్టులో 27,184 కేసులు మూడేళ్లుగా ఎటూ తేల కుండా ఉన్నాయి. ఈ గణాంకాలన్నీ సమస్య తీవ్రతను సూచిస్తున్నాయి. లక్షలాది మంది పౌరుల జీవితాలు వీటితో ముడిపడి ఉన్నాయని... తుది నిర్ణయం కోసం వారంతా ఏళ్లతరబడి కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారని సానుభూతితో అర్ధం చేసుకుంటే తప్ప ఈ పెండింగ్ సమస్య తీరదు. అయితే పెండింగ్ కేసుల విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి చొరవా లేదని చెప్పలేం. ఇందుకు దోహదపడుతున్న పలు అంశాలను అది గుర్తించింది. న్యాయ మూర్తుల కొరత అందులో ఒకటి మాత్రమే. కేంద్ర, రాష్ట్ర చట్టాలు లెక్కకు మిక్కిలి ఉండటం వీటిలో ప్రధానమైనదని భావించింది. మొదటి అప్పీళ్లు పేరుకుపోవడం, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్వంటివి వెలువరించే తీర్పులను హైకోర్టుల్లో సవాల్ చేసే ధోరణి పెరగడం, తరచుగా కేసుల వాయిదా, విచారణలో ఉన్న కేసుల తీరుతెన్ను లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే, ఏ స్థితిలో ఉన్నాయో ఆరా తీసే వ్యవస్థ అమల్లో లేకపోవడం వగైరాలు పెండింగ్‌కు ప్రధాన కారణమని భావించింది. లా కమిషన్ సైతం ఈ జాప్యాన్ని నివారించడానికి కొన్ని సూచనలు చేసింది. వీటన్నిటినీ లోతుగా సమీక్షించి తుది నిర్ణయానికి రావాలంటే రెండు వ్యవస్థలూ సదవగాహ నతో సమష్టిగా పనిచేయాల్సి ఉంటుంది. కానీ అలాంటి ధోరణి ఇరువైపులా కనబ డటం లేదు. సుప్రీంకోర్టు, హెకోర్టుల్లో కేసులు పెండింగ్ పడిపోవడం గురించి మాట్లాడుతున్న న్యాయవ్యవస్థ కింది కోర్టుల్లో తెమలని కేసుల గురించి మాట్లా డదేమని కేంద్రం అడుగుతోంది. అది సమాధానం చెప్పుకోవాల్సిన ప్రశ్నే. కింది కోర్టుల్లో 5,000కు పైగా ఖాళీలున్నా న్యాయవ్యవస్థ వాటిని భర్తీ చేయలేక పోతోంది. ఇలా ఎవరికి వారు ఒకరి తప్పులు మరొకరు ఎత్తి చూపుకుంటూ కాల క్షేపం చేయడంవల్ల సామాన్య పౌరులకు ఒరిగేదేమీ ఉండదు. వారికి కావలసింది సత్వర న్యాయం. కేంద్రం తీసుకొచ్చిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) చట్టం చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చి గత నెలతో సంవత్సరం పూర్తయింది. అంతకుముందున్న కొలీజియం వ్యవస్థే ప్రస్తుతం అమలవుతోంది. కానీ దానికి అనుగుణంగా వెలువడాల్సిన విధాన పత్రం(ఎంఓపీ)పై పేచీ ఏర్పడింది. ఎంఓపీని ఖరారు చేసి పంపితే నియామకాలు వేగం పుంజుకుంటాయని ప్రభుత్వమూ... దాని సంగతి విడిచి పెట్టి ముందు నియామకాల సంగతి చూడమని సర్వోన్నత న్యాయస్థానమూ భీష్మించుకు కూర్చున్నాయి. ఆ విషయంలో కేంద్రం, న్యాయ వ్యవస్థ మధ్య అంగీకారం కుదిరితే తప్ప నియామకాల్లో పురోగతి సాధ్యం కాదు. సమస్య తీవ్రతను గమనించి పాత ఎంఓపీ ఆధారంగా వివిధ హైకోర్టుల్లో కొత్తగా 86మంది న్యాయమూర్తుల నియామకం, ఇప్పుడున్న 121మంది అదనపు న్యాయ మూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా ఖరారు చేయడంవంటివి పూర్తి చేశా మని... ఎన్నాళ్లిలా నెట్టుకురావాలని కేంద్రం అడుగుతోంది. కానీ చేయాల్సిన నియామకాలతో పోలిస్తే పూర్తయింది చాలా స్వల్పమన్నది సుప్రీంకోర్టు వాదన. ఒక్క అలహాబాద్ హైకోర్టులోనే 160మంది న్యాయమూర్తులకు 77మంది మాత్రమే ఉన్నారని గుర్తు చేస్తోంది. ఇది వ్యక్తుల మధ్యనో, వ్యవస్థల మధ్యనో ఆధిపత్య పోరుగా, అహంభావ సమస్యగా మారడం మంచిది కాదు. ప్రజల శ్రేయస్సును, వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించడం అవసరమని ఇద్దరూ గమనించాలి. సంయమనంతో పరిష్కారం దిశగా కదలాలి.