హైకోర్టుకు ఏడుగురు జడ్జీలు! | Supreme Court collegium recommended seven posts of judges AP High Court | Sakshi
Sakshi News home page

హైకోర్టుకు ఏడుగురు జడ్జీలు!

Published Tue, Feb 1 2022 3:28 AM | Last Updated on Tue, Feb 1 2022 8:22 AM

Supreme Court collegium recommended seven posts of judges AP High Court - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో న్యాయమూర్తుల పోస్టులకు ఏడుగురు న్యాయవాదుల పేర్లను సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానం చేసింది. ఈ నెల 29న సమావేశమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్‌ ఉమేశ్‌ ఉదయ్‌ లలిత్, జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌లతో కూడిన కొలీజియం ఈ మేరకు తీర్మానం చేస్తూ ఏడుగురు న్యాయవాదుల పేర్లను కేంద్రానికి పంపింది. కేంద్ర ప్రభుత్వం ఈ పేర్లకు ఆమోదం తెలిపిన తరువాత అవి రాష్ట్రపతికి చేరుతాయి. రాష్ట్రపతి నియామక ఉత్తర్వులు వెలువడిన అనంతరం ఏడుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన వారిలో కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తర్లాడ రాజశేఖరరావు, సత్తి సుబ్బారెడ్డి, రవి చీమలపాటి, వడ్డిబోయన సుజాత పేర్లున్నాయి. 

27కి చేరుకోనున్న న్యాయమూర్తుల సంఖ్య
హైకోర్టు కొలీజియం గతేడాది ఏడుగురి పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసింది. వీరితోపాటు ఎస్‌ఎం సుభానీ పేరును కూడా హైకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఎనిమిది మంది పేర్లపై చర్చించిన సుప్రీంకోర్టు కొలీజియం సుభానీ మినహా మిగిలిన ఏడుగురు పేర్లకు ప్రస్తుతం ఆమోదముద్ర వేసింది. సుభానీ విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం తెలియరాలేదు. సుప్రీంకోర్టు ఆమోదించిన ఏడుగురిలో శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర్లు, రాజశేఖరరావు, సుబ్బారెడ్డి, రవి, సుజాత హైకోర్టు న్యాయవాదులు కాగా రామకృష్ణ ప్రసాద్‌ సుప్రీంకోర్టు న్యాయవాదిగా కొనసాగుతున్నారు. కొనకంటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా, సుజాత ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. వెంకటేశ్వర్లు, సుబ్బారెడ్డి, రవి గతంలో వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లకు స్టాండింగ్‌ కౌన్సిళ్లుగా ఉన్నారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 27కి చేరుకుంటుంది.


గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌..
1964 మే 28న జన్మించారు. తండ్రి గన్నమనేని గాంధీ చౌదరి. ప్రాథమిక విద్యాభ్యాసం గుంటూరు లయోలా పబ్లిక్‌ స్కూల్‌లో సాగింది. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో 12వ తరగతి వరకు చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని ఆంధ్ర విద్యాలయ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌లో బీకాం చదివారు. 1990లో ఏసీ కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1991–93లో నాగార్జున యూనివర్సిటీ నుంచి మాస్టర్‌ లా పొందారు.1991లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. 2000లో సుప్రీంకోర్టుకు ప్రాక్టీస్‌ మార్చారు. అక్కడ పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. రాజ్యసభ సెక్రటేరియట్, రాజ్యసభ టెలివిజన్‌కు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా ఉన్నారు. నాగాలాండ్‌ ప్రభుత్వం తరఫున పలు కేసులు వాదించారు.

నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు..
1967 జూలై 1న జన్మించారు. తండ్రి రామకృష్ణారావు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీకాం చదివారు. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంఎల్‌ పూర్తి చేశారు. 1992 జూన్‌ 30న న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. 2014 డిసెంబర్‌ నుంచి 2019 వరకు హైకోర్టులో ఆంధ్ర ప్రాంత మునిసిపాలిటీలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 2015–16లో మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా స్టాండింగ్‌ కౌన్సిల్‌గా కూడా ఉన్నారు.

తర్లాడ రాజశేఖరరావు..
1967 ఆగస్టు 3న జన్మించారు. శ్రీకాకుళం జిల్లా మూలసవలాపురం స్వగ్రామం.తల్లి కళ్యాణి. తండ్రి సురన్నాయుడు. విశాఖపట్నం ఎన్‌బీఎం కాలేజీలో బీఎస్‌సీ, బీఎల్‌ పూర్తి చేశారు. 1993 ఆగస్టులో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వీవీఎస్‌ రావు న్యాయవాదిగా ఉన్న సమయంలో జూనియర్‌గా వృత్తి మెలకువలు నేర్చుకున్నారు. తరువాత సొంతంగా ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు. విశ్రాంత న్యాయమూర్తి టీసీహెచ్‌ సూర్యారావుకు సమీప బంధువు.

