సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కేఎం జోసెఫ్ నియామకాన్ని కేంద్రం తొక్కిపెట్టడం పట్ల సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం విస్మయం వ్యక్తం చేశారు. ఆయన మతం, రాష్ట్రం, ఉత్తరాఖండ్ కేసులో ఇచ్చిన తీర్పు అడ్డంకిగా మారాయా అని కేంద్రాన్ని నిలదీశారు. జడ్జీల నియామకంలో సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సులను విస్మరించడం ద్వారా మోదీ ప్రభుత్వం చట్టానికి అతీతంగా వ్యవహరిస్తోందా అని ప్రశ్నించారు. న్యాయమూర్లు నియామకంలో సుప్రీం కొలీజియం సిఫార్సులే తుది నిర్ణయమని, వాటికి కట్టుబడి ఉండాలని అన్నారు.
మోదీ ప్రభుత్వం చట్టానికి అతీతమా అంటూ వరుస ట్వీట్లలో కేంద్రంపై ధ్వజమెత్తారు. సీనియర్ న్యాయవాది ఇందూ మల్హోత్రా సుప్రీం న్యాయమూర్తిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయడం సంతోషకరమని, అయితే జస్టిస్ జోసెఫ్ నియామకం ఇంకా పెండింగ్‌లో ఉండటం దురదృష్టకరమని అన్నారు. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని 2016లో జస్టిస్ జోసెఫ్ నేతృతృంలోని ఉత్తరాఖండ్ హైకోర్టు కొట్టివేస్తూ జారీ చేసిన ఉత్తర్వులతో మోదీ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలడం గమనార్హం. హరీష్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి పగ్గాలు చేపట్టేందుకు ఈ తీర్పు దోహదపడింది.
Comments
Please login to add a commentAdd a comment