జడ్జీల నియామకానికి ‘నీట్’ తరహా పరీక్ష
న్యూఢిల్లీ: కింది స్థాయి కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి నీట్ తరహాలో దేశవ్యాప్త ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామని కేంద్రం ప్రతిపాదించింది. సీబీఎస్‌ఈ నిర్వహిస్తున్న నీట్‌తో పాటు, ఐబీపీఎస్(బ్యాంకులు) తరహా విధానాల్లో న్యాయమూర్తుల ఖాళీల్ని భర్తీ చేయగలమని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది.
ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి సుప్రీం కోర్టు సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. అంతేకాకుండా అత్యున్నత ధర్మాసనం పర్యవేక్షణలో జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షను నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రం కోరింది. దేశవ్యాప్తంగా దిగువకోర్టుల్లో ప్రస్తుతమున్న 4,452 ఖాళీలను భర్తీచేయడానికి హైకోర్టుల సూచనలతో యూపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని లేఖలో కేంద్రం ప్రతిపాదించింది.
ఎంసీఐపై 13న భేటీ
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వం లోని కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు–2016 ముసాయిదాపై చర్చించడానికి జూన్ 13న రెండోసారి సమావేశం కానుంది. అనుమతుల జారీ, పర్యవేక్షణల్లో ఎంసీఐ (భారతీయ వైద్య మండలి) విఫలమైందని నీతిఆయోగ్ తేల్చిచెప్పడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.