రవి చీమలపాటి..
1967 డిసెంబర్‌ 4న విశాఖపట్నంలో జన్మించారు. తండ్రి శ్రీరామమూర్తి విశాఖలో పేరుపొందిన న్యాయవాది. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1995లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. తండ్రి వద్దే వృత్తి జీవితాన్ని ఆరంభించారు. సోదరుడు కూడా న్యాయవాదే. ఏడాదిన్నర తరువాత ప్రాక్టీస్‌ను హైకోర్టుకు మార్చారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధిత కేసులు వాదించారు. మూడేళ్ల పాటు పంచాయతీరాజ్‌ శాఖ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా ఉన్నారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు న్యాయవాదిగా వ్యవహరించారు.

వడ్డిబోయన సుజాత..
1966 సెప్టెంబర్‌ 10న జన్మించారు. పాఠశాల విద్య మొత్తం ఢిల్లీ కేంద్రీయ విద్యాలయంలో పూర్తి చేశారు. ఎంఏ (పొలిటికల్‌సైన్స్‌), ఎంఏ (సైకాలజీ), ఎల్‌ఎల్‌ఎం చదివారు. 1998లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. సీనియర్‌ న్యాయవాదులు ఏవీ శివయ్య, భాస్కర లక్ష్మీల వద్ద జూనియర్‌గా పనిచేశారు. రాజ్యాంగ సంబంధిత కేసుల్లో మంచి పేరు సంపాదించారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌కు ప్యానెల్‌ అడ్వొకేట్‌గా ఉన్నారు. హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి న్యాయవాదిగా వ్యవహరించారు. ప్రస్తుతం హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్నారు.

కొనకంటి శ్రీనివాసరెడ్డి..
1966 జూన్‌ 3న హైదరాబాద్‌లో జన్మించారు. తల్లిదండ్రులు రామలక్ష్మీ, లక్ష్మిరెడ్డి. కొనకంటి శ్రీనివాసరెడ్డి తండ్రి లక్ష్మిరెడ్డి గతంలో ఏపీ కోఆపరేటివ్‌ సెంట్రల్‌ అగ్రికల్చర్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు ఏజీఎంగా పని చేశారు. శ్రీనివాసరెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్‌తో పాటు పలు చోట్ల సాగింది. హైదరాబాద్‌ నాగార్జున జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ చదివారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. 1991 ఆగస్టు 11న న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. ప్రముఖ సీనియర్‌ న్యాయవాది చాగరి పద్మనాభరెడ్డి వద్ద వృత్తి జీవితాన్ని ప్రారంభించి క్రిమినల్‌ లాలో మెలకువలు నేర్చుకున్నారు. తరువాత సొంతంగా ప్రాక్టీస్‌ ప్రారంభించి పలు కీలక కేసుల్లో వాదనలు వినిపించారు. 2019లో రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమితులై ప్రస్తుతం ఆ పోస్టులో కొనసాగుతున్నారు.

మద్రాస్‌ హైకోర్టు సీజేగా జస్టిస్‌ భండారీ!
కేంద్రానికి సుప్రీం కొలీజియం సిఫారసు
సాక్షి, న్యూఢిల్లీ: మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మునీశ్వర్‌నాధ్‌ భండారీని ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు ముగ్గురు న్యాయవాదులు, ముగ్గురు జ్యుడిషియల్‌ అధికారులను న్యాయమూర్తులుగా నియమించాలని కూడా సిఫార్సు చేసింది. ఒడిశా హైకోర్టులో నలుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని కొలీజియం సిఫార్సు చేసింది. 

సత్తి సుబ్బారెడ్డి..
1970 ఫిబ్రవరి 5న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు లక్ష్మీదేవి, బాలనాగేంద్రరెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా అరవల్లి స్వస్థలం. 1989లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి బీఏ పూర్తి చేశారు. 1993లో అదే విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. 1994 జూన్‌ 22న న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. తాడేపల్లిగూడెంలో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు. 1994–97 వరకు అక్కడే ఉన్నారు. 1997లో హైకోర్టుకు ప్రాక్టీస్‌ మార్చారు. సీనియర్‌ న్యాయవాది వీఎల్‌ఎన్‌ గోపాలకృష్ణమూర్తి వద్ద జూనియర్‌గా చేరారు. తరువాత సొంతంగా ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు. సివిల్‌ కేసుల్లో మంచి పేరు సంపాదించారు. హైకోర్టులో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) స్టాండింగ్‌ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement